Abn logo
Apr 3 2021 @ 04:58AM

‘మూడు’ కోసం ఆరాటం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిళ్ల 

ఉత్తమ ప్రదర్శన విజేత 2012, 2014

ఐపీఎల్ 6 రోజుల్లో


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిళ్ల విషయంలో ముంబై ఇండియన్స్‌.. ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌దే హవా. ఈ రెండు జట్ల తర్వాత మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా పేరు తెచ్చుకోవాలనేది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆశ. ఇందుకోసం 2015 నుంచి ఆ జట్టు పోరాటం సాగుతూనే ఉంది. ఆండ్రీ రస్సెల్‌ మెరుపులపై ఎక్కువగా ఆధారపడిన ఈ జట్టు క్రితంసారి నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడి ప్లేఆ్‌ఫ్సకు చేరలేకపోయింది. పేపర్‌పై భీకరంగా కనిపించినా బరిలోకి దిగాక నిలకడ లోపిస్తున్న కోల్‌‘కథ’ ఈసారైనా మారుతుందో లేదో చూడాలి.బలం

 ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రస్సెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, సునీల్‌ నరైన్‌, షకీబల్‌, ఫెర్గూసన్‌తో కూడిన విదేశీ ఆటగాళ్ల బృందం ఈ జట్టు ప్రధాన బలంగా కనిపిస్తోంది. మోర్గాన్‌ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఈ సీజన్‌లో జట్టును నడిపించబోతున్నాడు. రస్సెల్‌ ఫామ్‌లో ఉంటే ప్రత్యర్థి బౌలర్‌ బంతుల కోసం ఆకాశం వైపు చూడాల్సిందే. వీరితో పాటు శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి బ్యాటింగ్‌ జట్టుకు అదనపు ఆకర్షణ. స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్థాయికి తగ్గట్టు చెలరేగితే కేకేఆర్‌కు టైటిల్‌ చాన్స్‌ ఎక్కువగా ఉంటాయి. పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఫామ్‌లో ఉండడం వీరికి కలిసివచ్చేదే.


బలహీనత

గత సీజన్‌లో రస్సెల్‌ ప్రభావం చూపలేకపోయాడు. ఒక రకంగా జట్టుకు అతడే బలం.. బలహీనతగానూ మారాడు. దినేశ్‌ కార్తీక్‌ నిలకడలేమి కూడా ఇబ్బందిపెడుతోంది. వికెట్‌ కీపర్‌గా అతడికి సరైన బ్యాకప్‌ లేకపోవడం లోటుగా ఉంది. ముఖ్యంగా ఒకప్పటి తమ బలమైన స్పిన్‌ విభాగం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ క్రితంసారి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెటే తీశాడు. నరైన్‌ బౌలింగ్‌ శైలిని మార్చుకున్నాక పెద్దగా వికెట్లు దక్కడం లేదు. వెటరన్‌ హర్భజన్‌ను తీసుకున్నప్పటికీ ఏడాదిగా అతడికి మ్యాచ్‌ ప్రాక్టీసే లేదు. ఇక యూఏఈలో 17 వికెట్లు తీసిన మరో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఫిట్‌నెస్‌ సమస్యల నుంచి ఇటీవలే కోలుకున్నాడు. షకీబల్‌ కూడా విండీస్‌తో సిరీస్‌లో పలుమార్లు గాయపడ్డాడు.


జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌, గిల్‌, రాణా, త్రిపాఠి, కుల్దీప్‌, హర్భజన్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి, నాగర్‌కోటి, శివమ్‌ మావి, రింకూ సింగ్‌, సందీప్‌ వారియర్‌, షెల్డన్‌, వైభవ్‌, వెంకటేశ్‌, నేగి.

విదేశీ ఆటగాళ్లు: మోర్గాన్‌ (కెప్టెన్‌), సీఫర్ట్‌, రస్సెల్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, కమిన్స్‌, షకీబల్‌, కట్టింగ్‌.


నైట్ రైడర్స్ ఎవరితో ఎప్పుడు?

తేదీ           మ్యాచ్‌

ఏప్రిల్‌ 11 హైదరాబాద్‌

ఏప్రిల్‌ 13 ముంబై

ఏప్రిల్‌ 18 బెంగళూరు

ఏప్రిల్‌ 21 చెన్నై

ఏప్రిల్‌ 24 రాజస్థాన్‌

ఏప్రిల్‌ 26 పంజాబ్‌

ఏప్రిల్‌ 29 ఢిల్లీ

మే 3 బెంగళూరు

మే 8 ఢిల్లీ

మే 10 ముంబై

మే 12 చెన్నై

మే 15 పంజాబ్‌

మే 18 రాజస్థాన్‌

మే 21 హైదరాబాద్‌


కోల్‌కతా  ప్రయత్నం ఫలించేనా?

గౌతం గంభీర్‌ దూరమయ్యాక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి మునుపటి మేజిక్‌ కనిపించడం లేదు. అప్పటి నుంచి ఈ జట్టు ఒకసారి మాత్రమే ప్లేఆ్‌ఫ్సకు చేరింది.  2018లో క్వాలిఫయర్‌ 2లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓడాక, ఆ తర్వాత రెండు సీజన్లలో లీగ్‌ దశతోనే సరిపెట్టుకుంది. జట్టును ముందుండి నడిపించే నాయకుడు కేకేఆర్‌కు కరువయ్యాడు. యూఏఈలో జరిగిన సీజన్‌లో ఓపెనింగ్‌.. మిడిలార్డర్‌.. ఫినిషింగ్‌లో లోపాలు కనిపించాయి. దీంతో పరాజయాలకు బాధ్యత వహిస్తూ మధ్యలోనే దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో మోర్గాన్‌కు బాధ్యతలు అందించారు. ఈసారి వేలంలో తమ మాజీ ఆటగాళ్లయిన షకీబ్‌, బెన్‌ కట్టింగ్‌ను కేకేఆర్‌ తిరిగి కొనుగోలు చేసింది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Advertisement
Advertisement
Advertisement