సీబీఎస్ఈ అమలు అంత సులువా?

ABN , First Publish Date - 2021-04-02T09:57:15+05:30 IST

వచ్చేవిద్యా సంవత్సరం మొదలుకొని 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్దిరోజులుగా ప్రకటనలు...

సీబీఎస్ఈ అమలు అంత సులువా?

వచ్చేవిద్యా సంవత్సరం మొదలుకొని 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్దిరోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తరువాత ఇప్పుడు సిలబస్ విషయంలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. పాఠశాల విద్యలో సమూల మార్పులను తేవాలనే ఆలోచన ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆ మార్పులు ప్రణాళికాబద్ధంగా ఉన్నాయా లేక హడావుడి చర్యలుగా ఉన్నాయా అనేదే చర్చనీయాంశం. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయమే వివాదాస్పద నిర్ణయంగా భావించి కొంతమంది పెద్దలు కోర్టు మెట్లు ఎక్కారు. తెలుగు మాధ్యమం కానీ ఆంగ్ల మాధ్యమం కానీ ఎంచుకునే అవకాశం విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఉండాలని సూచించిన కోర్టు నిర్ణయాన్ని కూడా కాదని, ఏమైనాసరే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే సీఎం ప్రకటించిన మరొక సంచలన నిర్ణయం ఈ సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలనుకోవడం. అయితే ముఖ్యమంత్రి ప్రకటన అనేక అంశాలను చర్చించడానికి తెరలేపినట్లయింది. సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టాలనే ప్రకటన బహిరంగపరిచే ముందు దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో కానీ విద్యారంగ నిపుణులతో చర్చించారా అన్నది అనుమానాస్పదమే. ప్రభుత్వ ప్రకటనలో వివాదాస్పద అంశాలను పరిశీలిస్తే– ఎన్సీఈఆర్టీ ప్రకటించే సిలబస్‌ను మాత్రమే ఇక్కడి పాఠశాలల్లో అమలు చేస్తారా లేక మొత్తంగా సీబీఎస్ఈ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడి పాఠశాలల సిలబస్‌ను నడిపిస్తారా అన్నది మొదటి ప్రశ్న. 


నిజానికి ఎన్సీఈఆర్టీ సిలబస్‌‍ను పరిశీలిస్తే, ఇటీవల కాలంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాల పేరుతో కొన్ని మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రకు సంస్కృతికి సంబంధించిన పాఠ్యాంశాలలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను పక్కనపెడితే సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టు ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో ఉంటుంది. పాఠ్యాంశాలను నిర్దేశించే క్రమంలో నిరంతరం పరిశోధన కొనసాగుతూ ఉంటుంది. ఆ పరిశోధనల సారాంశాన్ని ప్రయోగ రూపంలో ప్రవేశపెడుతూ ఉంటారు. రాష్ట్రస్థాయిలో మనకు సిలబస్ పాఠ్యపుస్తకాల రూపకల్పన తదితర అంశాలను విద్యార్థులకు అందించటానికి ఎస్సీఈఆర్టీ ఉంది. ఎన్సీఈఆర్టీతో పోల్చినప్పుడు పరిశోధన ప్రమాణాల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నట్లే లెక్క. జాతీయ స్థాయిలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను పొందే విధంగా పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఒకే విధమైన పాఠ్య ప్రణాళికలు ఉండడం ఆహ్వానించదగ్గ విష యమే. అయితే అనేక రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు ఉన్నచోట జాతీయ స్థాయిలో ఒకే సిలబస్ అనేది కష్టతరమైన అంశం. పైగా రాజ్యాంగం కల్పించిన మాతృభాషలో విద్యా బోధన అనేది దేశానికంతటికీ ఒకే సిలబస్ ఉన్నప్పుడు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సిబిఎస్‌ఈ పాఠ్యప్రణాళికను ఇక్కడ అమలు చేయాలంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మాధ్యమం విషయంలో ఇప్పటికే చర్చ జరుగుతుండగా, చరిత్ర సంస్కృతి పౌరశాస్త్రం తదితర అంశాలలో దేశ విద్యార్థులందరినీ ఒకేగాటన కట్టడం అసాధ్యమైన విషయం. సీబీఎస్ఈ సిలబస్‌ను అనుసరించడం అంటే యధాతథంగా అనుసరించాల్సిందే తప్ప వారు మన కోసం మార్పులు చేర్పులు చెయ్యరు. తెలుగు వారిగా తెలుగు ప్రాంత సంస్కృతి ఆచార వ్యవహారాలను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత పాఠ్యాంశాల తయారీదారుల మీద ఉంటుంది. అది సీబీఎస్ఈని అనుసరిస్తే సాధ్యం కాదు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండడం వలన కలిగే ప్రయోజనాలను ఎందరో విద్యావేత్తలు ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఇంగ్లీషు మాధ్యమం వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా ఈ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ విధమైన కృషి చేయకపోగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి అనుకోవడం లేదా సీబీఎస్ఈ సిలబస్‌ను అనుసరించాలి అనుకోవడం వలన విద్యార్థులు ఎక్కువ నష్టపోతారు.


సిబిఎస్ఇ సిలబస్‌ను కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రవేశపెడతారా లేక ప్రైవేటు పాఠశాలలకు కూడా చేస్తారా అనేది రెండవ చర్చనీయాంశం. దీని మీద ఇప్పటికీ ఏ విధమైన స్పష్టత లేదు. ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ అధికారాలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఇప్పటికే వీటిలో చాలా పాఠశాలలు సిలబస్ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. దాదాపుగా అన్నీ తమ సొంత సిలబస్ ప్రిపేర్ చేసుకుని జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు తగిన ఈ విధమైన సిలబస్‌ను విద్యార్థులకు బోధిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో కూడా ఉన్నాయనేది జగద్విదితమే. ఈ నేపథ్యంతో ఆలోచించినప్పుడు ఈ సిలబస్‌ను ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయడం ప్రభుత్వానికి ఎంతవరకూ అసాధ్యం అనేది ఆలోచించాల్సిన విషయం అవుతుంది. లేదా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ ప్రైవేటు పాఠశాలల స్థితి ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈ సిలబస్ పట్ల అవగాహన కల్పించడం బోధనా పరమైన శిక్షణ ఇప్పించడం వంటివి కూడా ఒక ప్రహసనంలా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రహసనం అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే 2010 నుండి 2017 వరకు సిసిఈ (సమగ్ర నిరంతర మూల్యాంకన విధానం) పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే 2017 లోనే సిబిఎస్ఈ, సిసిఈ అమలులోని లోపాలను గుర్తించి పరీక్షా విధానంలో తిరిగి పాత విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేగాక విద్యార్థులకు ఇచ్చే గ్రేడుల స్థానంలో తిరిగి మార్కులను ఇవ్వడం ప్రారంభించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిసిఈ విధానాన్ని అనుసరిస్తోంది.


ఇక పాఠశాలలకు ఇచ్చే గుర్తింపు విషయంలో సీబీఎస్‌ఈ నిబంధనలకు స్టేట్ బోర్డ్ నిబంధనలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం సహేతుకమైనదే. సీబీఎస్ఈ పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లో కనిష్ఠంగా ఒక ఎకరం విస్తీర్ణం కలిగి ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటిన్నర ఎకరాల నుండి రెండు ఎకరాల వరకూ స్థలం కావాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి వాటికి ల్యాబ్స్, గ్రంథాలయం, ఆటస్థలం, తగినన్ని ఆట పరికరాలు ఇలాంటి నిబంధనలు ఎన్నో ఉన్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల గుర్తింపుకు ఇచ్చే నిబంధనల్లో చాలావాటికి సడలింపులు కూడా ఉండడం వల్ల పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రైవేటు యాజమాన్యాలు పాఠశాలను నెలకొల్పగలుగుతున్నాయి. కానీ సీబీఎస్‌ఈ నిబంధనలకు ఎటువంటి సడలింపులు ఉండవు.  తగిన సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో కొత్తగా సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ చేయవలసింది మిగిలే ఉంది. పైగా ఇప్పటికీ ఇక్కడ ఎస్సీఈఆర్టీ, పరీక్షల నిర్వహణ శాఖ, పాఠశాల విద్యా శాఖ తదితర శాఖలన్నీ తగిన విధంగా పని చేస్తున్నాయి. ముందు ముందు ఈ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. అంతేగాక ప్రభుత్వాలు మారినపుడు అధికారులు మారినపుడు చేసే తాత్కాలిక మార్పులు విద్యార్థులను ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. విద్యా శాఖలో మౌలికమైన మార్పులు నుండి ప్రణాళికాబద్ధమైన మార్పుల వరకూ ఒక క్రమ పద్ధతిలో మార్పులు చేసేందుకు ఈ శాఖలు స్వతంత్ర ప్రతిపత్తితో ఉండటం అవసరం. విధాన నిర్ణయాల ప్రకటన ప్రభుత్వ పాలకుల నుంచి గాక స్వయంప్రతిపత్తి ఉన్న పాఠశాల విద్యా శాఖ నుంచి మొదలుపెడితే అది ఉపయోగకరంగా ఉంటుంది.

బండ్ల మాధవరావు

Updated Date - 2021-04-02T09:57:15+05:30 IST