సెప్టెంబరులో ఐపీఎల్‌?

ABN , First Publish Date - 2020-03-31T10:10:34+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను రద్దు చేసేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదా? ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ఏడాది జరపాలనుకుంటోందా? బోర్డు ఆలోచనలను బట్టి చూస్తే ...

సెప్టెంబరులో ఐపీఎల్‌?

మ్యాచ్‌ల కుదింపు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ తాజా సీజన్‌ను రద్దు చేసేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదా? ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ఏడాది జరపాలనుకుంటోందా? బోర్డు ఆలోచనలను బట్టి చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. కొవిడ్‌-19 ధాటికి ఈనెల 29 నుంచి ఆరంభం కావాల్సిన ఈ లీగ్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడింది. అప్పుడైనా జరుగుతుందా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ బోర్డు ఆంతరంగిక సమాచారం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఐపీఎల్‌ను నిర్వహించాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. 

రద్దయినా నష్టం లేదు: ఐపీఎల్‌ రద్దయితే బీసీసీఐ భారీగా నష్టపోతుందనే కథనాలు కూడా నిజం కాదట. ఎందుకంటే బ్రాడ్‌కాస్టర్లతో కూడిన ఒప్పందంలో ‘ఫోర్స్‌ మెజ్యూర్‌’ నిబంధన బోర్డుకు వరం కానుంది. దీని ప్రకారం విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు లీగ్‌ను రద్దు చేసే వెసులుబాటు ఉంది. అలాగని అటు బ్రాడ్‌కాస్టర్లు కూడా పెద్దగా నష్టం ఎదురుకాదని, ఐపీఎల్‌ పూర్తి ఇన్సూరెన్స్‌ చేయబడిన ఆస్తిగా బోర్డు వర్గాలు తెలిపాయి. 

తక్కువ మ్యాచ్‌లతోనే: కరోనా నియంత్రణలోకి వచ్చి ఐపీఎల్‌ జరిగినా తక్కువ మ్యాచ్‌లతోనే ముగించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. అప్పటికి టీ20 ప్రపంచకప్‌ సమీపంలోనే ఉంటుండడంతో ఈ లీగ్‌ను కుదించే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-03-31T10:10:34+05:30 IST