దొంగ ఓట్ల దండయాత్ర!

ABN , First Publish Date - 2021-04-18T07:56:43+05:30 IST

‘తిరుపతి ఉప ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలవాలి’... ఇది అధినేత నిర్దేశించిన లక్ష్యం! దీనిని చేరుకునేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. దొంగ ఓటర్లను ‘దిగుమతి’ చేసుకున్నా రు. వారు అందించిన ఓటరు స్లిప్పులు, ఐడీ కార్డులతో

దొంగ ఓట్ల దండయాత్ర!

తిరుపతి పోలింగ్‌లో అరాచకం

బస్సులు, జీపులు, కార్లలో భారీగా జనం తరలింపు

ముందస్తు వ్యూహం ప్రకారం బూత్‌ల వద్దకు

అక్కడే ఓటరు స్లిప్‌, ఐడీ కార్డుల పంపిణీ

నిర్భయంగా క్యూలో నిల్చుని దొంగ ఓట్లు

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న విపక్ష అభ్యర్థులు

స్లిప్‌లోని వివరాలు చెప్పలేక ‘దొంగ’ల తడబాటు

కార్డులు పడేసి మరికొందరు పరుగో పరుగు

అనేక వాహనాలను అడ్డుకున్న టీడీపీ నేతలు

అధికార పార్టీకి యంత్రాంగం సలామ్‌

పట్టించుకోని పోలీసులు, ఆంక్షలకు పాతర

కేంద్ర ఎన్నికల సంఘం గప్‌చుప్‌


సొంత పేరు చెప్పలేని ‘ఓటరు’ ఒకరు! తండ్రి పేరు అడిగితే నీళ్లు నమిలిన ‘ఓటరు’ మరొకరు! అడ్రస్‌ ఏమిటో తెలియక వెర్రి చూపులు చూసిన ‘ఓటరు’ ఇంకొకరు! ఇలా... వందలు, వేల మంది! అందరూ బూత్‌ల ముందు బారులు తీరారు. అందరి చేతుల్లోనూ ఓటరు స్లిప్‌లున్నాయి! కానీ... అందరూ దొంగ ఓటర్లే! తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంపై దండ యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు పక్క నియోజకవర్గం, పొరుగు జిల్లాల నుంచి జీపులు, కార్లు, బస్సుల్లో తరలి వచ్చారు.  ఎంచక్కా ఓటు వేసి... బిర్యానీలు, భోజనాలు తిని... మళ్లీ అవే వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలామంది దొంగ ఓటర్లను టీడీపీ, బీజేపీ నేతలు స్వయంగా పట్టుకున్నారు. గెలుపుకోసం, మెజారిటీ కోసం అధికార పార్టీ కనీవినీ ఎరుగని అరాచకానికి పాల్పడిందంటూ మండిపడ్డారు. 


(తిరుపతి - ఆంధ్రజ్యోతి)

‘తిరుపతి ఉప ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలవాలి’... ఇది అధినేత నిర్దేశించిన లక్ష్యం! దీనిని చేరుకునేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. దొంగ  ఓటర్లను ‘దిగుమతి’ చేసుకున్నా రు. వారు అందించిన ఓటరు స్లిప్పులు, ఐడీ కార్డులతో దొంగ ఓటర్లు ఏమాత్రం బెరుకూ భయం లేకుండా క్యూల్లో నిల్చున్నారు. ఓటేశారు. ఇందులో ఓటరు స్లిప్‌ మాత్రమే ఒరిజినల్‌. ఐడీ కార్డు నకిలీ దే! ఓటరూ నకిలీనే! చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు, చంద్రగిరి అసెం బ్లీ సెగ్మెంట్లు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి రావు. దీంతో.. అక్కడి జనాలను దొంగ ఓట్ల కోసం తరలించారు. పక్కనే ఉన్న కడప జిల్లా నుంచీ జనాలను పిలిపించారు. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన తరలింపు శనివారం ఉదయం 10 గంటల దాకా కొనసాగింది. వీరికోసం చెక్‌పోస్టుల వద్ద గేట్లు తెరుచుకున్నాయి. సెక్షన్‌ 144 ఉన్నా లేనట్లుగా మారింది. రాత్రే వచ్చిన వారికి లాడ్జిలు, కల్యాణ మండపాలు, వైసీపీ నేతలకు చెందిన భవనాల్లో బస ఏర్పాటు చేశారు. ఉదయం వచ్చిన వారు పోలింగ్‌ బూత్‌ల సమీపంలో గుంపులు గుంపులుగా గుమికూడారు. దొంగ ఓటర్లను వైసీపీ నేతలు నిర్ణీత పోలింగ్‌ కేంద్రాలకు ఆటోలు, కార్లు, జీపుల్లో చేర్చారు. నేతల చేతుల్లోనే పెద్ద సంఖ్యలో ఓటరు కార్డులు కనిపించాయి. వాటిని పోలింగ్‌ కేంద్రాల ఎదుటే బహిరంగంగా దొంగ ఓటర్లకు అందించి, క్యూలైన్లలో నిలిపి ఓట్లు వేయించారు. వీరిని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులుగానీ, ఇతర అధికారులు గానీ ప్రశ్నించలేదు. 


మంత్రి కల్యాణ మండపంలో..

తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో, ఆ ఆవరణలో భారీగా జనం కనిపించా రు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన ఆ జనమంతా దొంగ ఓట్లు వేయడానికి వచ్చినవారేనని ఆరోపిస్తూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసిం హయాదవ్‌, ముఖ్యనేత మబ్బు దేవనారాయణరెడ్డి ఉదయం 8 గంటలకు రోడ్డుపై బైఠాయించారు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ దొంగ ఓటర్లను నిలదీశారు. పోలీసులు దొంగ ఓటర్లకు అండగా నిలు స్తూ... కన్వెన్షన్‌ హాలు గేట్లు మూసివేసి, ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను ఠాణాకు తరలించారు.  


అడ్డుకున్నందుకు అరెస్టులు...

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు పనబాక లక్ష్మి, రత్నప్రభ, చింతా మోహన్‌తోపాటు ఆ పార్టీ ల నేతలు పలుబూత్‌ల వద్ద స్వయంగా దొంగ ఓటర్లను పట్టుకున్నారు. మీడియా ప్రతినిధులూ ఈ గుట్టు రట్టు చేశారు. క్యూల్లో నిల్చున్న అనుమానితులను ప్రశ్నించినప్పుడు ఓటరు సిప్పుల్లోని వివరాలు చెప్పలేక తడబడ్డారు. మరికొందరేమో నకిలీ కార్డులను అక్కడ వదిలేసి పారిపోయారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుటే దొంగ ఓటర్లతో వెళుతున్న రెండు బస్సులను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అడ్డుకున్నారు.  అదనపు ఎస్పీ సుప్రజ అక్కడకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే నుంచి ఫిర్యాదు తీసుకుని బస్సులను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓటర్లను కూడా వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


అలాగే క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు నగర టీడీపీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌ యాదవ్‌ రెండు బస్సులను అడ్డుకున్నారు. దొంగ ఓటర్లను అడ్డుకోలేదంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ధర్నాకు దిగారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత శాంతారెడ్డి పలుచోట్ల దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీబీఆర్‌ హాస్పిటల్‌ రోడ్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ ఐదు బస్సుల్లో వచ్చిన దొంగ ఓటర్లను అడ్డుకున్నారు. చెన్నారెడ్డి కాలనీలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద పూతలపట్టు నుంచి వచ్చిన దొంగ ఓటర్లను సుగుణమ్మ నిలదీశారు. వారు ఎదురు తిరిగి ఆమెనే బూతు లు తిట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించిన ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతి రిపోర్టర్ల లోగో, మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. సుగుణమ్మను తిట్టిన వీడియో తొలగించిన తర్వాతే ఫోన్లు తిరిగి ఇచ్చారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు కిమ్మనలేదు.

Updated Date - 2021-04-18T07:56:43+05:30 IST