ఎఫ్‌డీల గోల్‌మాల్‌పై దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2021-10-15T07:10:22+05:30 IST

ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అక్రమమార్గంలో విత్‌డ్రా చేసిన ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎఫ్‌డీల గోల్‌మాల్‌పై దర్యాప్తు ముమ్మరం

అదనపు సమాచారం కోరిన పోలీసులు

డాక్యుమెంట్‌ పత్రాలు అందజేసిన అధికారులు

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అక్రమమార్గంలో విత్‌డ్రా చేసిన ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రెండు సంస్థల ఉన్నతాధికారుల ఫిర్యాదుపై విచారణ చేస్తున్నారు.  వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించి భవానీపురం ఐవోబీ బ్రాంచ్‌లోని రూ.9.60 కోట్ల ఎఫ్‌డీలు, ఆయిల్‌ఫెడ్‌కు సంబంధించి వీరపనేని గూడెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులోని రూ.5 కోట్ల ఎఫ్‌డీలను తెలంగాణ తెలుగు అకాడమీకి చెందిన సాయికుమార్‌ ముఠా కొట్టేసినట్లు ఆయా సంస్థల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సప్తగిరి బ్యాంకులో రూ.5 కోట్లను ఈ ఏడాది మే నెలలో ఎఫ్‌డీ రూపంలో జమ చేయగా, జూన్‌ నెలలోనే ఆ ఎఫ్‌డీలను మార్చేసి సొమ్ము డ్రా చేసుకున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు గుర్తించారు. భవానీపురం ఐవోబీలో రూ.9.6 కోట్ల వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎఫ్‌డీల సొమ్మును మెచ్యూరిటీకి ముందే మర్కెంటైల్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీకి బదిలీ చేసి, అక్కడి నుంచి విత్‌డ్రా చేసినట్లు ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌డీలకు సంబంధించి డాక్యుమెంట్‌ పత్రాలు, ఇతర వివరాలతో పోలీసులు కోరిన అదనపు సమాచారాన్ని కూడా వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు గురువారం అందజేశారు. 

Updated Date - 2021-10-15T07:10:22+05:30 IST