తల్లీకూతుళ్ల హత్యపై గుంభనంగా దర్యాప్తు

ABN , First Publish Date - 2021-12-07T06:31:04+05:30 IST

టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసు దర్యాప్తును పోలీసులు గుంభనంగా సాగిస్తున్నారు.

తల్లీకూతుళ్ల హత్యపై గుంభనంగా దర్యాప్తు
టంగుటూరులోని ప్రధాన సెంటర్‌లో ఉన్న తల్లీకూతుళ్ల హత్య జరిగిన నివాసం

పోలీసుల అదుపులో అనుమానితులు

కత్తులకు సానపట్టే వారిగా సంచారం

రహస్యంగా విచారిస్తున్న ప్రత్యేక బృందాలు

ఒంగోలు (క్రైం), డిసెంబరు 6 : టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసు దర్యాప్తును పోలీసులు గుంభనంగా సాగిస్తున్నారు. నేరం జరిగిన మరుసటి రోజే ఫోన్‌ నంబర్ల ఆధారంగా ముగ్గురు అనుమాని తులను మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అక్కడి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకు న్నారు. హత్య కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం అనుమా నితులైన ఆ ముగ్గురిని జిల్లాకు తీసుకు వచ్చింది. అత్యంత రహస్యమైన ప్రాంతంలో ఉంచి విచారిస్తోంది. అయితే వారిని అదుపులోకి తీసుకునేంత వరకు వేగంగా ముందుకెళ్లిన పోలీసులు ఆ తర్వాత నెమ్మదించారు.  అనుమా నితుల కదలికలను అణువణువూ గుర్తించేందుకు సాంకేతికపరమైన సహకారాన్ని తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వ్యాపారి రవికిషోర్‌ (హత్యకు గురైన శ్రీదేవి భర్త)ను కూడా టంగుటూరులో పోలీసులు విచారించినట్లు సమాచారం. కొన్ని బృందాలు అనుమానితులను విచారిస్తుండగా మరి కొంతమంది అధికారులు సీసీ పుటేజీ, ఫోన్‌ నంబర్లు ఆధారంగా విశ్లేషణ చేసే పనిలో ఉన్నారు. 


అనుమానితుల కదలికలపై ఆరా

కత్తులకు సానపట్టే వారిగా సంచరించిన ముగ్గురూ ఈనెల 2న టంగుటూరుకు వచ్చినట్లు  పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నేరం జరిగిన రాత్రి 8.30గంటలకు వారు టంగుటూరు నుంచి బయటకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత కేసు విచారణలో సమగ్రమైన సాక్ష్యాధారాలు సేకరించేందుకు కష్టపడుతున్నారు. దొరికిన ప్రతి ఆధారాన్ని విశ్లేషించుకుంటూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేసు విచారణ బయటకు పొక్కకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈనెల 19 రాత్రి ఇంకొల్లు మండలం పూసపాడులో జరిగిన భార్యాభర్తల హత్యలకు టంగుటూరు కేసుకు సారూప్యం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా విచారణ చేపట్టారు. అనుమానితులుగా ఉన్నవారు పూసపాడులో సంచరించినట్లు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. 




Updated Date - 2021-12-07T06:31:04+05:30 IST