కనిపించని దేవతలు

ABN , First Publish Date - 2021-05-19T06:42:57+05:30 IST

పాజిటివ్‌ అని తెలియగానే..

కనిపించని దేవతలు

ఫోన్‌ చేస్తే భోజనం తెచ్చిస్తారు

హోం ఐసొలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులకు మానవీయ సేవలు అందిస్తున్న ఎందరో మహానుభావులు


పాజిటివ్‌ అని తెలియగానే వెన్నులోకి జరజరా భయం పాకుతుంది. ఎంత కూడేసుకున్నా నిస్సత్తువ ఆవహిస్తుంది. మందులు మింగగానే శరీరంలో యుద్ధం మొదలవుతుంది. ప్రతి కణం మీదా వైరస్‌ దాడి చేస్తుంది. నీరసం కమ్ముకుంటుంది. తిన్న గిన్నె కడుక్కోడానికి కూడా ఓపిక ఉండదు. శక్తి సన్నగిల్లినా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వంట వండుకోవాలి. దుస్తులుతుక్కోవాలి. కొండను నెత్తిన మోసినట్టే ఉంటుంది. ఇటువంటి సమయంలోనే వండుకునే పనిలేకుండా పూటకింత తిండి ఎవరైనా తెచ్చిపెడితే బావుండునని ఉంటుంది. అలా ఎవరైనా తెచ్చిపెడితే వాళ్లు దేవతలే అనిపిస్తుంది. సరిగ్గా కొవిడ్‌ బాధితుల ఈ అవసరాన్నే గుర్తించిన కొందరు ఇంటింటికీ పూటపూటా భోజనం అందించే పనికి పూనుకున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న 14 రోజులూ వీరు తామే వంట చేసి, శుభ్రంగా ప్యాక్‌ చేసి ఉచితంగా గడప గడపకీ చేరుస్తున్నారు. ఫోన్‌ చేసి చెబితే చాలు వాకిట్లో వాలిపోతారు. బయటే పెట్టి వెళ్లిపోతారు.  కొవిడ్‌ బాధితులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్న ఈ కనిపించని దేవతలకు నమస్కరించుకుందాం.


తంబళ్లపల్లెలో పేదల ఇళ్లకు సరకులు

తంబళ్ళపల్లె: తంబళ్ళపల్లెలో సర్పంచ్‌ నిలోఫర్‌ భర్త మైనుద్దీన్‌ కరోనా కష్టకాలంలో వైరస్‌ సోకిన బాధితులకు వ్యక్తిగత సాయాన్ని అందిస్తున్నారు. కొవిడ్‌ బాధితులు ఐసొలేషన్‌తో రెండు వారాల పాటు ఇంటిపట్టున వుంటే ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. దీన్ని గుర్తించిన మైనుద్దీన్‌ ఈ నెల ప్రారంభం నుంచీ రంగంలోకి దిగారు. వైరస్‌ సోకిన వారి కుటుంబాలకు సొంత ఖర్చుతో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు బాధితుల కోసం డ్రై ఫ్రూట్స్‌, గుడ్లు, మందులు పంపిణీ చేస్తున్నారు. స్వయంగా తనే ఇంటింటికీ వెళ్ళి వీటిని అందజేస్తున్నారు. పంచాయతీ కేంద్రమైన తంబళ్ళపల్లెతో పాటు పంచాయతీ పరిధిలోని ఇట్నేనివారిపల్లె, చేలూరివారిపల్లెల్లో కూడా వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 60 కుటుంబాలకు సాయం అందజేశారు. పోలీసు సిబ్బంది, నర్సింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు కూడా  అమర్చారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గే వరకూ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తానంటున్నారు మైనుద్దీన్‌. 

సాయం కోసం కాల్‌ చేయాల్సిన మొబైల్‌ నెంబర్‌ : 9142845786



వి.కోటలో అటు భోజనం... ఇటు వైద్య సహకారం

వి.కోట: వి.కోటలో ఒక బృందం రెండు వారాలుగా కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల ఇళ్లకు ఉచితంగా ఆహారం అందిస్తోంది. వి.కోట సర్పంచ్‌ లక్ష్మి కుమారుడు పి.ఎన్‌.నాగరాజ్‌, తన మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ అయ్యామని బాధితులు ఫోన్‌ చేస్తే చాలు 14 రోజుల పాటు ఇళ్ళవద్దకు భోజనాలు పంపుతున్నారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పంపుతారు. రోజూ 50 మందికి వీరు ఉచిత భోజనం అందజేస్తున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, కోడిగుడ్లు, శానిటైజర్లు, మందులు కూడా అదనంగా పంపుతారు. ఎవరికైనా వైద్య సేవలు అవసరం అయితే, వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని వారి ఇళ్లవద్దకు వెళ్తారు. వైద్య సిబ్బందికి పల్స్‌ ఆక్సీ మీటర్లు, గ్లౌజులు, మాస్కులు కూడా అందజేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తగ్గేవరకూ తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పి.ఎన్‌.నాగరాజ్‌ తెలిపారు.

వి.కోటలో పాజిటివ్‌ బాధితులు భోజన, వైద్య సాయం కోసం కాల్‌ చేయాల్సిన నంబర్లు: 9000094905, 7670944559


మంగళంలో సేవాసదన్‌ సేవలు

తిరుపతి: తిరుపతి నగరం మంగళం ప్రాంతంలోని ఐదు పంచాయతీల పరిధిలో కొవిడ్‌ బాధితులకు విశేష సేవలందిస్తోంది సేవాసదన్‌ స్వచ్చంద సంస్థ.  టీడీపీ నాయకుడైన చిన్నరెడ్డిబాబు  తన మిత్రులైన రమణారావు, రవి, రామకృష్ణ, గంగాధరం, భరత్‌, నాగరాజ తదితరుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ సోకి హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి ఉచితంగా భోజనాలు ఇళ్లవద్దకు వెళ్లి అందిస్తున్నారు. మంగళం ప్రాంతంలోని సప్తగిరి కాలనీ, తిరుమల నగర్‌, రణధీర్‌ పురం, మంగళం క్వార్టర్స్‌, శెట్టిపల్లె పంచాయతీల పరిధిలో రోజూ రెండు పూటలా వీరు భోజనాలు అందజేస్తున్నారు. ఈ నెల 10న ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రస్తుతం రోజుకు 60 మందికి భోజనాలు అందిస్తున్నారు. చిన్నరెడ్డిబాబు ఇంట్లోనే భోజనాలు వండించి బాక్సుల్లో పెట్టి ఇళ్ళ వద్దకే సరఫరా చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రత కొనసాగినంత కాలం తమ సేవలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

మంగళం ప్రాంతంలో భోజనం కోసం సంప్రదించాల్సిన  నెంబరు: 9290878699



సెవెన్‌ హిల్స్‌ ఆర్కేడ్‌ మానవీయ సేవలు

తిరుపతి రూరల్‌: కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలియగానే అపార్ట్‌మెంట్‌ భవనాల్లో మిగిలిన అన్ని ఫ్లాట్ల తలుపులూ మూతబడిపోతాయి. తిరుపతి విద్యానగర్‌లోని సెవెన్‌ హిల్స్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌వాసులు మాత్రం తిరుపతి నగరంలో కొవిడ్‌ బాధితులకు ఉచిత ఆహారసేవలు అందిస్తున్నారు. 30 కుటుంబాలున్న భవనం ఇది. ఎంతో కలిసికట్టుగా ఉండే వీరు ఇదే ఐక్యతతో సేవలందిస్తున్నారు. 120 మంది పాజిటివ్‌ బాధితులకు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా ఇళ్ల వద్దకు చేరుస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో భోజనం ఉంటుంది. ప్రతి భోజనంతోనూ కోడిగుడ్డు ఇస్తారు. దీంతో పాటూ డ్రైఫ్రూట్స్‌ సాయంత్రం తినడానికి సరిపడా రోజూ ఇస్తారు. రోజూ ఇంతమందికి వంటలు చేయడం సాధారణ విషయం కాదు.   రోజూ ఉదయం 8 గంటలకే ఇంటికొకరు కామన్‌ స్పేస్‌లోకి చేరుకుంటారు. ఇక వంటలు మొదలవుతాయి. అందరూ కలిసి 11.30గంటల కంతా భోజనాలు సిద్ధం చేసి ప్యాక్‌ చేస్తారు. ప్రత్యేక వాహనాల్లో వాటిని ఇళ్లకు చేరుస్తారు. 14 రోజుల పాటూ వీరు ఉచిత భోజనం పంపుతారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గేదాకా తిరుపతి నగరంలో ఏ మూల నుంచి ఫోన్‌ చేసినా భోజనం పంపుతామని సెవెన్‌ హిల్స్‌ ఆర్కేడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాల నాయుడు తెలిపారు. 

సాయం కోసం తిరుపతి వాసులు కాల్‌ చేయాల్సిన మొబైల్‌ నెంబర్లు: 9490084005, 7382013870, 9100640979 



మానవ సేవలో పాస్టర్లు

తిరుపతి రూరల్‌: బైబిల్‌ బోధనల ప్రేరణతో కొవిడ్‌ బాధితులను చేతనైన రీతిలో ఆదుకునేందుకు సిద్ధపడ్డారు తిరుపతిలో కొందరు ప్లాస్టర్లు. కొవిడ్‌ సోకి ఐసొలేషన్‌లో వున్న బాధితులకు రోజుకు రెండు పూటలా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోలీ మెస్సయ్య మిషన్‌ ట్రస్టు తరపున పాస్టర్లు బీజే రత్నం, తిమోతీ హోమ్‌ ఐసొలేషన్‌లో వున్న కొవిడ్‌ బాధితులకు ఇళ్ళకు భోజనాలు పంపుతున్నారు.సాయం కోరిన ప్రతి బాధితుడికీ పది రోజుల పాటు రోజుకు రెండుపూటలా భోజనం సరఫరా చేస్తామని తెలిపారు. రోజుకి 20 మందితో మొదలైన కార్యక్రమం ప్రస్తుతం వందమందికి విస్తరించింది. 

సాయం కోసం తిరుపతి వాసులు ఫోన్‌ చేయాల్సిన నెంబర్లు: 8686994511, 8686994528, 8686555388



చంద్రగిరి మండలంలో మెడికల్‌ కిట్లు

తిరుపతి (కొర్లగుంట): కొవిడ్‌ బాధితులకు, లాక్‌డౌన్‌ బాధితులైన పేదలకు చంద్రగిరి మండలం కొటాల గ్రామానికి చెందిన మరపూరి హేమచంద్ర నెలకొల్పిన సోషల్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అవసరమైన నిత్యావసర వస్తువులు సమకూర్చుతోంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ సొసైటీ సేవల్ని గుర్తించిన హైదరాబాదుకు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాల్లో తను కూడా భాగస్వామి అయింది. అయితే వీరు వైరస్‌ సోకిన బాధితులకు మెడికల్‌ కిట్లు మాత్రమే అందజేస్తున్నారు. జలుబుకు, దగ్గుకు మందులు, యాంటిబయాటిక్‌ మందులు, ఆవిరి పట్టే మాత్రలు, గ్లౌజ్‌లు, మాస్కులు, శానిటైజర్‌, డ్రై ఫ్రూట్స్‌  ఈ కిట్‌లో ఉంటాయి. ఒక్కో కిట్‌ రూ. 750 విలువ చేస్తుంది. గత నెల 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు తిరుపతి, చంద్రగిరి, మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో 1800మంది బాధితులకు కిట్లను పంపిణీ చేశారు. త్వరలో పల్స్‌ ఆక్సీమీటర్‌ను కూడా కిట్‌లో చేరుస్తామని చెబుతున్నారు.చంద్రగిరి మండలంలోని గ్రామాలకు కూడా వీటిని చేరుస్తున్నారు.

మెడికల్‌ కిట్లు అవసరమైన బాధితులు ఫోన్‌ చేయాల్సిన నెంబర్లు: 7981603665, 9703301363, 9966695305.



శ్రీకాళహస్తిలో యువతరం సేవలు

శ్రీకాళహస్తి అర్బన్‌: శ్రీకాళహస్తిలో ఏడేళ్ళుగా సేవా కార్యక్రమాలతో పట్టణవాసులకు పరిచితమైన యువతరం సేవా సమితి, కరోనా కష్టకాలంలోనూ సేవలు కొనసాగిస్తోంది. హోం ఐసొలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తోంది. సమాచారం అందిస్తే చాలు మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా 14 రోజుల పాటు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. మెప్మాకు చెందిన నిరాశ్రయుల వసతి గృహంలో భోజనాలు చేయించి, ప్యాక్‌ చేసి బాధితుల ఇళ్ళకు వెళ్ళి అందజేస్తున్నారు. ప్రారంభంలో రోజుకు ఐదారుమందితోనే మొదలైన ఉచిత భోజన కార్యక్రమం ఇప్పుడు రోజుకి 150-200 మందికి విస్తరించారు. మలినేని యువకిశోర్‌ నాయుడు సారథ్యంలో దాదాపు వంద మందికి పైగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి నెలా తలా కొంత డబ్బులు వేసుకుని వీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోనే వీరు తమ సేవలను పరిమితం చేసుకున్నారు.

ఐసొలేషన్‌లో వున్న శ్రీకాళహస్తివాసులు భోజనం కోసం కాల్‌ చేయాల్సిన మొబైల్‌ నంబర్లు:  8374269526, 8790676929, 9494831591


Updated Date - 2021-05-19T06:42:57+05:30 IST