‘ప్రైవేటు’ దోపిడీ!

ABN , First Publish Date - 2021-04-19T04:50:38+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి వేళ.. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో అక్రమాల దందా సాగుతోంది. కరోనా వ్యాధి నిర్థారణ పేరుతో ల్యాబ్‌ల నిర్వాహకులు అడ్డగోలుగా బాధితులను దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 74 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. కేవలం శ్రీకాకుళం నగరంలోనే 28 పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో అనుమతి పొందిన ల్యాబ్‌లు 18 ఉన్నాయి. కరోనా వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది

‘ప్రైవేటు’ దోపిడీ!
శ్రీకాకుళంలో ల్యాబొరేటరీ

కరోనా పరీక్షల ముసుగులో ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో అక్రమాలు

బాధితుల నుంచి భారీగా వసూళ్లు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ వ్యాప్తి వేళ.. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో అక్రమాల దందా సాగుతోంది. కరోనా వ్యాధి నిర్థారణ పేరుతో ల్యాబ్‌ల నిర్వాహకులు అడ్డగోలుగా బాధితులను దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 74 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. కేవలం శ్రీకాకుళం నగరంలోనే 28 పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో అనుమతి పొందిన ల్యాబ్‌లు 18 ఉన్నాయి. కరోనా వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా లక్షణాలు ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత సేవలు పొందాలని అధికారులు పదేపదే చెబుతున్నా, కొందరు ప్రైవేటు వైద్యం వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ నిర్వాహకులు ఆరోగ్య పరీక్షలు, వైద్యం పేరిట అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆదివారం ఉద్దానం ప్రాంతం నుంచి ఒక బాధితుడు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపతిల్రో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ఆస్పత్రి నిర్వాహకులు అతడి నుంచి వ్యాధి నిర్థారణ కోసం రూ.2 వేలు వసూలు చేశారు. వ్యాధి నిర్థారణ జరగకుండానే మరో రూ.1000 మందులు కొనుగోలు చేయాలని సూచించారు. దీనిని బట్టీ దోపిడీ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


 అనుమతి లేకుండానే చికిత్స 

శ్రీకాకుళంలో అనుమతులు లేకుండా కరోనా బాధితులను ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకొని రూ.లక్షలు గుంజుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు ఇటీవల అపరాధ రుసం విధించారు. అయినా.. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో వసూళ్ల పర్వం ఆగడం లేదు. కరోనా పరీక్షకు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నారు. కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదు. జీవో నెంబరు 768 ప్రకారం ఐసీఎంఆర్‌ అనుమతించిన ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో కొవిడ్‌-19 నిర్థారణ పరీక్షలు చేయాలి. దీనికి కేవలం రూ.499 మాత్రమే తీసుకొని రశీదు ఇవ్వాలి. ఇందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అనుమతించాయి. కానీ వాస్తవ పరిస్థితి వేరేగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు జిల్లా నలుమూలల నుంచి శ్రీకాకుళం వచ్చి ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్‌లుగా చేరుతున్నారు. అటువంటి వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష అనంతరం వ్యాధి నిర్థారణ జరిగితే ప్రత్యేక వార్డుల్లో ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. వాస్తవానికి కొవిడ్‌ లక్షణాలు ఉంటే, వారిని ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. తాజాగా ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రులను కొవిడ్‌ సేవల కోసం ఎంపిక చేసింది. ఒక్కో ఆస్పత్రిలో 30 మంది ఇన్‌పేషెంట్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ, అనుమతి లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు, లేబొరేటరీల నిర్వాహకులు కరోనా పరీక్షలు చేసేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ప్రత్యేక గది, బెడ్‌, ఆక్సిజన్‌ సమకూర్చేందుకు రోజుకు రూ.25 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తిని కనీసం నాలుగు నుంచి పది రోజులు వరకు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స పేరుతో సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు ఖర్చు చేయిస్తుండడం గమనార్హం. ఈ విషయాన్ని కొందరు  కలెక్టర్‌ జె.నివాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఇటీవల జేసీ ఆధ్వర్యంలో కొన్ని ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగుల నుంచి కరోనా పరీక్షల పేరుతో అధికంగా వసూలు చేసినా, అనుమతి లేకుండా ఇన్‌పేషెంట్‌లను చేర్చుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా  పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2021-04-19T04:50:38+05:30 IST