తాలిబన్లతో సయోధ్యకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రయత్నాలు?

ABN , First Publish Date - 2021-08-12T23:20:09+05:30 IST

తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్

తాలిబన్లతో సయోధ్యకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రయత్నాలు?

న్యూఢిల్లీ : తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. కతార్ కేంద్రంగా ఈ సయోధ్య యత్నాలు సాగుతున్నాయని, అయితే తాలిబన్లు రాజకీయ పరిష్కారానికి ససేమిరా అంటున్నారని పేర్కొంది. 


ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొంటున్న ఓ ప్రతినిధిని ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్ఘన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య మధ్యవర్తిగా కతార్ వ్యవహరిస్తోంది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను కతార్‌కు సమర్పించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు తెరదించాలని, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చునని ప్రతిపాదించింది. 


ఇదిలావుండగా, తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో వేగంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. భద్రతా దళాలపై పోరును తీవ్రం చేశారు. ఇప్పటికే 10 ప్రొవిన్షియల్ రాజధానులను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దేశ రాజధాని నగరం కాబూల్ కూడా మరో మూడు నెలల్లోనే తాలిబన్ల వశం కావచ్చునని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-08-12T23:20:09+05:30 IST