మమ్మేలు మల్లన్న..

ABN , First Publish Date - 2022-01-15T05:23:16+05:30 IST

‘శివమెత్తిన శివసత్తుల ఢమరుక నాదాలతో ఐలోని మల్లన్న ఆలయం మారుమోగింది. ‘దండాలు నన్నేలు నా తండ్రీ..’ అంటూ భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన నృత్యాలు భక్తి భావాన్ని చాటాయి.

మమ్మేలు మల్లన్న..
ఐనవోలు మల్లకార్జునస్వామి దేవస్థాన జాతర ప్రాంగణంలో భక్తులు

ఐనవోలులో పోటెత్తిన భక్తజనం
శివమెత్తిన శివసత్తులు.. మార్మోగిన ఢమరుక నాదాలు
ఆలయ ఆవరణ పసుపుమయం.. పరవశించిన భక్తజనం
నేడు సంక్రాంతి సందర్భంగా భారీగా రాక


ఐనవోలు, జనవరి 14:
‘శివమెత్తిన శివసత్తుల ఢమరుక నాదాలతో ఐలోని మల్లన్న ఆలయం మారుమోగింది. ‘దండాలు నన్నేలు నా తండ్రీ..’ అంటూ భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన నృత్యాలు భక్తి భావాన్ని చాటాయి. శివసత్తులు పూనకాలతో ఉర్రూతలూగించారు. ఒగ్గు పూజారుల ఢమరుకాల హోరు.. టెంకాయ బంధనాలతో ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర హోరెత్తుతోంది. భోగి పర్వదినం సందర్భంగా ఆలయం శుక్రవారం భక్తుల తో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వే లాదిగా వచ్చిన భక్తులు మొక్కులు చెల్లిస్తూ  స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంతోపాటు పరిసరాల్లోని వ్యవసాయ భూముల్లో విడిదిచేశారు. అందంగా బోనాలు చేసి స్వామి వారికి నైవేద్యం స మర్పించారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతించారు. బోనాలపై దీపాలు వెలిగించి శివతాండవం చేస్తూ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. శనివారం జరిగే మహాజాతరకు భక్తులు భారీగా రానున్నారు.

దర్శించుకున్న ప్రముఖులు
రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్‌, ఎమ్మెల్సీలు బస్వరాజ్‌ సారయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మధుమతి,  జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌,  మేయర్‌ గుండు సుధారాణి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, వర్ధన్నపేట జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీపీ అప్పారావు, ధర్మసాగర్‌ ఎంపీపీ నిమ్మ కవిత, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతధికారులు ఽస్వామి వారిని దర్శించుకున్నారు.  

అష్టోత్తర పుష్పాలతో అలంకరణ
భోగి పర్వదినం శుక్రవారం రోజున మల్లికార్జునస్వామి వారికి ఒగ్గుపూజారులు మేలుకొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాతకాలంలో విఘ్నేశ్వరపూజ శైవశుద్ధి పుణ్యాహవాచనం నిర్వహించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములో అర్చకులు 11 సార్లు నమ్మకం ఒకసారి చెమ్మకం చెప్పారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదార, పండ్లరసం, కొబ్బరినీరు బస్మోదం(విభూది) సువర్ణోదకం, గందోవకంతో మంత్ర పఠనం చేసి స్వామి వారికి అభిషేకం చేశారు. అష్టోత్తర పుష్పాలతో(108) శివలింగాన్ని అలంకరించి మహానివేదన నీరాజన మంత్రపుష్పం తదుపరి తీర్థప్రసాద వితరణ చేశారు.

నేడు ప్రభల బండ్ల ప్రదర్శన
శనివారం సంక్రాంతి రోజున మల్లన్న సన్నిధిలో ఉత్తరాన పుణ్యాకాలం,  విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, మహానివేదన పూజలు నిర్వహించనున్నారు. రాత్రి ప్రభ బండ్లు ప్రదర్శన, నైవేద్యంతో దేవుడి రథం తిరుగనుంది.















Updated Date - 2022-01-15T05:23:16+05:30 IST