యాసంగి పంటలకు సాగునీటి విడుదల

ABN , First Publish Date - 2022-01-24T05:59:26+05:30 IST

మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో యాసంగి పంటలకు రెండో విడత సాగునీటిని ఆదివారం అధికారులు విడుదల చేశారు.

యాసంగి పంటలకు సాగునీటి విడుదల
మూసీ కుడి ప్రధాన కాల్వలో ప్రవహిస్తున్న నీరు

కేతేపల్లి, జనవరి 23: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో యాసంగి పంటలకు రెండో విడత సాగునీటిని ఆదివారం అధికారులు విడుదల చేశారు. యాసంగి సాగుకు గత ఏడాది డిసెంబరు 18 నుంచి విడతల వారీగా 110 రోజులపాటు సాగునీటిని అందించాలన్న నిర్ణయం మేరకు ఈ నెల 10వ తేదీ వరకు మొదటి విడత సాగునీటిని 25 రోజుల పాటు అందించారు. 10 రోజుల విరామం అనంతరం రెండో విడత సాగునీటిని ఆదివారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అధికారులు విడుదల చేశారు. దీంతో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను దిగువ మూసీకి విడుదల చేసేందుకు ఎత్తి ఉంచిన 3వ నెంబరు క్రస్టుగేటును అధికారులు మూసి వేశారు. 645 అడుగుల (4.46టీఎంసీలు) నీటి నిల్వ సామర్థ్యంగల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 644.45 అడుగులు (4.32టీఎంసీలు)గా ఉంది. కాగా ఎగువ నుంచి 445 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.


577.80 అడుగులుగా సాగర్‌ నీటి మట్టం

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 577.80 అడుగులు (276.4696 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 4831 క్యూసె క్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 8520 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1769 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా  1,176 క్యూసెక్కుల నీటిని, రివర్స్‌ పంపింగ్‌ ద్వారా 683 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 221 క్యూసెక్కుల నీరు పోతోంది. సాగర్‌ నుంచి మొత్తం 17,017 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇదిలా ఉంటే సాగర్‌లో ఆదివారం పర్యాటకుల రద్దీ నెలకొంది. పర్యాటకుల సందడితో హిల్‌కాలనీ డౌన్‌పార్కు వద్ద ఉన్న లాంచీ స్టేషన్‌ నుంచి జలాశయంలో నాలుగు జాలీ ట్రిప్పులను తిప్పినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-24T05:59:26+05:30 IST