Abn logo
Sep 19 2021 @ 23:28PM

ఆయుర్వేదం అందని ద్రాక్షేనా?

  - మూడేళ్లుగా వైద్యుడి పోస్టు ఖాళీ

  - పట్టించుకోని అధికారులు

  - అవస్థలు పడుతున్న రోగులు

బెజ్జూరు, సెప్టెంబరు 12: ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలో మూడేళ్లుగా వైద్యుడు లేకపోవడంతో ప్రజలకు వైద్యం అందకుండా పోయింది. సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంపై ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఆసక్తి ఉంది. రెండేళ్లుగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆయుర్వేద వైద్యంపై మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్యశాలల్లో వైద్యుల నియామకం చేపట్టని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదు. 

మందులున్నా నిరుపయోగమే..

మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలో పనిచేసిన వైద్యున్ని ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి మూడేళ్లుగా నియామకం చేపట్టలేదు. వైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నా ఇచ్చే వారు కరువయ్యారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాదిగ్రస్థులకు మంచి ఫలితాలు ఇస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి వైద్యం కోసం రోగులు వివిధ గ్రామాల నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాదిగ్రస్థులు మెరుగైన ఆయుర్వేద వైద్యం కోసం కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కరీంనగర్‌ తదితర పట్టణాలకు వెళ్తున్నారు. దీంతో వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ ఎంతో మంది వివిధ వ్యాధులు నయం కోసం ఆయుర్వేద వైద్యంపై ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయుర్వేద ఆస్పత్రిలో వైద్యున్ని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వైద్యున్ని నియమించాలి..

- మెస్రం మహేష్‌, బెజ్జూరు

మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి. ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో వైద్యం అందడం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అధికంగా ఆయుర్వేద వైద్యంపై ఆధారపడి వైద్యం చేయించుకుంటున్నారు. అధికారులు స్పందించి వైద్యుడిని నియమించాలి.

అధికారులు స్పందించాలి..

- కుమ్మరి శంకర్‌, బెజ్జూరు

కరోనా కాలంలో ఎక్కువశాతం మంది ఆయుర్వేద వైద్యంపై ఆధారపడగా ప్రస్తుతం వైద్యుడు లేని కారణంగా వైద్యం అందడం లేదు. వైద్యం కోసం ఇతర పట్టణాలకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి తక్షణమే ఆయుర్వేద వైద్యున్ని నియమించాలి.