Abn logo
Oct 8 2021 @ 00:57AM

ప్లేఆఫ్స్‌కు చేరినట్టే..

కోల్‌కతా ఘనవిజయం

రాజస్థాన్‌ 85కే ఆలౌట్‌ 

రేసు నుంచి ముంబై అవుట్‌ ?

షార్జా: ఐపీఎల్‌ రెండో దశలో అదరగొడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అత్యంత కీలక మ్యాచ్‌లో అదరగొట్టింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ చెలరేగి రాజస్థాన్‌ రాయల్స్‌పై 86 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 14 పాయింట్లతో దాదాపుగా మోర్గాన్‌ సేన ప్లేఆ్‌ఫ్సలో చోటు దక్కించుకున్నట్టే. ఆర్‌ఆర్‌ ఓటమితో పంజాబ్‌ అధికారికంగానే నిష్క్రమించగా.. ముంబై పరిస్థితి కూడా దాదాపుగా ఇంటికే. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. గిల్‌ (56), వెంకటేశ్‌ అయ్యర్‌ (38) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. తెవాటియా (44) టాప్‌ స్కోరర్‌. శివమ్‌ మావికి నాలుగు, ఫెర్గూసన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శివమ్‌ మావి నిలిచాడు.


వికెట్ల జాతర:

భారీ ఛేదన కోసం రాజస్థాన్‌ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగిందేమో కానీ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోయింది. మూడో బంతికే జైశ్వాల్‌ (0), రెండో ఓవర్‌లో శాంసన్‌ (1) అవుట్‌ కావడంతో ఆర్‌ఆర్‌ ఇన్నింగ్స్‌ పూర్తిగా లయ తప్పింది. దీనికి తోడు నాలుగో ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ (6), రావత్‌ (0)లను ఫెర్గూసన్‌ దెబ్బతీయడంతో ఐపీఎల్‌లో తమ రెండో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (17/4)ను నమోదు చేసుకుంది. ఇక ఏడో ఓవర్‌లో ఫిలిప్స్‌ (8), దూబే (18) చెరో సిక్సర్‌ బాదినా మరుసటి ఓవర్‌లోనే ఈ జోడీని శివమ్‌ మావి బౌల్డ్‌ చేశాడు. మోరిస్‌ (0) డకౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 37/7.  ఇంత తక్కువ పరుగులకే ఏడు వికెట్లు పడడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ దశలో అత్యంత చెత్త స్కోరు విషయంలో ఆర్‌సీబీని (49)ని కూడా అధిగమిస్తుందేమోననిపించింది. కానీ తెవాటియా ఒక్కసారిగా చెలరేగాడు. ఉనాద్కట్‌ (6)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 27, సకారియా (1)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 23 పరుగుల భాగస్వామ్యం అందించి పరువు కాపాడాడు. 16వ ఓవర్‌లో అతడి పోరాటానికి మావి ముగింపు పలకడంతో కేకేఆర్‌ సంబరాల్లో మునిగింది.


ఓపెనర్ల శుభారంభం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.   11వ ఓవర్‌లో గిల్‌ సిక్సర్‌తో ఊపు తెచ్చినా అటు అయ్యర్‌ రివర్స్‌ స్వీప్‌నకు యత్నించి బౌల్డ్‌ అయ్యాడు. అటు రాణా (12) వచ్చీ రావడంతోనే 4,6 బాది ఐదు బంతుల్లోనే నిష్క్రమించాడు. ఈ దశలో గిల్‌కు అండగా త్రిపాఠి (21) నిలిచి వరుస ఫోర్లతో స్కోరును పెంచాడు. గిల్‌ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక మోరి్‌సకు చిక్కాడు. మూడో వికెట్‌కు 23 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌లో సకారియా.. త్రిపాఠిని బౌల్డ్‌ చేసి మూడు పరుగులే ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌లో మోర్గాన్‌ సిక్సర్‌తో మొత్తం 16 పరుగులు రావడంతో ఈ సీజన్‌లో షార్జా వేదికపై అత్యధిక స్కోరు నమోదైంది. 


స్కోరుబోర్డు

కోల్‌కతా: గిల్‌ (సి) జైశ్వాల్‌ (బి) మోరిస్‌ 56; వెంకటేశ్‌ (బి) తెవాటియా 38; రాణా (సి) లివింగ్‌స్టోన్‌ (బి) ఫిలిప్స్‌ 12; త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 14; మోర్గాన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 171/4; వికెట్ల పతనం: 1-79, 2-92, 3-133, 4-145; బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4-0-35-0; మోరిస్‌ 4-0-28-1; సకారియా 4-0-23-1; ముస్తాఫిజుర్‌ 4-0-31-0; దూబే 2-0-18-0; తెవాటియా 1-0-11-1; ఫిలిప్స్‌ 1-0-17-1.


రాజస్థాన్‌: జైశ్వాల్‌ (బి) షకీబల్‌ 0; లివింగ్‌స్టోన్‌ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్‌ 6; సంజూ శాంసన్‌ (సి) మోర్గాన్‌ (బి) మావి 1; దూబే (బి) మావి 18; అనుజ్‌ (ఎల్బీ) ఫెర్గూసన్‌ 0; ఫిలిప్స్‌ (బి) మావి 8; తెవాటియా (బి) మావి 44; మోరిస్‌ (ఎల్బీ) వరుణ్‌ 0; ఉనాద్కట్‌ (సి) షకీబల్‌ (బి) ఫెర్గూసన్‌ 6; సకారియా (రనౌట్‌/షకీబల్‌) 1; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 16.1 ఓవర్లలో 85 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-1, 3-12, 4-13, 5-33, 6-34, 7-35, 8-62, 9-85, 10-85; బౌలింగ్‌: షకీబల్‌ 1-0-1-1; శివమ్‌ మావి 3.1-0-21-4; నరైన్‌ 4-0-30-0; ఫెర్గూసన్‌ 4-0-18-3; వరుణ్‌ 4-0-14-1.