రూ. 10.7 కోట్లకు.. 102 పరుగులే!

ABN , First Publish Date - 2020-10-29T09:19:15+05:30 IST

ఐపీఎల్‌ 13వ సీజన్‌ దాదాపుగా పూర్తికావస్తోంది. ఈ ఏడాది లీగ్‌లో చాలా మ్యాచ్‌లు చివరి బంతి వరకూ ఆసక్తిగా సాగుతున్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో

రూ. 10.7 కోట్లకు.. 102 పరుగులే!

ఐపీఎల్‌  అట్టర్‌ ఫ్లాప్‌ ఫైవ్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌ దాదాపుగా పూర్తికావస్తోంది. ఈ ఏడాది లీగ్‌లో చాలా మ్యాచ్‌లు చివరి బంతి వరకూ ఆసక్తిగా సాగుతున్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు జరగడం కూడా ఈ సీజన్‌లో విశేషం. ఆయా జట్ల ప్రదర్శనను చూస్తే ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అయితే, ఈ సీజన్‌లో భారీ అంచనాలు పెట్టుకొన్న కొందరు ఆటగాళ్లు అట్టర్‌ ఫ్లాపవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా విఫలమవుతూ.. కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఫ్రాంచైజీలకు కనీస న్యాయం చేయలేక పోతున్న ఐదుగురు ఆటగాళ్లు..


షెల్డన్‌ కాట్రెల్‌

ఐపీఎల్‌ వేలానికి ముందు టీమిండియా.. వెస్టిండీస్‌ టూర్‌లో కాట్రెల్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడి స్వింగ్‌ డెలివరీల కంటే.. వికెట్‌ తీసిన తర్వాత సెల్యూట్‌ చేసే విధానమే ఎక్కువగా హైలైట్‌ అయింది. పంజాబ్‌ అతడిని రూ. 8.5 కోట్లకు సొంతం చేసుకొంది. లీగ్‌ ఆరంభంలో కాట్రెల్‌ ఫర్వాలేదనిపించినా.. తర్వాత ఏమాత్రం ప్రభావం చూపించలేక పోతున్నాడు. కేవలం ఆరు వికెట్లే పడగొట్టాడు. పరుగులను కూడా భారీగానే సమర్పించుకున్నాడు. దీంతో ఆరు మ్యాచ్‌ల తర్వాత అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది.


ప్యాట్‌ కమిన్స్‌ 

ఆస్ట్రేలియా  పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఔరా అనిపించేలా రూ. 15.5 కోట్లకు ఖరీదు చేసింది. లీగ్‌లో పన్నెండు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్‌ 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 131 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. కానీ, జట్టు తననుంచి ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేకపోతున్నాడు.


ఆండ్రీ రస్సెల్‌ 

రస్సెల్‌ అంటే బిగ్‌ హిట్టింగ్‌కు మారుపేరు. రస్సెల్‌ క్రీజులో ఉన్నాడంటే స్కోరు బోర్డు రేసు గుర్రమే. గత నాలుగు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నమ్మదగ్గ ఆల్‌రౌండర్‌. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల డేంజర్‌మన్‌ను కోల్‌కతా రూ. 8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 204.81 స్ట్రయిక్‌ రేట్‌తో 510 పరుగులు చేసిన ఆండ్రీ.. ఈ సీజన్‌లో మరిన్ని అద్భుతాలు చేస్తాడేమోనని ఆశించారు. కానీ, ఆడిన 9 మ్యాచ్‌ల్లో 92 పరుగులు (11.5 సగటు) చేసి, 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.


రాబిన్‌ ఊతప్ప 

రాబిన్‌ ఊతప్ప చాలా కాలం కోల్‌కతాకు ఆడాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు అతడిని వేలానికి ఉంచడంతో.. రాజస్థాన్‌ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, తనపై ఉన్న అంచనాలను అతడు అందుకోలేకపోయాడు. అతడు పది మ్యాచ్‌ల్లో 16 సగటుతో 160 పరుగులు మాత్రమే చేశాడు.


మాక్స్‌వెల్‌

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ను పంజాబ్‌ కింగ్స్‌ లెవెన్‌ రూ. 10.75 కోట్లకు ఖరీదు చేసింది. తన రేటుకు కనీస న్యాయం చేయకపోవడం అటుంచి దారుణంగా నిరాశపరుస్తున్నాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 14.5 సగటుతో 102 పరుగులే చేశాడు. అతడు కనీసం ఒక్క సిక్స్‌కూడా కొట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో అత్యధికంగా 32 పరుగులు చేశాడు.  బౌలింగ్‌లోనూ విఫలమై మూడు వికెట్లు మాత్రమే 

తీశాడు. 

Updated Date - 2020-10-29T09:19:15+05:30 IST