Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత్ ఓటమిపై ఇంజీ షాకింగ్ కామెంట్స్

ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ చతికిల పడిన భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు, భారత్‌పై విజయం సాధించడం ద్వారా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయం సాధించలేదన్న అపప్రదను పాక్ తొలగించుకుంది. 


తాజాగా, ఈ మ్యాచ్‌పై మాట్లాడిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాక్‌ను చూసి మ్యాచ్‌కు ముందే భారత ఆటగాళ్లు భయపడిపోయారని పేర్కొన్నాడు. వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు టాస్ సమయంలోనే బయటపడిపోయిందని పేర్కొన్నాడు. టాస్ వేస్తున్నప్పుడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బాడీ లాంగ్వేజ్‌లో తేడా స్పష్టంగా కనిపించిందన్నాడు.


బాబర్ ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తే, కోహ్లీలో భయం, ఒత్తిడి స్పష్టంగా బయటపడ్డాయన్నాడు. నిజానికి తొలి మూడు ఓవర్లలోనే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అవుటైనా భారత్‌కు వచ్చిన నష్టమేమీ ఉండదని అయితే, రోహిత్ అవుట్ కావడానికి ముందే ఇండియా ఒత్తిడిలో కూరుకుపోయిందని, ఇదే విషయాన్ని ఆ తర్వాత రోహిత్ కూడా చెప్పాడని గుర్తు చేశాడు. 


గత మూడేళ్ల భారత జట్టు ప్రదర్శన చూసి టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ టీమిండియానే అనుకున్నామని, కానీ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో ఆ జట్టు దారుణంగా విఫలమైందన్నాడు. స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొనే భారత్.. కివీస్ స్పిన్నర్లు శాంట్నర్, సోధీల ముందు సాగిలపడడం చూసి జాలేసిందని ఇంజీ వివరించాడు. పాక్‌ మ్యాచ్‌పై ఒత్తిడే టీమిండియా కొంప ముంచిందని పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement