సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించండి

ABN , First Publish Date - 2022-03-19T06:15:38+05:30 IST

జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండు చేశారు.

సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించండి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

నేడు జిల్లాలో నిరసన కార్యక్రమాలు 

ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా చేయాలన్న టీడీపీ 


చిత్తూరు సిటీ, మార్చి 18: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండు చేశారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశలో మాట్లాడారు. సారా తాగడంవల్లే 26 మంది మృతిచెందగా.. సహజ మరణాలని చెబితే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తారని అధికారులు చెప్పమన్నారని బాధితులు చెబుతున్నారన్నారు. సీఎం జగన్‌రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో అవి సహజమరణాలేనని, అక్కడ సారానే తయారు చేయడంలేదని చెప్పడం విచారకరమన్నారు. ఈనెల 11 నుంచి 14వ తేఇ వరకు అక్కడ ఎస్‌ఈబీ దాడులు చేసి 36 కేసుల్లో  22 మందిని ఆరెస్టు చేసి 18,300 లీటర్ల సారా ఊటను ధ్వంసంచేసి, 63,048 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. సారా తయారీనే లేకపోతే ఇన్నికేసులు ఎలా పెడతారో ప్రజలకు సీఎం సమాఽధానం చెప్పాలన్నారు. సారా తయారీ, నకిలీ మద్యంపై శనివారం అన్ని నియోజక వర్గ, మండల కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సాక్షాత్తు ఎక్సైజ్‌ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే సారా ఏరులై పారుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సప్తగిరి ప్రసాద్‌ ఆరోపించారు. తన శాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని మంత్రికి ఆ పదవిలో ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మద్యంపైనే ఆదాయం పెంచుకుంటోందని చిత్తూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ డిమాండు చేశారు. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, నేతలు నాగరాజు, తారక్‌, లత, శ్రీదుర్గ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. 

కాగా, జంగారెడ్డిగూడెంలో జరిగిన సారా మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెలుగుమహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి, పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 26 మంది మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు వీరు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2022-03-19T06:15:38+05:30 IST