Abn logo
May 5 2021 @ 00:21AM

మోదీలో మార్పు కుందేటి కొమ్మేనా?

‘రోగులు ఆక్సిజన్ కోసం, పడకలకోసం ఒక ఆసు పత్రి నుంచి మరో ఆసు పత్రికి పరుగులు తీస్తున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల వంటి సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వమని మూడు సార్లు ఆదేశాలు జారీ చేస్తే ఏమి చేయలేదు,’ అని మంగళవారం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రంనాథ్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని, మారుమూల గ్రామాల్లో ఆసుపత్రులు, పడకలు లేవని, పడకలు ఉన్న చోట వైద్య సౌకర్యాలు లేవని, ఎంతమంది చనిపోతున్నారో లెక్క తెలియడంలేదని అహ్మదాబాద్ హైకోర్టు ముందు సీనియర్ న్యాయవాది కవీనా చెప్పారు. గుజరాత్‌లో వ్యాక్సినేషన్ ప్రహసనంగా మారిందని, 45 ఏళ్లు దాటిన వారికి రెండవ డోస్ లభించడం లేదని అన్నారు. ఆక్సిజన్ లభించక సూరత్ తదితర ప్రాంతాల్లో 50మందికి పైగా మరణించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.


ఇవాళ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వివిధ న్యాయ స్థానాల్లో కరోనాపై జరుగుతున్న విచారణలను బట్టి అర్థమవుతుంది. ‘మీరు లాక్ డౌన్ పెట్టకపోతే మేమే పెట్టాల్సి వస్తుంది’ అని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి చక్రధరి శరణ్ అన్నారు. ‘ప్రజల ఆరోగ్యం అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనదని రాజ్యాంగ సంస్థలకు గుర్తుచేయాల్సి రావడం విచారకరం’ అని చెన్నై హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న సమయంలో ఎన్నికల ర్యాలీలను అనుమతించిన మీపై హత్యా నేరం మోపవచ్చు, ర్యాలీలు జరుగుతుంటే మీరు మరో గ్రహంపై ఉన్నారా?’ అని ఈ హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శించింది. ‘మీరు ఈ దేశ ప్రజలు మరణించాలనుకుంటున్నారు’ అని ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ కేంద్రాన్ని విమర్శించారు. రెమ్‌డిసివిర్ కొరత తగ్గించేందుకు కేంద్రం మార్గదర్శక సూత్రాలనే మార్చే ప్రయత్నం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.


దేశంలో వివిధ హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే ఈ న్యాయస్థానాలే లేకపోతే ఈ ప్రభుత్వాలను ఎవరు ప్రశ్నించేవారన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రజలకు జీవించే హక్కును కాపాడేందుకు న్యాయస్థానాలు ముందుకు రావడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం. న్యాయస్థానాలు వేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వాలవద్ద సమాధానాలు లభించడం లేదు. యుపిలో పోలీసులు అరెస్టు చేసిన కప్పన్ అనే జర్నలిస్టును మధుర నుంచి ఢిల్లీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించినప్పుడు ఆ ఆదేశాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సోలిసిటర్ జనరల్, గుజరాత్‌కు చెందిన తుషార్ మెహతా తీవ్ర యత్నాలు చేశారు. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదని నిస్సహాయత వ్యక్తం చేయడం ద్వారా దేశ రాజధానిలో దుస్థితిని ఆయన స్వయంగా కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఉన్న ఒక ఖైదీకి కూడా జీవించే హక్కు ఉంటుందన్న మౌలిక సూత్రాన్ని జస్టిస్ రమణ ఆయనకు గుర్తు చేయాల్సివచ్చింది. ఇవాళ దేశంలో ఉన్నత న్యాయస్థానం కేంద్రప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా పనిచేయాలో నిర్దేశించే పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రుల్లో అడ్మిషన్లపై జాతీయ విధానం రూపొందించి రెండువారాల్లో తమకు సమర్పించాలని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ఆదేశించింది. దేశంలో ఆరోగ్యఅత్యవసర పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాలపై మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించింది. ప్రజలు తమ బాధలను సోషల్ మీడియాలో వ్యక్తం చేసినందుకు వారిపై చర్య తీసుకుంటే కోర్టు ధిక్కారం క్రింద పరిగణిస్తామని స్పష్టం చేసింది. ‘సమాచారం స్వేచ్ఛగా ప్రవహించాలి.’ అని చెప్పింది.


ప్రభుత్వం ఎలా పాలించాలో చెప్పడం న్యాయవ్యవస్థ పని కాదు. కాని న్యాయవ్యవస్థ పరిపాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నదంటే ప్రభుత్వ పనితీరులో స్పష్టంగా లోటు ఉన్నట్లేనని చెప్పక తప్పదు. స్వాతంత్ర్యం తర్వాత అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలను పరిరక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మరణించిన ప్రముఖ న్యాయవేత్త సోలీ సోరాబ్జీ మరో ప్రముఖ న్యాయవేత్త నానీ పాల్కీవాలాతో కలిసి సుప్రీంకోర్టులో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చకుండా అడ్డుపడ్డారు. ‘రాజ్యాంగంలో 21వ అధికరణ స్వేచ్ఛనే కాక జీవించే హక్కును కల్పిస్తుంది. ఒక అధికారి వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని కాల్చి చంపినా కోర్టుల ద్వారా న్యాయం అడగవద్దా?’ అని ఎమర్జెన్సీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా నాటి అటార్నీ జనరల్‌ను ప్రశ్నించి తన అసమ్మతి తీర్పును వెలువరించారు. తమ హక్కులను పరిరక్షించుకోవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారాన్ని ప్రజలకు రాజ్యాంగంలోని అధికరణ 32 కల్పించింది. ఈ హక్కులను కాపాడడం కోసం సుప్రీం కలుగచేసుకునేందుకు వీలున్నది. 1948 డిసెంబర్ 9న రాజ్యాంగ అసెంబ్లీలో అంబేడ్కర్ మాట్లాడుతూ ‘రాజ్యాంగంలో ఏది ముఖ్యమైన అధికరణ అని ఎవరైనా అడిగితే నేను 32వ అధికరణ గురించే ప్రస్తావిస్తాను. ఇది రాజ్యాంగం ఆత్మ.. దాని హృదయం!’ అన్నారు. అయితే గత నెలలో పదవీ విరమణ చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, ఆ అధికరణ క్రింద పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాను ప్రోత్సహించబోనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతకొద్ది రోజులుగా సుప్రీం కోర్టు, దేశంలో హైకోర్టులు అనుసరిస్తున్న వైఖరి ప్రజలకు ఒక ఊరట నిస్తున్నదనడంలో సందేహం లేదు.


పశ్చిమ బెంగాల్‌లో మోదీ ఆధ్వర్యంలో చేసిన పోరాటంలో బిజెపి విఫలం కాలేదని, గతంలోకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సీట్లు సాధించామని వాదించేవారున్నారు. కాని మోదీయే ఈ పోరాటాన్ని జాతీయస్థాయి పోరాటంగా మార్చి అన్నిశక్తులూ ప్రయోగించారు. తాము బెంగాల్‌ను హస్తగతం చేసుకుంటామని పదే పదే ప్రకటించారు. అన్ని శక్తులూ ఒడ్డిన తర్వాత కూడా మమతా బెనర్జీ సాధించిన సీట్లలో సగం కూడా బిజెపి సాధించలేకపోవడం అనేక అంశాల్ని వెల్లడిస్తోంది. బిజెపిని గెలిపించేందుకు మోదీ ప్రయోగించే ఆయుధాల ఉపయోగిత విలువ తగ్గిపోయిందనేది ముందుగా ప్రస్తావించాల్సిన అంశం. ఒక రాష్ట్రంలోనే తన సర్వశక్తులూ విఫలమైనప్పుడు జాతీయస్థాయిలో కూడా అవి సఫలమయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. ‘అందర్నీ అన్నిసార్లు అమాయకులను చేసి ఆడించలేరు’ అన్న ఇంగ్లీషు సామెత మోదీ విషయంలో ఇప్పుడు వర్తిస్తుంది. ఆయన ఉపన్యాసాలు, హావభావాలు, వేషాలు, ఓట్లను చీల్చేందుకు చేసే రకరకాల యత్నాలు ఫలించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆయన వైఫల్యాలు, బలహీనతలు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఒకవైపు దేశసమస్యల్ని, ప్రజల మరణాల్ని అరికట్టలేని వైఫల్యం, మరోవైపు తన ఆకర్షణ, విశ్వసనీయత పడిపోతుండడం, పార్టీలోనూ, సంఘ్‌లోనూ తన నాయకత్వ శైలి ప్రశ్నార్థకం కావడం, అన్నిటినీ మించి న్యాయవ్యవస్థతో పాటు మిగతా కీలక వ్యవస్థలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయడం, వీటన్నిటినీ ఉపయోగిం చుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ జాతీయస్థాయిలో మోహరించేందుకు సన్నాహాలు చేయడం మోదీని తీవ్రమైన కష్టాల్లో, అభద్రతలో పడేస్తుందనడంలో సందేహం లేదు.


మరో ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్; వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు. తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను మార్చుకునేందుకు నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? పార్టీని, ప్రజలను తనవైపుకు తిప్పుకోగలరా అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. మోదీ యథావిధిగా బూటకపు ఆయుధాలను ప్రయోగించడంకన్నా చిత్తశుద్ధితో, నిజాయితీతో తన సమర్థతను నిరూపించుకునే ప్రయత్నాలు చేయాలని, తన వైఖరికి భిన్నంగా అందర్నీ కలుపుకుపోవాలని, మంత్రివర్గంలో అనుభవజ్ఞులను, రాజనీతిజ్ఞులను చేర్చుకుని వారికి పనిచేసే స్వేచ్ఛనీయాలని ఆశించేవారు లేకపోలేదు. అయితే మోదీ నుంచి ఈ లక్షణాలను ఆశించడం కన్నా కుందేటి కొమ్మును సాధించడం సులభం అని చెప్పేవారే అధికంగా ఉన్నారు. గతంలో ఆడ్వాణీ మతవాద మోతాదు పెరిగి బిజెపిని అందరూ దూరం పెట్టినప్పుడు ఒక ఉదార వాద నేతగా వాజపేయిని ప్రవేశపెట్టారు. మోదీలో మార్పు వచ్చేనా? ఆయన, వాజపేయి కావడం కష్టమే కాదు, అసంభవం కూడా.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)