కరోనా కష్టకాలంలోనూ ఐపీఓల జోరు

ABN , First Publish Date - 2021-05-10T06:50:04+05:30 IST

దలాల్‌ స్ర్టీట్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు భారీగా ఉంది. కరోనా కష్టకాలంలోనూ వివిధ సంస్థలు వెనుకడుగు లేకుండా నిధులు సమీకరిస్తున్నాయి...

కరోనా కష్టకాలంలోనూ ఐపీఓల జోరు

  •  4 నెలల్లో 133 శాతం వృద్ధి


న్యూఢిల్లీ: దలాల్‌ స్ర్టీట్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు భారీగా ఉంది. కరోనా కష్టకాలంలోనూ వివిధ సంస్థలు వెనుకడుగు లేకుండా నిధులు సమీకరిస్తున్నాయి. జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో గత ఏడా ది ఇదే సమయంతో పోల్చితే ఐపీఓల సంఖ్య 133 శాతం పెరిగింది. మొత్తం 28 ఐపీఓల ద్వారా వివిధ కంపెనీలు 270 కోట్ల డాలర్లు (రూ.20,250 కోట్లు) సమీకరించాయి. అలాగే వివిధ కార్పొరేట్‌ కంపెనీలు విలీనాలు, కొనుగోళ్లు (ఎం అండ్‌ ఏ)  కూడా జోరుగా సాగిస్తున్నాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్ల గణాంకా ల దిగ్గజం రిఫినిటివ్‌ తాజా గణాంకాలు ఈ విషయం తెలుపుతున్నాయి. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు...

  1. కరోనా రెండో విడత విజృంభణ కార్పొరేట్ల నిధుల సేకరణకు అడ్డుకట్ట వేయలేదు. ఏప్రిల్‌ చివరినాటికి డీల్స్‌ సంఖ్య 8 శాతం పెరిగి 437కి చేరింది. నమోదైన మొత్తం డీల్స్‌ విలువ  323 కోట్ల డాలర్లు (రూ.24,225 కోట్లు).
  2. ప్రధానంగా ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కుదుర్చుకున్న డీల్స్‌ 110 శాతం పెరిగాయి. ఆ సంస్థలు మొత్తం 93 డీల్స్‌ ద్వారా 590 కోట్ల డాలర్లు (రూ.44,250 కోట్లు) విలువ గల డీల్స్‌ కుదుర్చుకున్నాయి. విదేశీ కొనుగోళ్ళ వృద్ధి మాత్రం 4 శాతానికే పరిమితం అయింది. 
  3. ఫార్మా, టెక్నాలజీ, రియల్టీ, కన్స్యూమర్‌, ఎనర్జీ విభాగాల్లోని కంపెనీలు అధిక డీల్స్‌ కుదుర్చుకున్నాయి. 
  4. ఈక్విటీ క్యాపిటల్‌ మార్కెట్లు కూడా 23 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 62 ఇష్యూలతో 800 కోట్ల డాలర్లు (రూ.60 వేల కోట్లు) సమీకరించాయి. డెట్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ 27 శాతం క్షీణించింది. 


ఫిన్‌కేర్‌ ఎస్‌ఎ్‌ఫబీ ఐపీఓ దరఖాస్తు: డిజిటల్‌ రుణాల విభాగంలోని ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ.1330 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా బ్యాంకు రూ.330 కోట్ల విలువ గల ఈక్విటీలను విక్రయిస్తుంది. మరో రూ.వెయ్యి కోట్లు దీని ప్రమోటర్‌ అయిన ఫిన్‌కేర్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సమీకరిస్తుంది. మూలధన అవసరాల కోసం టయర్‌-1 క్యాపిటల్‌,  ఇతర వ్యయాలకు కూడా వినియోగించుకోనున్నట్టు ఆ పత్రాల్లో బ్యాంకు తెలిపింది. 

ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ: మరోపక్క విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి నిధుల ఉపసంహరణ కొనసాగిస్తున్నారు. మే నెల మొదటి వారంలో ఆ సంస్థలు రూ.5936 కోట్ల విలువ గల నిధులు ఉపసంహరించాయి. కరోనా విజృంభణ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే వారి అమ్మకాల జోరు మరింతగా పెరగవచ్చునని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 



రెండో నెలలోనూ పెరిగిన ఎంఎ్‌ఫల కొనుగోళ్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల కొనుగోళ్లు వరుసగా రెండో నెలలో కూడా కొనసాగాయి. ఏప్రిల్‌ నెలలో ఆ సంస్థలు రూ.5526 కోట్ల విలువ గల ఈక్విటీలు కొనుగోలు చేశాయి.  గత 10 నెలల కాలంలో ఎంఎఫ్‌ సంస్థలు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టిన అధిక మొత్తం ఇదే. మార్కెట్‌ కన్సాలిడేషన్‌ అనంతరం మళ్లీ పరుగులు తీస్తుందన్న ఆశలే ఇందుకు కారణమంటున్నారు. బాండ్లపై రాబడులు తగ్గడం కూడా ఎంఎఫ్‌ సంస్థలు ఈక్విటీల వైపు దృష్టి సారించడానికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. 

Updated Date - 2021-05-10T06:50:04+05:30 IST