Abn logo
Sep 23 2021 @ 01:35AM

‘జడ్పీ’లో చెల్లని ఓట్లు 17,042

41 జడ్పీటీసీల పరిధిలో భారీగా పోలైన వైనం

పోటీ ఉంటే ఎంతమంది జాతకాలు మారిపోయేవో

నోటాకు 1,563  8 చైతన్యపరచడంలో యంత్రాంగం విఫలం

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 22 : పోటీలేని ఫలితం కాబట్టి సరిపోయింది, లేకుంటే చెల్లని ఓట్లు ఎంతమంది జడ్పీటీసీల జాతకాలను తారుమారు చేసేవో...! స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద, రెండొందల ఓట్ల మెజారిటీతో గతంలో ఎంతోమంది విజేతలుగా నిలిచిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది 41 జడ్పీటీసీల పరిధిలో ఏకంగా 17,042 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఈ గణాంకాలు కేవలం జడ్పీటీసీలకు సంబంధించినవి మాత్రమే. ఎంపీటీసీల లెక్కలను కూడా బయటకు తీస్తే ఈ సంఖ్య 50వేలపైన ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో పోటీలేని పుణ్యమా ఈ చెల్లని ఓట్లు గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ ఈ  ఓట్ల సంఖ్య ఆందోళన కలిగించే విధంగా ఉంది. ప్రతి ఎన్నిక ముందు ఎన్నికల సంఘం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, యంత్రాంగం అందుకు తగ్గట్లు భారీగా ఏర్పాట్లు చేయడం మామూలే. కానీ ఇవేవీ ఆశించినస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనడానికి ఈ చెల్లని ఓట్లే నిదర్శనం. పోలింగ్‌ అంతంతమాత్రంగా జరిగితేనే 41 జడ్పీటీసీల పరిధిలో 17,042 ఓట్లు చెల్లనివిగా నిర్ధారణ అయ్యాయి. అంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికారికంగా బరిలో ఉంటే తదనుగుణంగా పోలింగ్‌ శాతం పెరిగి ఉండేది. అందుకు తగ్గట్లే ఈ చెల్లని ఓట్ల గ్రాఫ్‌ కూడా ఇంకా పెరిగేది. యంత్రాంగం చేపట్టే మొక్కుబడి అవగాహన కార్యక్రమాలకు తోడు ఈతరం యువకులకు ఈవీఎంల పట్ల అంతో ఇంతో అవగాహన ఉంటుంది. కానీ బ్యాలెట్‌ పేపర్‌ విషయంలో చైతన్యం పెద్దగా ఉండటం లేదు. ఈ చెల్లని ఓట్లలో అధికశాతం యువతరానివే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది.


దొనకొండ జడ్పీటీసీలో అత్యధికం, ఉలవపాడు అత్యల్పం...

చెల్లని ఓట్ల జాబితాలో 1,532 ఓట్లతో దొనకొండ జడ్పీటీసీ అగ్రభాగాన నిలిచింది. తర్వాత స్థానాల్లో మద్దిపాడు 981, వేటపాలెం 858 ఓట్లతో ఉన్నాయి. ఉలవపాడులో అత్యల్పంగా 139, ఒంగోలు జడ్పీటీసీ పరిధిలో 143 ఓట్లు చెల్లనివిగా నిర్ధారణ అయినట్లు యంత్రాంగం ప్రకటించింది


నోటాకు 1,563 ఓట్లు...

41 జడ్పీటీసీలకు పోలింగ్‌ జరగ్గా కేవలం 6 స్థానాల పరిధిలో మాత్రమే నోటాకు గుర్తించే విధంగా ఓట్లు పడ్డాయి. టంగుటూరు జడ్పీటీసీ పరిధిలో అత్యధికంగా నోటాకు 386 మంది ఓట్లు  వేశారు. జరుగుమల్లి 293, పెద్దారవీడు 264, కారంచేడు 241, జె. పంగలూరు 226, తాళ్లూరు 153 నోటాకు ఓట్లు పడ్డాయి.


యువతకు అవగాహన అంతంతమాత్రం

చెల్లకుండా పోయిన 17,042 ఓట్లలో అత్యధికశాతం యువతవే అని అంచనా. దానికి ప్రధాన కారణం పెద్దవారు గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసిన అనుభవం ఉండటం వల్ల వారి వైపు నుంచి చెల్లకుండా పోయే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈతరం ఓటర్లకు ఈవీఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న అనుభవం అయితే ఉండి ఉంటుంది కానీ బ్యాలెట్‌ పేపర్లపై చైతన్యం తక్కువ. అందువల్లే ఈ ఓట్లలో సింహభాగం వారివేనని అధికా రులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు యంత్రాంగం చేపట్టే అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగానే మిగిలిపోతున్నాయి అనేదానికి ఈ చెల్లని ఓట్లే తార్కాణంగా చెప్పవచ్చు.