అభివృద్ధిని విస్మరించి.. లేఅవుట్లకు ప్రజాధనం

ABN , First Publish Date - 2022-01-29T04:03:10+05:30 IST

బుచ్చి నగర పంచాయతీలోని పలు వార్డుల్లో నేటికీ కనీసం గ్రావెల్‌ రోడ్లు కూడా లేక ప్రజలు పలు ఇక్కట్లకు గురవుతున్నారు.

అభివృద్ధిని విస్మరించి.. లేఅవుట్లకు ప్రజాధనం
సీసీ రోడ్డు వేసేందుకు సిద్ధమవుతున్న నివాసాలు లేని చుట్టుకాలువ కరకట్ట

ఇరిగేషన్‌ కాలువలపై సీసీ రోడ్లకు శ్రీకారం

రూ.60లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధుల కేటాయింపు

నగర పంచాయతీలో రోడ్లు లేక ప్రజల ఇక్కట్లు

 

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 28: బుచ్చి నగర పంచాయతీలోని పలు వార్డుల్లో నేటికీ కనీసం గ్రావెల్‌ రోడ్లు కూడా లేక ప్రజలు పలు ఇక్కట్లకు గురవుతున్నారు. కాగా లేఅవుట్ల కోసం ఇరిగేషన్‌ కాలువ కరకట్టలపైన సీసీరోడ్లు వేసేందుకు అఽధికారులు, నాయకులు సిద్ధమవుతుండడంపై స్థానికులు విస్తుపోతున్నారు. ఈ రోడ్డు కోసం రూ.60లక్షలు ఎస్‌డీఎఫ్‌ నిధులు కూడా కేటాయించడం విశేషం. బుచ్చి నగర పంచాయతీగా రూపుదిద్దుకుని రెండేళ్లు పూర్తి కావస్తోంది. పట్టణంలోని 400 కుటుంబాలు నివాసం ఉండే బాలకృష్ణ గిరిజనకాలనీ, కామాక్షికాలనీ, రామచంద్రాపురం గిరిజనకాలనీ, కట్టుబడిపాళెం తదితర ప్రాంతాల్లో ప్రజలు నగర పంచాయతీకి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడ అభివృద్ధిని విస్మరించి లేఅవుట్ల కోసం ప్రజాధనం పక్కదారి పట్టిస్తూ ఇళ్లులేని ప్రాంతాల్లో ఇరిగేషన్‌ కాలువలపై రోడ్లు వేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూనుకుంటున్నారు. లేఅవుట్ల కోసం ఎక్కడో రేబాల పొలాలకు సాగునీరందించే చుట్టుకాలువ కట్టలపైన సీసీ రోడ్డు ఏర్పాటును పలువురు అధికారపార్టీ నాయకులే తప్పుబడుతున్నారు. కాగా గుడపల్లి కాలువకట్టపైన ఎన్నో ఏళ్లగా 50కుటుంబాలకు పైగా నిరుపేదలు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలోని కాలువ కట్టపైన సీసీ రోడ్లు  నిషేఽఽధమని నాయకులు, అధికారులు పేర్కొన్నారు. అయితే లేఅవుట్లకు తప్ప ఎవరికీ ఉపయోగం లేని రేబాల (చుట్టు)కాలువ కట్టపైన సీసీ రోడ్డు వేయడమేమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నిధుల దుర్వినియోగం

ఇరిగేషన్‌ కాలువలపైన సీసీ రోడ్లకు అనుమతి ఉండదు. కాలువలపైన అవసరమైన చోట కల్వర్టులు, ర్యాంపులు, చెక్కలతో శాశ్వత కట్టడాలు చేపట్టడం జరుగుతోంది. కాగా లేఅవుట్ల అభివృద్ధికి నిధుల దుర్వినియోగం తప్ప..  కరకట్టలపైన సీసీ రోడ్లు ఎలా వేస్తారని పలువురు రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.     

 

గిరిజనులమని చిన్నచూపు 

బాలకృష్ణ గిరిజనకాలనీలో తామంతా గిరిజనులమని అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. ఏళ్లతరబడి మురుగులో ఉంటూ మేజర్‌ పంచాయతీ నుంచి నేటి మున్సిపాలిటీ వరకు అన్ని రకాల పన్నులు చెల్లించే మా కాలనీ వాసులను ఎండగట్టుతున్నారు. నేతలు లేఅవుట్ల కోసం నివాసాలు లేని  కాలువ కట్టలమీద సీసీ రోడ్లుకు నిధులు మళ్లించడం దుర్మార్గమన్నారు.

- పొంగులూరు కిషోర్‌కుమార్‌



Updated Date - 2022-01-29T04:03:10+05:30 IST