Abn logo
Jul 31 2020 @ 03:53AM

మరి..మనకేంటి?

ఐపీఎల్‌ లాభాలపై ‘స్టార్‌’ సందేహం 

మార్కెట్‌లో అనిశ్చితే కారణం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ జరగకపోతే బీసీసీఐకి దాదాపు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ లీగ్‌ను జరపాలన్న కృతనిశ్చయంతో ఉన్న బోర్డు అనుకున్నది సాధించింది. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి పోటీలు జరగబోతున్నాయి. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. కానీ వేల కోట్లు కుమ్మరించి భారత క్రికెట్‌ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్‌ గ్రూప్‌ పరిస్థితేమిటి? వారు ఊహిస్తున్నట్టు ఈ లీగ్‌ ద్వారా రూ.3 వేల కోట్ల లాభాలు తమ ఖాతాలో వేసుకుంటుందా? అంటే సందేహమే. వాస్తవానికి మార్చిలో తొలిసారి లీగ్‌ వాయిదా పడకముందు.. స్టార్‌ తమకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను 75శాతం పూర్తి చేసుకుంది. దీంతో కచ్చితంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. కానీ గత ఐదు నెలలుగా కొవిడ్‌-19 విశ్వరూపానికి దేశంలో మార్కెట్‌ పరిస్థితి తలకిందులైంది. ప్రజలతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఆర్థికంగా కుదేలయ్యాయి. అందుకే ఈ తరుణంలో ఐపీఎల్‌లాంటి భారీ లీగ్‌పై డబ్బులు కుమ్మరించేందుకు కంపెనీలు ముందుకు రాకపోవచ్చని స్టార్‌, డిస్నీ ఇండియా చైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ కూడా అభిప్రాయపడ్డారు. ఏ కంపెనీకైనా తమ ఉత్పత్తుల ప్రచారానికి ఐపీఎల్‌ను మించిన టోర్నీ లేదు. కంపెనీలు యాడ్స్‌కే వందల కోట్లు ఖర్చుపెట్టేవి. కానీ కరోనా దెబ్బకు పరిస్థితులు మారాయి. టోర్నీ జరిగే సెప్టెంబర్‌లోగా  మార్కెట్‌ పుంజుకోవడం అనుమానమే.


ఇప్పటికే వైదొలిగాయి..: గతంలో స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కొన్ని ఇప్పటికే వైదొలగగా, మరికొన్ని రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించకపోవడం కూడా స్టార్‌కు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు మూడు నెలల ముందుగానే తమ ప్రచార కార్యకలాపాల్లోకి దిగేది. కానీ ప్రస్తుతం ఇంకా ఎలాంటి మార్కెటింగ్‌ పనులూ చేపట్టలేదు. దీనికి తోడు ప్రజల్లో నెలకొన్న చైనా వ్యతిరేక ప్రచారం కూడా దెబ్బకొట్టనుంది. ఒప్పో, వివోతో పాటు మరికొన్ని సంస్థలు ఐపీఎల్‌కు రెగ్యులర్‌గా ప్రకటనలిస్తుంటాయి. ఈ సమయంలో వీరి నుంచి దక్కే ఆదాయం కూడా కష్టంగానే కనిపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement