ఫైనల్లో చెన్నై

ABN , First Publish Date - 2021-10-11T07:23:45+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో గెలిచింది.

ఫైనల్లో చెన్నై

తొమ్మిదోసారి టైటిల్‌ పోరుకు ధోనీసేన

ఓడిన ఢిల్లీకి మరో చాన్స్‌

వరుసగా నాలుగు ఓటములతో డీలా పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. కీలక మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. ఆఖరి ఓవర్‌లో 13 రన్స్‌ కావాల్సిన దశలో తొలి బంతికే అలీ వికెట్‌ కోల్పోయిన వేళ.. కెప్టెన్‌ కూల్‌ ధోనీ మునుపటి సత్తాతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. హ్యాట్రిక్‌ ఫోర్లతో మరో రెండు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించి.. తొమ్మిదోసారి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు ఊతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టును ఆదుకున్నారు.


దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70), రాబిన్‌ ఊతప్ప (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) అండగా నిలిచారు. ఆఖర్లో ధోనీ (6 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ చెన్నైని ఆదుకుంది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. టామ్‌ కర్రాన్‌ మూడు వికెట్లు తీశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు. ఈ సీజన్‌లో ఛేదన కోసం బరిలోకి దిగిన ఏ మ్యాచ్‌లోనూ చెన్నై ఓడకపోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ జట్టు.. బెంగళూరు-కోల్‌కతా మధ్య జరిగే ఎలిమినేటర్‌ పోరు విజేతతో బుధవారం తలపడనుంది. 


ఉత్కంఠ ముగింపు:

అత్యధిక ఛేదనలో బరిలోకి దిగిన చెన్నైకి నాలుగో బంతికే ఓపెనర్‌ డుప్లెసి (1) అవుట్‌ కావడంతో ఝలక్‌ తగిలింది. అయితే ఢిల్లీ సంతోషాన్ని ఆవిరి చేస్తూ ఊతప్ప, రుతురాజ్‌ జోడీ చెలరేగి రెండో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలిచిన ఊతప్ప తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. ఆరో ఓవర్‌లో అయితే వరుసగా 6,4,0,6,4తో 20 పరుగులు రాబట్టి పవర్‌ప్లేలో స్కోరును 59/1కి చేర్చాడు. ఆ తర్వాత నాలుగు ఓవర్లపాటు ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. 11వ ఓవర్‌లో రుతురాజ్‌ కూడా చెలరేగి 6,4తో 13 పరుగులు సాధించాడు. అటు 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఊతప్ప 13వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాదాడు. కానీ పేసర్‌ టామ్‌ కర్రాన్‌ 14వ ఓవర్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.


మూడో బంతికి ఊతప్పను, ఆరో బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ (0)ను అవుట్‌ చేశాడు. మరుసటి ఓవర్‌లోనే అంబటి రాయుడు (1).. అయ్యర్‌ మెరుపుత్రోతో రనౌటయ్యాడు. ఈ సమయంలో రుతురాజ్‌, మొయిన్‌ అలీ (16) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు.  చెన్నైకి చివరి 12 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన దశలో రుతురాజ్‌ పెవిలియన్‌  చేరడంతో ఉత్కంఠ పెరిగింది. 19వ ఓవర్‌లో అలీ 4, ధోనీ 6తో 11 రన్స్‌ వచ్చాయి. కానీ ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికే అలీ అవుటైనా.. ధోనీ హ్యాట్రిక్‌ ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు.


షా, పంత్‌ దూకుడు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీలో పృథ్వీ షా, పంత్‌ జోరు చూపారు. అయితే మిడిల్‌ ఓవర్లలో కాస్త తడబాటు కనిపించినా ఆఖర్లో ఆ జట్టు పుంజుకుంది. పంత్‌, హెట్‌మయెర్‌ (24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37) జోడీ ఐదో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. ప్లేఆ్‌ఫ్సలో ఏజట్టుకైనా ఈ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.  షా ఆరంభం నుంచే బ్యాట్‌ ఝుళిపించాడు. రెండో ఓవర్‌లో 4,6 బాదిన అతడు మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో చెలరేగాడు. అటు స్వల్ప వ్యవధిలో ధవన్‌ (7), శ్రేయాస్‌ అయ్యర్‌ (1) అవుటైనా ఐదో ఓవర్‌లో పంత్‌ రెండు సిక్సర్లతో మరింత జోరు ప్రదర్శించాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 51/2 స్కోరుతో నిలిచింది. అయితే 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా కనిపించిన పృథ్వీని 11వ ఓవర్‌లో జడేజా అవుట్‌ చేశాడు. లాంగా్‌ఫలో డుప్లెసికి క్యాచ్‌ ఇవ్వడంతో అతడి సూపర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


అంతకుముందు అక్షర్‌ పటేల్‌ (10)ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో 80/4 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. కానీ పంత్‌, హెట్‌మయెర్‌ జోడీ ఢిల్లీ స్కోరును పట్టాలెక్కించింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో వీరు వేగం పెంచారు. 16, 18 ఓవర్లలో పంత్‌ ఒంటిచేత్తో బాదిన సిక్సర్లు ఆకట్టుకున్నాయి. ఇక డెత్‌ ఓవర్లలో ఇద్దరూ పోటాపోటీగా బ్యాట్లు ఝుళిపించడంతో 190+ స్కోరు ఖాయమనిపించింది. కానీ 19వ ఓవర్‌లో హెట్‌మయెర్‌ను బ్రావో అవుట్‌ చేశాడు. ఇక చివరి ఓవర్‌లో శార్దూల్‌ 8 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. 


స్కోరుబోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) డుప్లెసి (బి) జడేజా 60; ధవన్‌ (సి) ధోనీ (బి) హాజెల్‌వుడ్‌ 7; శ్రేయాస్‌ (సి) రుతురాజ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 1; అక్షర్‌ (సి సబ్‌) శాంట్నర్‌ (బి) అలీ 10; పంత్‌ (నాటౌట్‌) 51; హెట్‌మయెర్‌ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1-36, 2-50, 3-77, 4-80, 5-163; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-26-0; హాజెల్‌వుడ్‌ 4-0-29-2; శార్దూల్‌ 3-0-36-0; జడేజా 3-0-23-1; మొయిన్‌ అలీ 4-0-27-1; బ్రావో 3-0-31-1.


చెన్నై: రుతురాజ్‌ (సి) అక్షర్‌ (బి) అవేశ్‌ 70; డుప్లెసి (బి) నోకియా 1; ఊతప్ప (సి) అయ్యర్‌ (బి) టామ్‌ కర్రాన్‌ 63; శార్దూల్‌ (సి) అయ్యర్‌ (బి) కర్రాన్‌ 0; రాయుడు (రనౌట్‌-అయ్యర్‌/రబాడ) 1; మొయిన్‌ అలీ (సి) రబాడ (బి) టామ్‌ కర్రాన్‌ 16; ధోనీ (నాటౌట్‌) 18; జడేజా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.4 ఓవర్లలో 173/6; వికెట్ల పతనం: 1-3, 2-113, 3-117, 4-119, 5-149, 6-160; బౌలింగ్‌: నోకియా 4-0-31-1; అవేశ్‌ ఖాన్‌ 4-0-47-1; రబాడ 3-0-23-0; అక్షర్‌ 3-0-23-0; టామ్‌ కర్రాన్‌ 3.4-0-29-3; అశ్విన్‌ 2-0-19-0. 

Updated Date - 2021-10-11T07:23:45+05:30 IST