Abn logo
Oct 22 2021 @ 03:26AM

ఐపీఎల్‌ ప్రసార హక్కులద్వారా బోర్డుకు రూ. 37వేల కోట్లు !

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్రసార హక్కుల (టీవీ, డిజిటల్‌) ద్వారా బీసీసీఐ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. తదుపరి ఐదేళ్ల (2023-27)కు ఈ హక్కుల ద్వారా బోర్డుకు ఏకంగా రూ. 37 వేల కోట్ల ఆదాయం సమకూరనున్నట్టు సమాచారం. రెండు దిగ్గజ సంస్థలకు చెందిన జట్లు ఐపీఎల్‌లో కొత్తగా రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మెగా టోర్నీ ప్రసార హక్కుల విలువ అమాంతం పెరగనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత (2018-2022) ప్రసార హక్కులు స్టార్‌ నెట్‌వర్క్‌  అధీనంలో ఉన్నాయి. ఈ విలువ రూ. 16,347.50 కోట్లుకాగా..అది దాదాపు రెండురెట్లకుపైగా దూసుకుపోనున్నట్టు అంచనా. కాగా..రాబోయే ఐదు సంవత్సరాల ప్రసార హక్కుల కోసం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పోటీపడనున్నట్టు సమాచారం. ఇక రెండు కొత్త జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 7 నుంచి 10వేల కోట్ల ఆదాయం రానుందన్న అంచనాలతో ప్రసార హక్కుల విలువ కూడా ఆమేర పెరగనున్నట్టు చెబుతున్నారు.