నీరెంతైనా ఇస్తాం

ABN , First Publish Date - 2021-11-30T05:38:29+05:30 IST

తొలి పంట భారీ వర్షాలతో సర్వ నాశనమైంది. కౌలు రైతులు పంట నష్టాలతో కుంగిపోయారు. పెను విపత్తు లతో అంతా చెదిరిపోయారు. కాలువల్లో కర్ర నాచు నీటి ప్రవాహాన్ని ముందుకు పో కుండా ఏడిపిస్తోంది. అక్కడక్కడ ఉన్న లిఫ్ట్‌లను వదిలేశారు. వా టి నిర్వహణను ప్రభుత్వం మళ్లీ దగ్గరుండి చూడాలి.

నీరెంతైనా ఇస్తాం
సాగునీటి సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రంగనాథరాజు, చిత్రంలో కలెక్టర్‌ కార్తికేయమిశ్రా, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌ తదితరులు

సాగునీటి సలహా మండలి సమావేశం ఏకగ్రీవ తీర్మానం

ఏప్రిల్‌ రెండో వారంలో కాలువలు కట్టివేత

తిరిగి తెరిచేది జూన్‌ మొదటి వారంలోనే

కౌలు రైతులు భారీగా నష్టపోయారు : మంత్రి రంగరాజు

ప్రణాళిక ప్రకారం నీరు ఇవ్వండి : ఎమ్మెల్యేల డిమాండ్‌

ఆధునికీకరణ పనులు ఆగిపోయాయంటూ అసంతృప్తి


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

తొలి పంట భారీ వర్షాలతో సర్వ నాశనమైంది. కౌలు రైతులు పంట నష్టాలతో కుంగిపోయారు. పెను విపత్తు లతో అంతా చెదిరిపోయారు. కాలువల్లో కర్ర నాచు నీటి ప్రవాహాన్ని ముందుకు పో కుండా ఏడిపిస్తోంది. అక్కడక్కడ ఉన్న లిఫ్ట్‌లను వదిలేశారు. వా టి నిర్వహణను ప్రభుత్వం మళ్లీ దగ్గరుండి చూడాలి. కా లువలకు నీటి విడుదల ఆపేసే విషయంలో మరికొంత సమయం తీసుకోవాలి. ఈసారి ఆధునికీరణ పనుల విషయంలో ముందుచూపు ప్రదర్శించండి. సమయం వృథా కాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కనీసం చిన్నచిన్న పనులు అయ్యేలా రైతుల కలలను సాకారం చేయండి’ అంటూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. రెండో పంటకు పుష్కలంగా నీరందించాలన్న రైతులకోరికను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏప్రిల్‌ రెండో వారంలో కాలువలను మూసివేసి జూన్‌ మొదటి వారంలో తెరిచేందుకు సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. 


ఈసారి విస్తీర్ణం తగ్గుదల 

రబీకి గోదావరి నీటి లభ్యతపై సలహా మండలి సమా వేశంలో మెరుగైన చర్చ జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు గోదావరి నీటి ప్రవాహాలను పరిశీలించి తాగు నీరు, ఉద్యాన పంటలకు, పరిశ్రమలకు పోను నికరంగా ఎంత నీరు సరిపోతుందనే దానిపై తర్జనభర్జనలు సాగాయి. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి వరద నీటి ప్రవాహం గోదావరి నుంచి 35 టీఎంసీలు, సీలేరు నుంచి మరో 33 టీఎంసీలు మొత్తం మీద 68 టీఎంసీలు ఉంటాయని ఒక అంచనాకు వచ్చారు. సాగు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లడంతోపాటు కాలువలు, డ్రెయిన్లకు అడ్డుకట్టలు వేయడం, నీటి యాజమాన్య పద్ధతుల్లో మెరుగ్గా వ్యవహరించడం ఒకటే దిక్కని ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. 


 రైతులకు లోటు ఉండకూడదు 

 ‘తన నియోజకవర్గ పరిధిలోని పోణంగిపుంత వద్ద మోటారును బిగించి నీటిని తోడిపోయాలి. అవసర మైన చోట్ల కాలువలపై రెగ్యులేటర్లు ఏర్పాటు చేయా లి. రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలి’ అని దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయిరాజు విజ్ఞప్తి చేశారు. ‘కొప్పర్రు, పెనుమర్రు వంటి అనేక లిఫ్ట్‌లు ఆగిపో యాయి. శివారు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పంటలకు నీరందేలా చూడాలి. నక్కల డ్రెయిన్‌తో   పాటు అనేకచోట్ల షట్టర్లు లీకేజీలు, మరమ్మతులను నిర్వహించాలి. అసంపూర్తిగా నిలిచిన ఆధునికీకరణ పను లను పూర్తి చేయాలి’ అని నరసాపురం  ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమావేశాన్ని అభ్యర్థించారు.  ‘రెండో పంటకు సాగు నీరందిస్తామని ప్రకటించడం సంతోషకరం. శివారు ప్రాంతాలకు నీరందాలి. గణపవరం వద్ద వున్న యనమదుర్రు ఎగతంతోంది. ఈ కారణంగా కాలువలపై ఉన్న షట్టర్లు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. గ్రామాలకు గ్రామాలే ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కారణంగా షట్టర్లను బాగు చేయించాలి. ఎత్తిపోతలకు వీలైన మోటార్లను సిద్ధం చేయాలి’ అని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరారు. మోడరైజేషన్‌ పనులు ఇప్పటికే నిలిచిపోయాయి టెం డర్లకు సమయం సరిపోవడం లేదు. 60 రోజులపాటు కాల్వలను కట్టివేసే దానికంటే ముందస్తు ప్రణాళికతో ఈ పనులన్నీ సిద్ధం చేయాలి. ఎర్ర కాలువ పనులను పూర్తిచేయాలి. భారీ వర్షాలకు రైతులు ఇప్పటికే 80 శాతం మేర పంటను కోల్పోయార’ ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు.


రైతులను ఆదుకుంటాం   – మంత్రి రంగనాథరాజు

తొలి పంటలో అధిక వర్షాల కారణంగా రైతులు పడి న కష్టాలన్నీ ఇన్నీ కావు. ధాన్యం చేతికి రాక నష్టపో యారు. వరుస వర్షాలతో ఎటూ తేరుకోలేక పోయారు. ఈ విషయంలో ప్రభుత్వం అన్నీ గమనించింది. రెండో పంటకు అవసరమైన సాగునీటిని పుష్కలంగా అందిం చేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు భరోసా ఇచ్చారు. భూయజ మానులే కాకుండా 95 శాతం కౌలు రైతులు భారీ నష్టాన్ని చవిచూశారని ఆవే దన వ్యక్తం చేశారు. వీరికి సహకారం అందించాలని అభ్యర్థించారు. డ్రెయిన్లు, కాల్వలపై అడ్డుకట్ట వేయడం, నీటిని తోడిపోసేందుకు మోటార్లను అమర్చడం, ఆ మేరకు ప్రతీ ఎకరాకు సాగు నీరందించే బాధ్యత తీసు కోవాలని అధికారులను కోరారు. అత్తిలి, నరసాపురం చానల్స్‌తోపాటు బ్యాంక్‌ కెనాల్‌ కింద ఇప్పటికే రైతులు ఇబ్బం దులు పడుతున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. ‘కొవిడ్‌తో రెండేళ్లుగా కాలువల్లో మరమ్మతులు నిలిచి పోయాయి. ప్రవాహానికి అడ్డు తగిలేలా కర్ర నాచు పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 15వ తేదీ లోపు కర్రనాచు తొలగించాలి. ఇరిగేషన్‌ అధికారులంతా ఆయా ఎమ్మెల్యేలతో చర్చించాల’ని మంత్రి ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలో కాలువలను మూసివేసి జూన్‌ మొదటి వారంలో కాలువలు తెరిచేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.


రంగంలోకి దిగాలి : కలెక్టర్‌

‘అధికారులంతా రంగంలోకి దిగాలి. ఇరిగేషన్‌ అధికా రులకు తోడుగా ఉండాలి. జేసీ (రెవెన్యూ) వారాం తపు సమీక్షలు చేయాలి. లోటుపాట్లను గుర్తించాలి. సం బంధిత అధికారులు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి వారి నుంచి సమాచారం తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. ఇప్పటికే పెండింగ్‌లో వున్న పనులకు ఐదు నుంచి పది కోట్లు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే పని సులభమవుతుంది. ఎక్కడికక్కడ కాలువలకు, షట్లర్లకు రిపేర్లు నిర్వహించాలి. ఆధునికీకరణ పనులకు నెల సమయం సరిపోతుంది. జాగ్రత్తగా చేయాలి. ఇదంతా నిరంతరం సాగాలి’ అని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. 


 అక్విడెక్ట్‌ కొత్తది కట్టాలి

– ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు

‘ఇప్పుడున్న పరిస్థితి బట్టి రైతులను ఆదుకునేలా ఏప్రిల్‌ నెలాఖ రు వరకు నీరు ఇవ్వాలి. సిద్ధాపురం వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలి. ఆక్వా రంగాన్ని కూడా రైతులు నిర్వహించేదే. కాని కార్పొరేట్‌లం టూ నిందించడం తగదు. పోలవరం పూర్తి చేయాలి. ఓఅండ్‌ఎం బిల్లులు విడుదల చేయాలి. ఉండి అక్విడెక్ట్‌ కొత్తది కట్టాలి. పాందువ్వ, ఎండగండి, పోలమూరు ముంపుకు గురికాకుండా చూడాలి. కాలువల్లో పూడిక తీయాలి. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా తీసుకుని పనిచేయండి. రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు.  వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనది’.


 దాళ్వాలోనూ నీరివ్వాలి

– పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

‘పాలకొల్లు కాలువకు శివారు ప్రాంతం. ఇప్పటికే రెండు రకాల నష్టం జరిగింది. జనవరి నాటికల్లా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయాలి. ఆయిల్‌ ఇంజన్లను పెట్టి నీరు తోడాలి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉచితంగా డీజిల్‌ ఇచ్చింది. లిఫ్ట్‌ల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం. తిల్లపూడి, వద్దిపర్రు లిఫ్ట్‌ల నిర్వహణ అధ్వానం. కరెంటు బిల్లులు చెల్లించలేదు. లష్కర్లకు జీతాలు ఇవ్వాలి. దాళ్వాలోను వంతుల వారీగా నీరందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి’


Updated Date - 2021-11-30T05:38:29+05:30 IST