మట్టిలోకి పెట్టుబడి

ABN , First Publish Date - 2021-10-05T06:20:29+05:30 IST

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. రెండు నెలలుగా చినుకు రాలడం లేదు. చేతికొచ్చిన పంటలు మట్టిలో కలిసిపోయే దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మట్టిలోకి పెట్టుబడి

  1. ఎండుతున్న పంటలు
  2. వెంటాడుతున్న తెగుళ్లు
  3. రెండు నెలలుగా వర్షాభావం
  4. 6 లక్షల హెక్టార్ల పంటకు ముప్పు 


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 4: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. రెండు నెలలుగా చినుకు రాలడం లేదు. చేతికొచ్చిన పంటలు మట్టిలో కలిసిపోయే దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలతో పంటలన్నీ నీటిపాలు అయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి వర్షాలు మొండికేయడంతో పచ్చగా ఉండాల్సిన పంటలు ఎండిపోతున్నాయి. ఎకరా పంట సాగుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల దాకా ఖర్చు చేశారు. ఒక్క పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 6,38,465 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 6,17,061 హెక్టార్లలో (94.3 శాతం) పంటలు సాగయ్యాయి. వేరుశనగ 84,263 హెక్టార్లు, ఆముదం 4,278 హెక్టార్లు, మిరప 20,732 హెక్టార్లు, ఉల్లి 16,288 హెక్టార్లు, పత్తి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,50,374 హెక్టార్లలో సాగు అయింది. కూరగాయల పంటలు 15,422 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 53,281 హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, మిరప, ఉల్లి ఇతర కూరగాయల పంటలు వారం పది రోజుల్లో చేతికి అందాల్సి ఉంది. ఆగస్టులో 43 శాతం, సెప్టెంబరులో 44 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలన్నీ వాడిపోతున్నాయి.


వెంటాడుతున్న తెగుళ్లు


జిల్లాలో జూన్‌, జూలై నెలలో వర్షాలు బాగా కురిశాయి. దీంతో రైతులు సంతోషించారు. సకాలంలో విత్తనం పడుతోందని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని ఆశించారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2 మి.మీ. కాగా, 117.9 మి.మీ. కురిసింది. జూలైలో సాధారణ వర్ష్షపాతం 117.2 మి.మీ. కాగా 174.7 మి.మీ. కురిసింది. కానీ కీలకమైన ఆగస్టులో పంట కాపు సమయానికి చినుకు కురవలేదు. ఈ నెలలో సాధారణ వర్షపాతం 135 మి.మీ. కాగా కేవలం 76.6 మి.మీ. నమోదైంది. సెప్టెంబరులోనైనా వర్షం కురుస్తుందని రైతులు పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఈ నెలలో సాధారణ వర్ష్షపాతం 125.7 మి.మీ. కాగా కేవలం 70.7 మి.మీ. కురిసింది. దీనికితోడు ఎండలు విపరీతంగా కాశాయి. కాస్త పచ్చగా ఉన్న పంటలు ఎండల తీవ్రతకు వాడిపోయాయి. ఇది చాలదన్నట్లు తెగుళ్లు చుట్టుముట్టాయి. పత్తి పంటకు గులాబి రంగు పురుగు విపరీతంగా ఆశించింది. వేరుశనగ, కంది పంటకు కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగులు ఆశించాయి. మొక్కజొన్న, మిరప పంటలను కూడా తెగుళ్లు వదలలేదు. క్రిమిసంహారక మందులను కొనేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం పంటలు మట్టిలో కలిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


పట్టించుకోని ప్రభుత్వం


జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. తెగుళ్లు కూడా పంటలపై దాడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉచిత పంటల బీమా పథకంతో పాటు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయాన్ని అందించాలని, వెంటనే పొలాలకు వ్యవసాయ సిబ్బందిని పంపి పంట నష్టాన్ని అంచనా వేయించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. సీపీఎం, సీపీఐ నాయకులు గ్రామాలలో పర్యటిస్తున్నారు. పొలాలకు వెళ్లి దెబ్బతిన్న పంటలను చూసి రైతులకు ధైర్యం చెబుతున్నారు. రైతుల పక్షాన పోరాడేందుకు సమాయత్తం అవుతున్నారు. 


ఆదేశాలు రాలేదు..


జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ పంటలు దెబ్బతింటున్నాయి. కొన్ని పంటలకు తెగుళ్లు సోకాయి. పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. సిబ్బందిని గ్రామాలకు పంపి తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం కూడా రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.                    


 - వరలక్ష్మి, జేడీఏ


ఎండుతున్న వేరుశనగ


డోన్‌ మండలంలో 7,300 హెక్టార్లలో రైతులు వేరుశనగ పంట వేశారు. గత నెల నుంచి వర్షాలు లేకపోవడంతో పైరు వాడుముఖం పట్టింది. పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.20వేల నుంచి 25వేల దాకా పెట్టుబడి అయిందని వాపోతున్నారు. వేరుశనగ పంట ఎండిపోతున్న విషయం వాస్తవమేనని, నష్టంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని వ్యవసాయాధికారి అబ్దుల్‌ షఫి తెలిపారు               

.- డోన్‌ రూరల్‌

Updated Date - 2021-10-05T06:20:29+05:30 IST