‘ఐటీడీఏ’ పరిధిలో భౌతికదూరం

ABN , First Publish Date - 2020-05-23T10:12:27+05:30 IST

కరోనా ప్రభావం జనజీవనంపై తీవ్రంగా పండింది. భౌతికదూరం అనే అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా సమూహంగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా

‘ఐటీడీఏ’ పరిధిలో భౌతికదూరం

ఆశ్రమాలు, వసతిగృహాల్లో అమలుకు అధికారుల కసరత్తు

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ నుంచి అందించిన ఆదేశాలు

ఐటీడీఏ పీవో చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు 

నాలుగు రోజుల్లో కమిషనర్‌కు నివేదిక!


భద్రాచలం, మే 22 : కరోనా ప్రభావం జనజీవనంపై తీవ్రంగా పండింది. భౌతికదూరం అనే అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా సమూహంగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో భౌతికదూరాన్ని ఖచ్చితంగా పాటించి.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టియానా చాంగ్తో ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలు అందడంతో భద్రాచలం ఐటీడీఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే నూతన విద్యాసంవత్సరంలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో భౌతికదూరం పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌ చైర్మన్‌గా గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు జహీరుద్దీన్‌ కన్వీనరుగా ఏర్పడిన కమిటీ సభ్యులు  ఆశ్రమపాఠశాల్లో భౌతికదూరం ఏర్పాటు, విద్యార్ధుల ఆరోగ్య రక్షణ చర్యలపై మార్గదర్శకాలను  రూపొందించారు. 


కనీస దూరం మూడు అడుగులు..

విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొనే సమయంలో ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలని, నేలపై కూర్చున్నా.. బెంచీలపై కూర్చున్నా ఒక్కో గదిలో 15మంది కూర్చొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని 50ఆశ్రమ పాఠశాలలు, 14వసతి గృహాల్లో మొత్తం 15వేల మంది విద్యార్థులకు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టనున్నారు.  పాఠశాలలోని డార్మెట్రీలో ఉన్న విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ఈ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులుంటే సమీపంలో తక్కువ సంఖ్య ఉన్న ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయాలని యోచిస్తున్నారు. ఉదాహరణకు కె.రేగుబల్లి ఆశ్రమపాఠశాల్లో ఎక్కువ మంది విద్యుర్థులుంటే సమీపంలోని మంగవాయిబాడువ, గౌరారం, రామచంద్రునిపేట పాఠశాలలకు వారిని బదిలీ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన పాఠశాలల్లోనూ ఇదే పద్ధతిని అవలంబించబోతున్నారు. 


డైనింగ్‌ హాళ్లు, డార్మెట్రీల్లోనూ అమలు..

అల్పాహారం, భోజనం చేసే డైనింగ్‌ హాళ్లు, డార్మెట్రీలు, విద్యార్ధులు నిద్రించే బంకర్లలోనూ భౌతికదూరం ఏర్పాట్లు చేయబోతున్నారు. అల్పాహారం, భోజనానికి బ్యాచుల వారీగా పంపేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఆదేశాల గురించి ఇప్పటికే ఆశ్రమపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వివరించారు.


ఇదిలా ఉండగా నూతన విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే విద్యార్థులు.. తమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు ఏ హ్యాబిటేషన్‌ పరిధిలో ఉన్నారు? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర వాటిపై వివరాలను సేకరిస్తున్నారు. అలాగే పాఠశాలలకు వచ్చే సమయంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేసి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Updated Date - 2020-05-23T10:12:27+05:30 IST