Abn logo
Sep 19 2021 @ 04:15AM

విరామం ముగిసె.. ఫ్యాన్స్‌ మురిసె

  • నేటి నుంచే ఐపీఎల్‌ రెండో దశ
  • చెన్నై-ముంబై పోరుతో లీగ్‌ పునఃప్రారంభం
  • రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

కరోనా ధాటికి మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌కు మళ్లీ తెర లేచింది. ఈ రెండో దశకు అదిరిపోయే ఆరంభం ఇచ్చేందుకు చెన్నై-ముంబై జట్లు రెడీగా ఉన్నాయి. సూపర్‌ స్టార్లతో కూడిన ఈ రెండు టీమ్స్‌ విన్యాసాల కోసం అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ఈ లీగ్‌ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్‌ ఉర్రూతలూగించనుంది. అందుకే క్రికెటర్లంతా ఐపీఎల్‌ను మెగా టోర్నీకి సన్నాహకంగా వినియోగించుకోబోతున్నారు. దీంతో దాదాపు రెండు నెలలపాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నాన్‌స్టా్‌ప ఎంటర్‌టైన్‌మెంట్‌ కనువిందు చేయబోతోంది.


దుబాయ్‌: ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-14వ సీజన్‌ రెండో దశను ఆరంభించేందుకు ఆదివారం బరిలోకి దిగబోతున్నాయి. ఏప్రిల్‌ 9 నుంచి మే 2 వరకు భారత్‌లో జరిగిన ఈ సీజన్‌ ఆరంభ దశలో 29 మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే బయో బబుల్‌ రక్షణలో ఉన్నప్పటికీ క్రికెటర్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకడం.. మరికొంత మంది లీగ్‌నుంచి తప్పుకోవడంతో టోర్నీని అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో మిగిలిన 31 మ్యాచ్‌లను  యూఏఈలో నిర్వహిస్తున్నారు. అక్టోబరు 15న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుండగా.. 17నుంచే టీ20 ప్రపంచకప్‌ షురూ కాబోతోంది. దీంతో పొట్టికప్పునకు ఐపీఎల్‌లోని అంతర్జాతీయ ఆటగాళ్లకు చక్కటి సన్నాహకం కానుంది. తుదిజట్లలో లేని ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో సత్తా చాటుకుంటే చివరి నిమిషంలోనైనా ప్రపంచక్‌పలో చోటు దక్కే చాన్స్‌ ఉంటుంది. ఎందుకంటే అక్టోబరు 10 వరకు జట్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసేందుకు ఐసీసీ అనుమతించింది. ఇక, లీగ్‌లో చెన్నై ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పట్టికలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంది. అటు ముంబై ఆడిన ఏడింట్లో నాలుగు గెలిచి మూడు మ్యాచ్‌లను ఓడింది. తమ చివరి మ్యాచ్‌లో చెన్నై 218 పరుగులు చేసినా ముంబై ఆఖరి బంతికి నెగ్గింది. దీంతో ఈ మ్యాచ్‌ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో సీఎ్‌సకే ఉంది.జోష్‌లో రోహిత్‌ సేన

నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. తొలి దశ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ముంబై ఆఖరి బంతికి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకుంటోంది. అలాగే యూఏఈలో చెన్నైకి మెరుగైన రికార్డు లేకపోవడం వీరికి అనుకూలించనుంది. రోహిత్‌, డికాక్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, పొలార్డ్‌లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో పలు మార్పులు జరగనున్నాయి.


ధోనీ బృందంలో గాయాల గేయాలు

2020లో యూఏఈలోనే జరిగిన లీగ్‌లో దారుణ ప్రదర్శన తర్వాత చెన్నై జట్టుకు ఈసారి విన్నింగ్‌ కాంబినేషన్‌ కుదిరింది. కానీ తాజాగా పలువురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తొలి దశలో ఓపెనర్‌ రుతురాజ్‌, ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ అదరగొట్టారు. అయితే కర్రాన్‌ ఇంకా క్వారంటైన్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. స్టార్‌ ఓపెనర్‌ డుప్లెసి గాయం ఆందోళన కలిగిస్తోంది. అతడి స్థానాన్ని ఊతప్ప భర్తీ చేసే చాన్సుంది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌ చేయడం సందేహమే. ఇక జడేజా, మొయిన్‌ అలీ బౌలింగ్‌.. బ్యాటింగ్‌తో జట్టుకు కీలక విజయాలందించారు. అలాగే ధోనీ, రైనా, రాయుడు కూడా ఆశించిన రీతిలో బ్యాట్లు ఝుళిపిస్తే జట్టుకు ఎదురుండదు. ఇందులో గెలిస్తే పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళుతుంది.జట్లు (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, ఊతప్ప/మొయిన్‌ అలీ, రైనా, అంబటి రాయుడు, జడేజా, బ్రావో, ధోనీ (కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌, ఎన్‌గిడి/హాజెల్‌వుడ్‌.


ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా, మిల్నే/నేథన్‌ కుల్టర్‌ నైల్‌, జయంత్‌ యాదవ్‌/రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా.