కనిపిస్తున్న మహిళా రిఫరీ కాళ్లు.. లైవ్ మ్యాచ్‌ వందసార్లు సెన్సార్

ABN , First Publish Date - 2021-04-16T23:28:30+05:30 IST

ముస్లిం చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. టీవీ షోలకు కూడా ఇక్కడ సెన్సార్ ఉంటుంది.

కనిపిస్తున్న మహిళా రిఫరీ కాళ్లు.. లైవ్ మ్యాచ్‌ వందసార్లు సెన్సార్

టెహ్రాన్: ముస్లిం చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. టీవీ షోలకు కూడా ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఆచ్ఛాదన లేకుండా మహిళల మోకాళ్లు కూడా కనిపించకూడదు. ఇక సినిమాలైతే సరేసరి. విదేశీ సినిమాలు ఇరాన్‌లో విడుదలైతే తిప్పలే. విదేశీ సినిమాలు టీవీలో ప్రసారమైనా నిబంధనలు పాటించాల్సిందే. ఇరాన్‌లో నిర్బంధ హిజాబ్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పే ఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది.


టోటెన్‌హామ్-మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మధ్య ఆదివారం టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ స్టేడియంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అసిస్టెంట్ రిఫరీ‌గా వ్యవహరిస్తున్న సియోన్ మెస్సీ-ఎలిస్ షార్ట్స్ ధరించింది.


దీంతో ఆమె తొడల నుంచి సాక్స్ ధరించినంత వరకు ఉన్న భాగం ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా కనిపించింది. ఆమెను టీవీలో అలా చూపించడం అక్కడి చట్టాల ప్రకారం విరుద్ధం కావడంతో మ్యాచ్‌లో ఆమె కనిపించిన ప్రతిసారీ లైవ్ టెలికాస్ట్ చేస్తున్న కెమెరా ఒక్కసారిగా స్టేడియం పైభాగాన్ని చూపించేది. రిఫరీ కనిపించిన ప్రతిసారీ ఇరానియన్ టీవీది ఇదే తీరు. రిఫరీ కాళ్లు ప్రేక్షకులకు కనిపించకుండా ఉండేందుకు పదులసార్లు ఇలాగే సెన్సార్ చేసింది. 


ఇరానియన్ నిర్బంధ హిజాబ్ చట్టాన్ని వ్యతిరేకించే రైట్స్ గ్రూప్ ‘మై స్టెల్తీ ఫ్రీడం’ ఇరానియన్ టీవీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను దాదాపు వందసార్లు ఇలాగే సెన్సార్ చేసిందంటూ దుయ్యబట్టింది. మరోవైపు సాకర్ అభిమానులు కూడా ఇరానియన్ టీవీ తీరుపై మండిపడుతున్నారు. ప్రపంచం మొత్తం ఒకటి చూస్తే ఇరానియనలు మరోటి చూస్తున్నారంటూ విమర్శలు వర్షం కురిపించారు. 

Updated Date - 2021-04-16T23:28:30+05:30 IST