IPL పది కాదు ఎనిమిదే?

ABN , First Publish Date - 2020-12-22T06:00:28+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎన్ని జట్లు పాల్గొంటాయన్న ఊహాగానాలకు తెరపడినట్టే. 14వ సీజన్‌ను ఎప్పటిలాగే ఎనిమిది జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకటి లేక రెండు జట్లను అదనంగా చేర్చబోతున్నట్టు ఇటీవలి కాలంలో జోరుగా కథనాలు వినిపించాయి

IPL పది కాదు ఎనిమిదే?

వచ్చే ఏడాది ఐపీఎల్‌పై స్పష్టత

2022 నుంచే కొత్త జట్లు


న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎన్ని జట్లు పాల్గొంటాయన్న ఊహాగానాలకు తెరపడినట్టే. 14వ సీజన్‌ను ఎప్పటిలాగే ఎనిమిది జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకటి లేక రెండు జట్లను అదనంగా చేర్చబోతున్నట్టు ఇటీవలి కాలంలో జోరుగా కథనాలు వినిపించాయి. కానీ, హడావిడిగా కొత్త జట్లను చేర్చే ప్రయత్నాలను ప్రస్తుత ఫ్రాంచైజీలలో చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయట. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరిగే లీగ్‌ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఇంకో మూడున్నర నెలలే సమయం ఉన్నందున కొత్త జట్లను చేర్చడం సాధ్యం కాదని భావిస్తోందట.


అయితే 2022 నుంచి పది జట్లతో ఐపీఎల్‌ను జరపాలని బోర్డు భావిస్తోంది. ఈనెల 24న అహ్మదాబాద్‌లో జరిగే బోర్డు ఏజీఎంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారు. ‘కొత్త జట్లను చేర్చేందుకు ఇది తగిన సమయం కాదు. ఆటగాళ్ల భారీ వేలాన్ని కూడా హడావిడిగా చేపట్టలేం. 10 జట్లు.. 94 మ్యాచ్‌లంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. ఇక స్టార్‌ గ్రూప్‌తో ప్రసార ఒప్పందం కూడా 2021తో ముగుస్తుంది. ఆ తర్వాతే రెండు జట్లను చేరిస్తే ఎక్కువ మొత్తానికి బ్రాడ్‌కాస్ట్‌ హక్కులతో పాటు ఇతర వాణిజ్య ఒప్పందాలను కూడా కుదుర్చుకోవచ్చు.


పూర్తి విషయాలు ఏజీఎంలో చర్చించాక తెలుస్తాయి’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏదిఏమైనా కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు పలు కార్పొరేట్‌ కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌ నుంచి పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాడు. అలాగే అతడికి ఆర్‌పీఎ్‌సజీ కంపెనీ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా గట్టి పోటీనే ఇస్తున్నాడు. గతంలో రెండేళ్ల పాటు రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ పేరిట ఫ్రాంచైజీని నిర్వహించిన అనుభవం కూడా గోయెంకాకు ఉంది. అటు బీసీసీఐ కూడా కొత్త జట్ల కోసం ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్యలో టెండర్లను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. 

Updated Date - 2020-12-22T06:00:28+05:30 IST