‘సినివారం’కు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-08T23:48:43+05:30 IST

తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం

‘సినివారం’కు ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం ‘సినివారం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని 2016, నవంబర్ 12న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు. ‘సినివారం’ వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న (శనివారం) శ్రీనివాస్ దర్శకత్వం వహించిన "వసంతం" మరియు మనోజ్ దర్శకత్వం వహించిన "రైతే రాజు" లఘుచిత్రాలను రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రదర్శిస్తారు. అనంతరం ఈ రెండు చిత్ర బృందాలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా నిర్వాహాకులు కోరుతున్నారు. 


తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్త తరాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ భావిస్తోంది. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘు చిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్న యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నారు.


Updated Date - 2022-07-08T23:48:43+05:30 IST