చినుకూ లేదు.. మొలకా లేదు..!

ABN , First Publish Date - 2020-08-04T10:16:56+05:30 IST

వరుణుడు కరుణ చూపడంలేదు. రెండు నెలలుగా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు

చినుకూ లేదు.. మొలకా లేదు..!

రెండునెలులగా ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు

ఎండుతున్న నారుమడులు

ఖరీఫ్‌ సాగుపై రైతుల దిగులు

కేవలం నాలుగు మండలాల్లోనే అధిక వర్షపాతం 


(గుజరాతీపేట/హరిపురం/ఇచ్ఛాపురం రూరల్‌/ సోంపేట రూరల్‌/ పలాస రూరల్‌ /వజ్రపుకొత్తూరు/ నరసన్నపేట): వరుణుడు కరుణ చూపడంలేదు. రెండు నెలలుగా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్న నీటి నిల్వలు ఆవిరవుతున్నాయి. కాలువల్లో నీరు లేక శివారు ఆయకట్టు ప్రాంతాలు బీడు వారుతున్నాయి. తొలకరి వర్షాలతో అంతమాత్రంగా ఉన్న నారుమడులు ఎండిపోతున్నాయి. నారుమడులు తడిలేక.. పొలాల్లో చల్లిన విత్తు పూర్తిస్థాయిలో మొలక లేక..  అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 


జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ పక్క వర్షాలు లేక.. మరోపక్క ప్రాజెక్టుల నుంచి కూడా నీరందక నారుమడులు ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైన జూన్‌ నుంచి జూలై వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గడచిన రెండు నెలల్లో వర్షపాతాన్ని పరిశీలిస్తే.. సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లో మాత్రమే సాధారణం కంటే సుమారు ఇరవై శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లో అంతంతమాత్రంగానే  కురిసింది. సంతకవిటి, పాతపట్నం, రేగిడి, వంగర, కొత్తూరు, మెళియాపుట్టి, హిరమండలం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, సరుబుజ్జిలి, మందస, జలుమూరు, పలాస, కంచిలి మండలాల్లో సాధారణ  వర్షపాతం నమోదైంది.  రాజాం, సారవకోట, బూర్జ, నరసన్నపేట, లావేరు, ఆమదాలవలస, గార, జి.సిగడాం, పోలాకి, సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురం, నందిగాం, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరులలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది.


ఈ మొత్తం 15 మండలాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం కురిసింది. సంతబొమ్మాళి, కవిటి, పొందూరు మండలాల్లో పరిస్థితి మరీ దారుణం. సాధారణం కంటే  60 నుంచి 99 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు గణంకాలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయాధికారులు, రైతులు తలలు  పట్టుకుంటున్నారు. ఖరీఫ్‌ సాగు ఏ విధంగా కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 


ఆశలు గల్లంతు

జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు అన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా 2.12 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేస్తున్నారు.  వంశధార, నాగావళి, మడ్డువలస, తోటపల్లి, మహేంద్రతనయ వంటి జలాశయాల ద్వారా సుమారు 1.87 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తున్నారు. మిగిలినదంతా వర్షాధారమే.  ఈ ఏడాది వర్షాలు పెద్దగా కురవకపోవడంతో శివారు భూములకు  సాగునీరందడం లేదు. కళింగదళ్‌, దామోదర సాగర్‌, డబార్సింగి వంటి రిజర్వాయర్‌లు, మహేంద్ర తనయ నదిలో నీరు లేక.. కాలువల్లో నీరు పారక రైతులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


వంశధార.. పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు వంటి శివారు మండలాలలకు కనీసం తొంగి చూడని పరిస్థితి.  జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లలో వరి ఎద  పద్ధతిలో సాగు చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి ఎదలు కూడా ఎండిపోతున్నాయి. మెట్ట పంటల్లోనూ కలుపు సమస్య తీవ్రంగా ఉంది. దీంతో చాలామంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌పై ఆశలు వదులుకుంటున్నారు. వేరుశనగ, జొన్న, పత్తి పంటలది కూడా ఇదే పరిస్థితి. ఆరుతడి పంటలైనప్పటికీ.. ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో ఆ పంటలు   ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


నాట్లు.. పాట్లు

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమైన రైతులు.. వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నారుమడులు ఎండిపోతుండడంతో వాటిని బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 164 మి.మీ. కాగా 167.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో రైతులు నారు మడులు  సిద్ధం చేశారు.  జూలైలో సాధారణ వర్షపాతం 200 మి.మీ. కాగా, 48.2 మి. మీ. వర్షం మాత్రమే కురవడంతో వరి నారు ఎండుతోంది. బూర్జపాడు, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, రత్తకన్న తదితర గ్రామాల్లో రైతులు కుండలతో నీటిని తెచ్చి నారు తడుపుతున్నారు. ఇంకొన్ని చోట్ల ట్యాంకర్లతో నీరు పెడుతున్నారు. సోంపేట మండలంలో బారువ, పలాసపురం, జింకిభధ్ర, మాకన్నపురం, బాతుపురం, బేసిరామచంద్రపురం తదితర గ్రామాల రైతులు కూడా నారును రక్షించుకోవడానికి పడరాని పాట్టు పడుతున్నారు.


బావుల్లో నీటిని మోటార్ల సాయంతో తోడి.. నారుమళ్లను తడుపుతున్నారు.  మరి కొంతమంది నేలబావులు, కాలువల నుంచి కుండలతో నీరు తెచ్చి నారుకు జీవం పోస్తున్నారు. అలాగే పలాస మండలంలో రెంటికోట, లక్ష్మిపురం, గోపాలపురం, కైజోల, సున్నాడ, బొడ్డపాడు, తర్లాకోట, లొద్ధబద్ర, అల్లుకోల ప్రాంతాల్లో వరినారు మడులను రక్షించుకునేందుకు కొందరు బోరుబావుల నుంచి నీటి  తెచ్చి  తడుపుతున్నారు. మందస పరిసర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.  నరసన్నపేట (వంశధార డివిజన్‌) పరిధిలో ఈఏడాది సుమారు 12వేల ఎకరాల్లో నారు, ఎదలు పోశారు. కొన్ని ప్రాంతాల్లో నారు మొలకెత్తకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జమ్ము, రావాడపేట, తామరాపల్లి, దేవాది, మడపాం, గోపాలపెంట, మాకివలస, కోమర్తి తదితర గ్రామాల్లో  ఆకుమడులు మాడిపోతున్నాయి. నీరు కడదామన్నా కాలువల్లో  రావడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోతే ఖరీఫ్‌ సాగు కష్టమేనని వాపోతున్నారు. 


చర్యలు చేపట్టాలి.... : షన్ముఖరావు, మందస  

ఏటా ప్రకృతి నష్టాలకు గురవుతున్న రైతన్నలకు ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అన్నదాతలకు ధీర్ఘకాలికంగా ఉపయోగపడేలా నదుల అనుసంధానం చేయాలి. రైతులకు పెట్టుబడులు అధికమై వ్యవసాయం చేయని పరిస్థితి నెలకొంది. దీనిని లాభసాటిగా మార్చాలి. 


కుదేలవుతున్న అన్నదాత.. : వి.వెంకటరమణ, జీఆర్‌పురం, మందస మండలం 

ప్రకృతి విలయతాండవంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. రెండేళ్లుగా వరుస  అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడుతున్నారు. విత్తు చల్లి ఉబాలకు సిద్ధమవుతున్న తరుణంలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. 

Updated Date - 2020-08-04T10:16:56+05:30 IST