ఎగురుతుంటే.. ఏలియన్ అనుకున్నారు.. అసలు విషయం తెలిసి..!

ABN , First Publish Date - 2020-10-18T18:03:38+05:30 IST

ప్రతి రోజూలానే శనివారం కూడా జనాలు ఉదయాన్నే ఇళ్లనుంచి బయటకు వచ్చి తమ పనుల్లో నిమఘ్నమయ్యారు. కానీ కొద్ది సేపటికి వారంతా ఆకాశం వైపు చూసి షాక్‌కు గురయ్యారు. ఆకాశంలో ఏదో...

ఎగురుతుంటే.. ఏలియన్ అనుకున్నారు.. అసలు విషయం తెలిసి..!

ప్రతి రోజూలానే శనివారం కూడా జనాలు ఉదయాన్నే ఇళ్లనుంచి బయటకు వచ్చి తమ పనుల్లో నిమఘ్నమయ్యారు. కానీ కొద్ది సేపటికి వారంతా ఆకాశం వైపు చూసి షాక్‌కు గురయ్యారు. ఆకాశంలో ఏదో ఎగురుతోంది. నెమ్మదిగా వారి ఇళ్లపై నుంచి ఎగురుతూ దూరంగా కిందకు దిగింది. ఇక అంతే అక్కడి వారంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. అదేదో ఏలియన్ అని, తమ ఇళ్ల వద్దే దిగడంతో ఈ రోజుతో భూమిపై తమకు నూకలు చెల్లిపోయాయని గుండెలు బాదుకున్నారు. కొందరు ధైర్యం తెచ్చుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.


ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా.. దాన్‌కౌర్ ప్రాంతం.. గాలిలో ఓ వింత ఆకారం ఎగురుతోంది. అది అచ్చం మనిషి ఆకారంలో ఉంది. ఎర్రని దుస్తులు ధరించి నెమ్మదిగా స్థానిక ఇళ్లపై తచ్చాడసాగింది. కొంతసేపటికి పక్కనే ఉన్న కాలువలో దిగి ముందుకు కదల సాగింది. దీంతో స్థానికంగా కల్లోలం మొదలైంది. అది ఏలియన్ అని, తమ ఇళ్ల మధ్యే నేలపై దిగటంతో ఇక తమను చంపేస్తుందని భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఖాకీలు కూడా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొద్ది సేపు కాలువలో ఉన్న ఆకారాన్ని గమనించి.. ఆ తరువాత దానిని బయటకు తీసేందుకు కాలువలోకి దిగారు. ఏలియన్‌కు దగ్గరగా పోలీసులు వెళుతుండడంతో స్థానికులు మరింత బెంబేలెత్తిపోయారు. కొద్ది సేపటికి పోలీసులు ఆ ఆకారాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. అయితే అదేదో ఏలియన్ కాదు. ఐరన్ మ్యాన్ ఆకారంలో ఉన్న ఓ గ్యాస్ బెలూన్.


ఏలియన్ అనుకున్నది కాస్తా.. ఓ గాలి బెలూన్ అని తేలడంతో అక్కడి వారంతా ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బెలూన్‌ను చూసి ఇంతసేపు భయపడినందుకు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. బెలూన్‌ను బయటకు తీయించిన దాన్‌కౌర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ పాండే ఈ విషయంపై వివరణ ఇచ్చారు. గ్యాస్ బెలూన్ ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చిందని, అయితే గాలి తగ్గుతుండడంతో నెమ్మదిగా నేలపైకి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-10-18T18:03:38+05:30 IST