కరోనా పాలసీలొస్తున్నాయి..

ABN , First Publish Date - 2020-06-28T06:13:22+05:30 IST

దేశంలో కరోనా విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 5 లక్షలు దాటాయి. ఈ వైరస్‌ సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు బీమా సదుపాయం కల్పించేందుకు...

కరోనా పాలసీలొస్తున్నాయి..

  • జూలై 10 నాటికి అందుబాటులోకి 
  • పాలసీల రూపకల్పనకు మార్గదర్శకాలు విడుదల  
  • రెండు రకాల పథకాలను ఆఫర్‌ చేయాలని ఐఆర్‌డీఏఐ ఆదేశాలు 


దేశంలో కరోనా విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 5 లక్షలు దాటాయి. ఈ వైరస్‌ సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు బీమా సదుపాయం కల్పించేందుకు జూలై 10 నాటికి ప్రత్యేకంగా రెండు పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించింది. ‘కరోనా కవచ్‌’ పేరుతో స్టాండర్డ్‌  ఇండెమ్నిటీ హెల్త్‌ పాలసీతో పాటు ‘కరోనా రక్షక్‌’ పేరుతో స్టాండర్డ్‌ బెనిఫిట్‌ పాలసీని కంపెనీలు ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తిగత బీమా పథకాల రూపకల్పన కోసం ఇన్సూరెన్స్‌ కంపెనీలకు నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసింది. జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇండెమ్నిటీ పాలసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు స్టాండర్డ్‌ బెనిఫిట్‌ పాలసీని సైతం అందుబాటులోకి తీసుకురావాలంటూ లైఫ్‌, జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సూచించింది. గతంలో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాల్లో మాత్రం రెండు పథకాలనూ తప్పనిసరిగా ఆఫర్‌ చేయాలని పేర్కొంది. 


ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పాలసీల ద్వారానూ కరోనాకు కవరేజీ లభిస్తోంది. కానీ, ఆరోగ్య బీమా పాలసీదారు ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరి, కనీసం 24 గంటలు ఉంటేనే కవరేజీ వర్తిస్తుంది. పైగా, కరోనా సంక్రమణను నిరోధించేందుకు ఉపయోగించే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్లు (పీపీఈ), గ్లౌజ్‌లు, మాస్క్‌లు తదితరాల ఖర్చును బీమా కంపెనీలు చెల్లించడం లేదు. అంతేకాదు, ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో స్వల్ప లక్షణాలు లేదా ఎలాంటి లక్షణాలు లేనివే అధికం. వీరు ఇంటి వద్దనుంచే చికిత్స తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ సందర్భంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా కవరేజీ లభించని పరిస్థితి. ఈ అవసరాల దృష్ట్యా కరోనా చికిత్స కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలను వంద శాతం పాటించడం సాధ్యం కాకపోవచ్చని బీమా కంపెనీల ప్రతినిధులంటున్నారు. స్వల్ప మార్పులతో పాలసీలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  


  • కొవిడ్‌-19  పాలసీల  కామన్‌ ఫీచర్లు 

వయసు 

బీమా సంస్థలు 18 ఏళ్ల నుంచి కనీసం 65 ఏళ్ల వారికి కవరేజీ కల్పించాల్సి ఉంటుంది.   ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆప్షన్‌ ద్వారా పాలసీదారు తనపై ఆధారపడిన పిల్లల్లో 3 నెలల నుంచి 25 ఏళ్ల వరకు వయసున్న వారికీ కవరేజీ పొందవచ్చు. అయితే, ఇండెమ్నిటీ పాలసీలో మాత్రమే ఈ ఆప్షన్‌ ఉంటుంది. 


కాలపరిమితి 

మూడు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మూడున్నర, ఆరున్నర, తొమిదిన్నర నెలల కాలపరిమితిలో మీకు అనుగుణమైన ఆప్షన్‌తో పాలసీని ఎంచుకోవచ్చు. ఈ పాలసీలకు జీవితకాల రెన్యువల్‌, మైగ్రేషన్‌, పోర్టబిలిటీ వంటి సదుపాయాలు మాత్రం ఉండవు. 


ప్రీమియం 

పథకం, కాలపరిమితి బట్టి ప్రీమియాన్ని నిర్ణయించే అధికారం బీమా సంస్థలకే కల్పించింది నియంత్రణ సంస్థ. అయితే, ఈ రెండు పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలని ఆదేశించింది. ప్రాంతాలు లేదా జోన్ల వారీగా ప్రీమియం మార్చే అధికారం కంపెనీలకు లేదు. కస్టమర్లు ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్‌మెంట్‌ ఆప్షన్లు ఉండవు.


వెయిటింగ్‌ పీరియడ్‌ 

రెండు పాలసీలకు వెయిటింగ్‌ పీరియడ్‌ 15 రోజులు. అంటే, పాలసీ కొనుగోలు చేసిన పక్షం రోజుల వరకు బీమా కవరేజీ క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలుండదు.


కరోనా కవచ్‌ పాలసీ

  1.  ఈ పాలసీ కనీస బీమా కవరేజీ రూ.50,000. గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. ఇందులో కోవిడ్‌ చికిత్సతో పాటు వైరస్‌ సంక్రమణ కారణంగా ఇప్పటికే ఉన్న వ్యాధి తీవ్రమైతే అయ్యే వైద్య ఖర్చుకూ బీమా కవరేజీ లభిస్తుంది. 
  2. ఒక్కరికి లేదా కుటుంబ సభ్యులకూ కలిపి తీసుకోవచ్చు. 
  3. కంపెనీలు ఆప్షనల్‌ కవరేజీని కూడా ఆఫర్‌ చేయవచ్చు. ఇందుకు ప్రీమియాన్ని విడిగా ప్రకటించాలి. 
  4. ప్రభుత్వం అనుమతి కలిగిన ల్యాబ్‌లో కొవిడ్‌-19 పరీక్ష చేసుకొని పాజిటివ్‌ వస్తే ఈ పాలసీ కింద కవరేజీ లభిస్తుంది. ఇందులో హాస్పిటల్‌ రూమ్‌, బోర్డింగ్‌, నర్సింగ్‌తో పాటు సర్జన్లు, అనెస్థీషియా, కన్సల్టింగ్‌ డాక్టర్‌, ప్రత్యేక ఫీజులు, టెలిమెడిసిన్‌ కన్సల్టేషన్‌ చార్జీలతో సహా హాస్పిటళ్లు వసూలు చేసే అన్ని రకాల రుసుములకూ కవరేజీ లభిస్తుంది. అంటే, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌, ఆపరేషన్‌ థియేటర్‌, సర్జికల్‌ ఉపకరణాలు, ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ), ఇంటెన్సివ్‌ కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌(ఐసీసీయూ), ఆంబులెన్స్‌ ఖర్చులకు సైతం బీమా సదుపాయం లభిస్తుంది. 
  5. బీమా కంపెనీ ఆఫర్‌ చేస్తున్న నెట్‌వర్క్‌ హాస్పిటళ్లలో ఎక్కడైనా క్యాష్‌లెస్‌ వైద్య సదుపాయాన్ని పొందవచ్చు. బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో లేని ఆసుపత్రిలో చికిత్స పొందిన పక్షంలో రీయింబర్స్‌మెంట్‌ సదుపాయమూ అందుబాటులో ఉంటుంది. 
  6. ఆసుపత్రిలో చేరడానికి 15 రోజుల ముందు వరకైన వైద్య ఖర్చులు, హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత 30 రోజుల వరకయ్యే ఖర్చులకూ బీమా కంపెనీలు కవరేజీ కల్పించాల్సి ఉంటుంది.


కరోనా రక్షక్‌ పాలసీ 

  1. ఈ పాలసీ ద్వారా కనీసం రూ.50,000 నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. 
  2. ఇది కేవలం వ్యక్తిగత పాలసీ. అంటే, పాలసీదారుకు మాత్రమే కవరేజీ లభిస్తుంది. 
  3. పాలసీదారుకు కరోనా సోకి కనీసం 72 గంటలపాటు హాస్పిటల్‌లో చేరితే బీమా కంపెనీ సమ్‌ ఇన్స్యూర్డ్‌ సొమ్మును 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 
  4. ఇది సింగిల్‌ ప్రీమియం పాలసీ. ఒక్కసారి క్లెయిమ్‌ చేసుకున్న తర్వాత లేదా కాలపరిమితి తీరాక పాలసీ కాంట్రాక్టు ముగిసిపోతుంది. రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉండదు. 
  5. వ్యక్తికి ఒక పాలసీ మాత్రమే. అంటే, ఏదేని వ్యక్తి తన పేరు మీద రెండు రక్షక్‌ పాలసీలు తీసుకునేందుకు వీలుండదు.  


రోజువారీ చిల్లర ఖర్చులకూ.. 

కరోనా కవచ్‌ (ఇండెమ్నిటీ) పాలసీలో ఆప్షనల్‌గా ‘హాస్పిటల్‌ డైలీ క్యాష్‌’ కవరేజీ సైతం పొందవచ్చు. ఈ ఆప్షన్‌ ఎంచుకున్న పాలసీదారు కొవిడ్‌ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సమయంలో రోజువారీ చిల్లర ఖర్చులకూ బీమా కవరేజీ లభిస్తుంది. గరిష్ఠంగా 15 రోజుల పాటు రోజుకు సమ్‌ ఇన్స్యూర్డ్‌లో 0.5 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది.



హోమ్‌కేర్‌, ఆయుష్‌ ట్రీట్‌మెంట్‌కూ కవరేజీ!

  1. ఇండెమ్నిటీ పాలసీదారులకు హోమ్‌ కేర్‌, ఆయుష్‌ ట్రీట్‌మెంట్‌కు సైతం బీమా కవరేజీ లభిస్తుంది. 
  2. ఇంటి దగ్గర వైద్యం చేయించుకుంటే, గరిష్ఠంగా 14 రోజులకు కవరేజీ వర్తిస్తుంది. అయితే, క్లెయిమ్‌ సందర్భంగా చికిత్స చేసిన వైద్యుడి సంతకంతో కూడిన రికార్డులు, రోజువారీ మానిటరింగ్‌ చార్ట్‌లను సమర్పించాల్సి ఉంటుంది. హోమ్‌కేర్‌ బెనిఫిట్‌ కింద ఇంటి వద్ద లేదా డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో చేయించుకున్న వైద్య పరీక్షలు, డాక్టర్‌ రాసిన ఔషధాల ఖర్చులు, నర్సింగ్‌ చార్జీలు, ఆక్సిజన్‌, నెబులైజర్‌ సేవల ఖర్చులకు సైతం కవరేజీ లభించనుంది. 
  3. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, సిద్ధ, నేచురోపతితో పాటు యోగా కూడా ఆయుష్‌ ట్రీట్‌మెంట్‌ పరిధిలోకి వస్తాయి. కరోనాకు ఈ చికిత్సలు తీసుకున్నా బీమా సదుపాయం వర్తిస్తుంది. 

Updated Date - 2020-06-28T06:13:22+05:30 IST