చివర్లో చతికిలబడిన కేకేఆర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-12T02:54:35+05:30 IST

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ చివర్లో చతికిలబడ్డారు. 15 ఓవర్ల వరకు మైదానంలో పరుగుల వరద పారించిన కేకేఆర్ బ్యాట్స్‌మన్.. ఆఖరి 5 ఓవర్లలో దెబ్బతిన్నారు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. తొలుత నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చక్కటి ఓపెనింగ్..

చివర్లో చతికిలబడిన కేకేఆర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ చివర్లో చతికిలబడ్డారు. 15 ఓవర్ల వరకు మైదానంలో పరుగుల వరద పారించిన కేకేఆర్ బ్యాట్స్‌మన్.. ఆఖరి 5 ఓవర్లలో దెబ్బతిన్నారు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. తొలుత నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. పవర్ ప్లే పూర్తయిన తర్వాత గిల్ అవుటైనా.. వన్ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేసింది. 


ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్(5), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) రెండంకెల స్కోరు కూడా చేయకుండా పెవిలియన్ చేరడంతో అవతలి వైపున్న రాణాపై ఒత్తిడి పెరిగింది. దీంతో మహ్మద్ నబీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో విజయ్ శంకర్ చేతికి చిక్కాడు. ఇక చివర్లో దినేశ్ కార్తీక్(22: 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడడంతో స్కోరు వేగం కొంత పెరిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. కొద్ది సేపట్లో 188 పరుగుల లక్ష్యంతో సన్‌ రైజర్స్ బరిలోకి దిగనుంది. రైజర్స్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా.. నటరాజన్, భువనేశ్వర్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.



Updated Date - 2021-04-12T02:54:35+05:30 IST