అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఆర్‌బీఐ..

ABN , First Publish Date - 2022-01-28T19:54:03+05:30 IST

పెట్టుబడిదారులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దిశగా చూస్తున్నారు. మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచనున్నట్లుగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వెల్లడించడంతో... పెట్టుబడిదారులు... ఆర్‌బీఐ వేపు చూస్తున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఆర్‌బీఐ..

దిశ మారిన ఇన్వెస్టర్ల చూపు...

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం వచ్చే నెల 9 న... 

కీలక వడ్డీ రేట్లపై అదే రోజు నిర్ణయం ?

జీడీపీలో కరెంటు ఖాతా లోటు రెండు శాతం కంటే తక్కువే...

అయినా... పెరగని వారంవారీ విదేశీ మారక నిల్వలు

ముంబై : పెట్టుబడిదారులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దిశగా చూస్తున్నారు. మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచనున్నట్లుగా  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వెల్లడించడంతో... పెట్టుబడిదారులు... ఆర్‌బీఐ వేపు చూస్తున్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఫిబ్రవరి 9 న సమావేశం కానుంది. కీలక రేట్లకు సంబంధించి అదే రోజు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది. అమెరికన్‌ బ్యాంక్‌ రేట్లలో లిఫ్ట్-ఆఫ్ సూచనలు చేసిన రెండు వారాలలోపే ఆర్‌బీఐ నుంచి కూడా నిర్ణయం రానుంది. ఈ క్రమంలో... మార్కెట్లు అస్థిరంగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. 


ద్రవ్యోల్బణాన్ని అరికట్టే క్రమంలో భాగంగా... అధిక రేట్ల ద్వారా లిక్విడిటీని టైట్‌ చేస్తుందనన్న అంచనాలతో భారత  మార్కెట్లు వాటి గరిష్ట స్థాయిల నుంచి దాదాపు ఎనిమిది శాతంపడిపోయాయి. ఇక భారత్ విషయానికొస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం 6 % మించితే ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమిస్తుంది. కాగా... ఇప్పుడది ఆ గరిష్ట పరిధిని కూడా దాటింది. బడ్జెట్ లోటు జీడీపీలో 6.5 % మించితే, రెపో రేటు కూడా పెరిగే అవకాశముంటుంది. ఆర్థికవ్యవస్థపై ఒమిక్రాన్‌ ప్రభావ నేపధ్యంలో ఎంపీసీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రేట్లను పెంచి, లిక్విడిటీని ఎక్కడికక్కడ బిగించేయడం ఖాయంగా కనిపిస్తోంది.


అధిక ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేసేందుకు వడ్డీ రేట్లను పెంచడానికి, ప్రస్తుత పరిస్థితులు ఆర్‌బీఐకి అనుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాది పాలసీ రేటు 50 బీపీఎస్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. కాగా... ఈ క్రమానికి సంబంధించి మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. ముందటేడు(2020) మే నుంచి రెపో రేటు, లేదా... సెంట్రల్ బ్యాంక్ రుణాలనిచ్చే రేటు 4 % వద్ద ఉంది. బ్యాంకులు మిగులు నగదును ఆర్‌బీఐ దగ్గర ఉంచే రివర్స్ రెపో రేటు కూడా అప్పటినుంచి 3.35 శాతం గానే ఉంది. దేశంలో ప్రస్తుతం రివర్స్ రెపో రేటు కంటే కాల్ రేటు బాగా అధిక స్థాయిలో ఉంది. రివర్స్ రెపో సాధారణీకరణకు సమయం వచ్చిందని విశ్వసిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అధిక రుణాలు, బడ్జెట్ లోటు పెరగడం వల్ల కూడా రేట్లు కఠినంగా మారవచ్చునని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎస్‌.కె.ఘోష్ పేర్కొన్నారు. 


ఇక... ద్రవ్య లోటు జీడీపీలో 0.5% తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రూపాయి పరంగా చూస్తే పెరిగే అవకాశముంది. ఈ సంవత్సరానికి అధిక రీ పేమెంట్‌ బిల్లుతోపాటు, రుణాలు పెరుగుతాయని ప్రముఖ ఆర్థికవేత్త, హెచ్‌ఎస్‌బీసీకి చెందిన ప్రంజుల్ భండారి పేర్కొన్నారు. కాగా... అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయం ఆర్‌బీఐపై ఒత్తిడి పెంచినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. భారత్ జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 2013 లోని 5 %తో పోలిస్తే, ఇప్పుడు 2 % కంటే తక్కువగా ఉన్నప్పటికీ... వారంవారీ విదేశీ మారక నిల్వలు సెప్టెంబరు నుంచి 635 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. 

Updated Date - 2022-01-28T19:54:03+05:30 IST