నారు సిద్ధం.. నీరు ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2021-07-31T04:58:32+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే అన్నదాతకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొర వర్షాల కారణంగా సాగుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ సగటులో 50శాతం వర్షపాతం కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఇక శివారు ప్రాంత రైతుల పరిస్థితి మరింత దయనీయం. ఉభాలు వేసేందుకు సమయం ఆసన్నమైనా... సాగునీటి కొరతతో నాట్లు వేయలేకపోతున్నామని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు.

నారు సిద్ధం.. నీరు ప్రశ్నార్థకం

- సగటు కంటే 50 శాతం మించని వర్షపాతం

- ప్రాజెక్టుల పరిధిలో భూములకూ అందని సాగునీరు

- శివారు ప్రాంత రైతులకు తప్పని కష్టాలు

(పాలకొండ/మెళియాపుట్టి)

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే అన్నదాతకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.  అరకొర వర్షాల కారణంగా సాగుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ సగటులో 50శాతం వర్షపాతం కూడా లేకపోవడంతో  రైతులు ఆందోళన  చెందుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఇక శివారు ప్రాంత రైతుల పరిస్థితి మరింత దయనీయం. ఉభాలు వేసేందుకు సమయం ఆసన్నమైనా... సాగునీటి కొరతతో నాట్లు వేయలేకపోతున్నామని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు.  

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే 75 వేల నుంచి లక్ష ఎకరాల వరకూ ఎద రూపంలో  సాగు చేశారు. మిగిలిన నాలుగు లక్షల ఎకరాల్లో నాట్లు వేసేందుకు నారు మడులను సిద్ధం చేశారు. వాస్తవంగా జూన్‌, జూలై నెలల్లో ఖరీఫ్‌ పనులు ప్రారంభమైతే పంటల దిగుబడి పెరుగుతుందని రైతుల నమ్మకం. ఈ సమయంలో వరినాట్లు వేస్తే వరి పైరుకు దోమపోటు అంతగా ఉండని భావిస్తారు. ఏటా జూన్‌, జూలై నెలల్లో రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురిసేవి. వీటికి తోడుగా ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందేది. దీంతో జిల్లా అంతటా ఆగస్టు మొదటి వారానికి ఉభాలు 90 శాతానికి పైగా పూర్తయ్యేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం నారుమడులు, ఎద పంటకు అవసరమైన వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి తప్ప.. జిల్లాలో ఇప్పటివరకు కుంభవృష్టి పడిన దాఖలాలు లేవు. దీంతో చాలా ప్రాంతాల్లో దమ్ములు జరగలేదు. కొంతమంది కాలువలు, చెరువుల కిందమాత్రమే వరినాట్లు వేశారు. అధికంగా మెట్ట ప్రాంత రైతులు నీరు లేక వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. తోటపల్లి, మడ్డువలస, వంశధార, నారాయణపురం ప్రాజెక్టుల పరిధిలో ఉన్న ఒకటి రెండు మండలాలకు మాత్రమే ఇప్పటి వరకు సాగునీరు అందింది. శివారు ప్రాంతంలో ఉన్న మండలాలకు చుక్కనీరు కూడా చేరలేదు. కొండవాగులు, గెడ్డలు, కోనేరులు, ఇతర సాగునీటి వనరుల్లో నీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు నారుమడులను బతికించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నాట్లు వేసేందుకు సాహసం చేయలేకపోతున్నారు. 


చొరవ చూపాల్సిందే.. 

తోటపల్లి, మడ్డువలస, వంశధార, నారాయణపురం ప్రాజెక్టులతో పాటు నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్ర తనయ తదితర నదులపై వివిధ రకాల ఆనకట్టలను నిర్మించారు. వీటిద్వారా సాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తే వ్యవసాయం సస్యశ్యామలవుతుంది. కానీ  కొన్నేళ్లుగా ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందించకపోవడంతో జిల్లా రైతులు ఏటా ఖరీఫ్‌ కాలంలో సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎగువ ప్రాంతంలో రైతులు ఉభాలు పూర్తి చేసిన తర్వాత, దిగువ ప్రాంతాలకు సాగునీరు మళ్లించేందుకు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది. అన్ని ప్రాజెక్టుల పరిధిలో కాలం చెల్లిన కాలువల ద్వారా సాగునీరు పూర్తిస్థాయిలో విడుదల కావడం లేదు. దీంతో శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదు. అన్ని ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలంటే వారాబందీ ప్రకారం సాగునీరు విడుదల చేసి పూర్తిస్థాయిలో నాట్లు వేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. దీనిపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.   


 సమయం ఉంది

వరి నాట్లు ఆగస్టులో సైతం వేసిన రోజులు ఉన్నాయి. ఆలస్యమైనా పంట దిగుబడులు తగ్గడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికంగా ఇంజిన్లు వినియోగించి పెట్టుబడులు పెంచుకోవద్దు. సాగునీరు వచ్చిన దగ్గర దమ్ములు చేసుకోవచ్చు. అధికంగా మెట్టు ప్రాంతాల్లో ఎదలు వేస్తే  రైతులకు లబ్ధి చేకూరుతుంది. 

- దానకర్ణుడు, వ్యవసాయ శాఖాధికారి, మెళియాపుట్టి

Updated Date - 2021-07-31T04:58:32+05:30 IST