Abn logo
Nov 17 2020 @ 04:24AM

ఈ ముగ్గురిలో ఎవరు?

Kaakateeya

అదానీ, గోయెంకా, మోహన్‌లాల్‌ 

ఐపీఎల్‌లో కొత్త జట్టు రేస్‌


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువను మరింత పెంచేందుకు లీగ్‌లో తొమ్మిదో జట్టుకు చోటు కల్పించాలని బీసీసీఐ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీని ఎవరు దక్కించుకుంటారనే విషయమై చర్చలు ఊపందుకున్నాయి. ఏదైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప కాబోయే కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌ అనేది దాదాపు ఖాయమే. లఖ్‌నవ్‌, కాన్పూర్‌, పుణె నగరాల పేర్లూ వినిపిస్తున్నా.. ఒకటికంటే ఎక్కువ జట్లకు స్థానం కల్పించాలని బీసీసీఐ అనుకుంటే తప్ప ఈ మూడింటిలో దేనికీ అవకాశం లేదు. కొత్త ఫ్రాంచైజీ ఖాయమైతే, బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో ఆమోదించాల్సి వుంటుంది. 


ఎవరికి అవకాశం ?

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌, సంజీవ్‌ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్‌పీఎ్‌సజీ తొమ్మిదో ఐపీఎల్‌ జట్టు రేస్‌లో ప్రధానంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్‌నకు కలిసి రానుంది. ఇక గతంలో రెండేళ్లపాటు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు సంజీవ్‌ గోయెంకా యజమాని. దాంతో ఆయన కూడా కొత్త జట్టు రేస్‌లో బలంగా పోటీపడుతున్నారు. వీరిద్దరుగాక..మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కూడా బరిలో ఉన్నారట. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థతో కలిసి ఆయన రేసులో ఉండనున్నట్టు తెలుస్తోంది. దు బాయ్‌లో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా బీసీసీఐ అధికారులతో మో హన్‌లాల్‌ సన్నిహితంగా మెలగడం.. లీగ్‌లో జట్టును కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చింది. 


టెండర్లు ఎప్పుడు ?

కొత్త జట్టుకు టెండర్లను ఎప్పుడు ఆహ్వానించేదీ బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తొమ్మిదో జట్టుకు ప్రవేశం కల్పించాలన్న తన ప్రణాళికను బోర్డు అమలు చేయాలంటే.. 2021 సీజన్‌ మెగా వేలానికి కూడా బీసీసీఐ సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కొత్త జట్టుతోపాటు పూర్తిస్థాయి వేలానికి సంబంధించి వచ్చే నెల రెండో వారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రస్తుత ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ‘సమయం తక్కువగానే ఉంది. కానీ లీగ్‌లోని అందరి ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొని మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. 


చెన్నైకు ఊరట..

13వ ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెగా వేలానికి ఎదురు చూస్తోంది. జట్టును పునర్నిర్మించాలని భావిస్తున్న ఆ ఫ్రాంచైజీకి పూర్తిస్థాయి వేలం అత్యంత కీలకం. తదుపరి వేలంపై బీసీసీఐ తీసుకొనే నిర్ణయంపై తమ జట్టు ప్రక్షాళన ఆధారపడి ఉంటుందని లీగ్‌ చివరి మ్యాచ్‌ అనంతరం సీఎ్‌సకే కెప్టెన్‌ ధోనీ చెప్పడం గమనార్హం. ఒక్క చెన్నైయే కాదు..పంజాబ్‌, రాజస్థాన్‌, బెంగళూరు, హైదరాబాద్‌ జట్లు కూడా మెగా వేలంకోసం ఆసక్తిగా చూస్తున్నాయి. మరోవైపు ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్‌ జట్లు పూర్తిస్థాయి వేలాన్ని ఆహ్వానిస్తుండగా.. ముంబై, ఢిల్లీ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement