‘రూరల్‌’ కోర్సులు అందించే IRMA

ABN , First Publish Date - 2021-11-23T18:55:00+05:30 IST

ఆర్థిక ప్రయోజనాలు సముచిత రీతిలో..

‘రూరల్‌’ కోర్సులు అందించే IRMA

ఆర్థిక ప్రయోజనాలు సముచిత రీతిలో అందని వర్గాలకు వృత్తిపరమైన సేవలతో తోడ్పాటు అందించాలనే సదాశయంతో ఏర్పాటైన సంస్థ(ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌). గుజరాత్‌లోని ఆనంద్‌లో 1979లో ఏర్పాటైన ఈ సంస్థ ఆది నుంచి నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత నైపుణ్యాలు ఉన్న మానవ వనరులను అందిస్తోంది. 


సుస్థిర ప్రగతి, సమానత్వం, పర్యావరణహితం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సదరువర్గాల ఉన్నతికి అట్టడుగు స్థాయిలో వృత్తిపరమైన సేవలను అందించే మేనేజీరియల్‌ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కృషి ఐఆర్‌ఎంఎలో నిత్యం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఈ విషయంలో తగు పాలసీలను రూపొందించేలా ప్రభావం చూపే యత్నం కూడా చేస్తోంది. 


క్షీర విప్లవానికి ఆద్యుడిగా పేర్కొనే డాక్టర్‌ వర్ఘీస్‌ కురియన్‌ ఈ సంస్థను స్థాపించారు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ సర్కార్‌, స్విస్‌ ఏజెన్సీ ఫర్‌ డెవల్‌పమెంట్‌ కోఆపరేషన్‌, ఇండియన్‌ డైరీ కార్పొరేషన్‌(ఇంతకుమునుపు ఉండేది) నేషనల్‌ డైరీ బోర్డ్‌ సహకారంతో ఆయన ఐఆర్‌ఎంను ఆరంభించారు. 


ఐఆర్‌ఎంఎ ప్రాథమికంగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తోంది. మేనేజ్‌మెంట్‌ సమస్యలను అర్థం చేసుకోవడం, ఇంటెన్సివ్‌ ఫీల్డ్‌వర్క్‌ ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలు సముచిత రీతిలో అందని వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అవగాహన పర్చుకోవడం వంటి అంశాలు ఈ కోర్సుల్లో ప్రధానంగా ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో పని చేసిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ రేపటి భవిష్య నిర్ణేతలకు శిక్షణ ఇస్తుంటారు. 60 ఎకరాల పచ్చని క్యాంప్‌స్‌లో సంస్థ భవనాలున్నాయి.


నిర్వహణ

ఐఆర్‌ఎంఎ జనరల్‌ బాడీలో సహకార, అభివృద్ధి సంస్థలకు సభ్యత్వం ఉంది. జనరల్‌ బాడీ ఏటా ఒకసారి సమావేశమవుతుంది. సంస్థ నిర్వహణ కోసం వీరంతా కలిసి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ను ఎన్నుకుంటారు. ఆ గవర్నింగ్‌ బాడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై సంస్థకు దిశానిర్దేశం చేస్తుంది. రోజువారి పాలన వ్యవహారాలను పర్యవేక్షించే డైరెక్టర్‌, బోర్డు మెంబర్‌ - సెక్రటరీగా ఇందులో ఉంటారు. 


కోర్సులు

ఈ సంస్థ రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, ఫెలో ప్రోగ్రామ్‌(పీహెచ్‌డీ), ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌కు తోడు పలు మేనేజ్‌మెంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తోంది. వీటిలో కీలకమైన పీజీ డిప్లొమాను ప్రత్యేక పద్ధతిలో తీర్చిదిద్దారు. అనుభవంతో కూడిన లెర్నింగ్‌కు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. క్లాస్‌రూమ్‌, విలేజ్‌ ఫీల్డ్‌వర్క్‌, సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. గ్రామీణ సమాజం, అక్కడి ఎకానమీ, పాలిటీపై లోతైన అవగాహన కల్పిస్తారు. ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి ఇటీవల ఈ కోర్సును పూర్తి చేసిన 215 మందిని తీసుకుంటే అందరికీ  జాబ్స్‌ లభించాయి. 27 మంది తాము చేసిన లైవ్‌ ప్రాజెక్టుల ఆధారంగానే ఉద్యోగాలు పొందారు.  గరిష్ఠంగా రూ.19 లక్షలు, కనిష్ఠంగా రూ.5.40 లక్షలు వేతనంతో ఆఫర్లు లభించాయి. 


నోటిఫికేషన్‌ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ప్రధాన స్పెషలైజేషన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) దీనిని మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌కు సమాన కోర్సుగా గుర్తించింది.


అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2022 సెప్టెంబరు నాటికి సంబంధిత సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022 స్కోర్‌ తప్పనిసరి. 


ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ను పేపర్‌ - పెన్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం అర్థ గంట. తరవాత ఇంటర్వ్యూలో ఇచ్చిన అంశం మీద 200/ 300 పదాలతో  వ్యాసం రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, గ్రామీణ అంశాలపై పరిజ్ఞానం తదితరాలను అంచనా వేస్తారు. జాతీయ పరీక్ష స్కోర్‌కు 35, ఇంటర్వ్యూకి 35, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌కు 5, అకడమిక్‌ ప్రతిభకు 5, జెండర్‌ డైవర్సిటీకి 3.5, రీజినల్‌ డైవర్సిటీకి 5, స్పోర్ట్స్‌ డైవర్సిటీకి 1.5, అకడమిక్‌ డైవర్సిటీకి 2, అకడమిక్‌ పెడిగ్రీకి 3, అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 15

ఆన్‌లైన్‌ / క్యాంపస్‌ ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు

వెబ్‌సైట్‌: irma.ac.in

Updated Date - 2021-11-23T18:55:00+05:30 IST