సంప్రదాయానికి తిలోదకాలు

ABN , First Publish Date - 2021-10-30T05:59:25+05:30 IST

ప్రపంచ ఆధ్మాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుడి సన్నిధిలో నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సంప్రదాయానికి తిలోదకాలు
నిత్య కల్యాణం వేదిక వెనుక నుంచి ఫొటోలు తీస్తున్న మల్లారెడ్డి బృందం సభ్యులు

 నృసింహుడి సన్నిధిలో నిబంధనలకు నీళ్లు 

 వీఐపీల పర్యటన సమయంలో సామాన్యులపాట్లు

 గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ 

పెద్దల దర్శనాలకు అధికారుల పెద్దపీట

 మంత్రి మల్లారెడ్డి పర్యటనలో బాలాలయంలో కార్యకర్తల హడావుడి

డ్రోన్‌కెమెరాలు, సెల్ఫీలతో నేతల సందడి   

కవచమూర్తుల ఫొటో తీయడంతో చెలరేగిన వివాదం

ప్రపంచ ఆధ్మాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుడి సన్నిధిలో నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీఐపీల పర్యటన సమయంలో సామాన్యులు నానా తంటాలు పడుతున్నారు. పెద్దలకోసం సామాన్యులను గంటల తరబడి క్యూలైన్లలోనే నిలిపివేస్తుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన మంత్రి మల్లారెడ్డి పర్యటన సమయంలో భక్తులకు స్వామివారి దర్శనాలను గంటసేపు నిలిపివేశారు. దీంతో ఇటు చిన్నపిల్లలు, వారి తల్లులు, అటు వృద్ధులు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మంత్రి అనుచరుల హడావుడి బాలాలయంలో అంతా ఇంతా కాదు. వందలాది మంది బాలాలయానికి చేరుకొని సెల్ఫీలు, డ్రోన్‌ కెమెరాలతో ఫోటోలు దిగుతూ నిబంధనలకు పాతరేశారు. అయితే కవచమూర్తుల ఫొటో తీయడం నిషేధం, ఈ విషయాన్ని సైతం పక్కనబెట్టి కవచమూర్తుల ఫోటోలు తీసి వివాదానికి కారణమయ్యారు. 

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)


యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో భక్తులు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం. భక్తులకు ఎలక్ర్టానిక్‌ పరికరాలతోపాటు సెల్‌ఫోను,్ల ఆయుధాలు కూడా అనుమతించరు. ఇది సామాన్య భక్తులకేనా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వీవీఐపీలు, వీఐపీల విషయంలో ఇలాంటి నిబంధనలను ఆలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ అధికారుల తీరుపై భక్తులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి వద్ద అందరికీ ఒకేలా నిబంధనలు ఉండాలి కానీ, వీఐపీల విషయంలో నిబంధనలు ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 


మంత్రి రాకతో కార్యకర్తల హడావుడి 

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రపంచ ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. స్వయంభు వెలిసిన స్వామివారి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడంకోసం ప్రభుత్వం ప్రజలనుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ముందుకొచ్చారు. బంగారం కోసం తాము బూరివిరాళాలను అందిస్తామని ప్రకటించారు. వీరితోపాటు రాష్ట్రంలోని వ్యాపారులు, భక్తులు కూడా విరివిగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మొదటి విడతగా ఈ నెల 28వ తేదీన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరఫున, మేడ్చల్‌ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజల తరఫున మూడున్నర కిలోలకు సంబంధించిన రూ.1.83కోట్లకు నగదుతోపాటు చెక్కులను ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ సంప్రదాయాలను  పాటించలేదు. మంత్రి మల్లారెడ్డి దాదాపు 100కు పైగా వాహనాల్లో కొండపైకి చేరుకున్నారు. దీంతో మంత్రి పర్యటన సందర్భంగా కొండపైకి భక్తుల వాహనాలను అధికారులు అనుమతించలేదు. సుమారు గంటకు పైగా మంత్రి పర్యటన సమయంలో సామాన్య భక్తులకు బాలాలయ కవచమూర్తుల దర్శనాలను నిలిపివేశారు. బాలాలయంలో కవచమూర్తులను మంత్రితోపాటు ఇతరులు దర్శించుకున్న ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవాన్ని ముందుగానే ముగించగా.. మఽధ్యాహ్నం నివేదనను ఆలస్యంగా నిర్వహించారు. మంత్రికోసం ఆలయ అధికారులు సంప్రదాయాలు మరిచిపోయారని భక్తులు విమర్శించారు. కాగా మంత్రి పర్యటన సందర్భంగా కార్యకర్తలు, బంధుమిత్రులు బాలాలయంలో నిబంధనలకు విరుద్దంగా ఫొటోలు, సెల్ఫీలతో హడావుడి చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే మంత్రితోపాటు వచ్చిన కొంతమంది ఫొటోలు తీయడం, బాలాలయంలో డ్రోన్‌ కెమెరాను తిప్పడం అత్యంత వివాదాస్పదంగా మారింది. 


గంటల తరబడి వేచి చూడాల్సిందేనా

యాదాద్రీశుడి ఆలయం ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపుదద్దుకుంటోంది. రానున్న రోజుల్లో రోజువారీగా 35వేల నుంచి 50వేల వరకు భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీఐపీలు వచ్చిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే భక్తులు కొన్ని గంటల సేపు స్వామివారి దర్శనం కోసం వేచి చూడాల్సిందేననా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరాళాలు దేవుడికి సమర్పించే సమయంలో ఆలయ అధికారులు బాలాలయంలో భక్తుల సమక్షంలోనే లెక్కించడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పుణ్యక్షేత్రంలో భక్తులందరికీ ఒకేలా నిబంధనలు ఉండాలని, కానీ వీఐపీలకు ఓ రూల్స్‌, సామాన్యులకు మరోలా ఉండొద్దని పలువురు భక్తులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-10-30T05:59:25+05:30 IST