సీను మారుతోందా?

ABN , First Publish Date - 2021-04-10T05:39:14+05:30 IST

గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలనూ, భారీ మెజారిటీతో రెండు ఎంపీ స్థానాలనూ గెలుచుకున్న వైసీపీకి, పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల గంపగుత్త విజయాలు ఎక్కడలేని ధీమానిచ్చాయి.

సీను మారుతోందా?

తిరుపతి లోక్‌సభ స్థానం లక్షల ఆధిక్యంతో మా సొంతం అనే ధీమాతో ఉన్న వైసీపీలో ఆందోళన మొదలైంది. పార్టీ అధినేత జగన్‌ అవసరం లేకుండానే అఖండ విజయాన్ని సాధించాలనుకున్న ప్రయత్నం భంగపడింది. ప్రచారాలు హోరెత్తుతున్న వేళ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు అధికార వైసీపీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయని అంటున్నారు. ఈ కారణంగానే  తన అవసరం లేదనుకున్న జగన్‌, ఆధిక్యం సంగతి అటుంచి, అసలుకే ఎసరొచ్చేట్టుందనే ప్రచారపర్యటన ఖరారు చేసుకున్నారని అంటున్నారు.



తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలనూ, భారీ మెజారిటీతో రెండు ఎంపీ స్థానాలనూ గెలుచుకున్న వైసీపీకి,  పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల గంపగుత్త విజయాలు ఎక్కడలేని ధీమానిచ్చాయి. తిరుపతి ఉప ఎన్నిక తమకు నల్లేరు మీద నడకకన్నా సులువనే ఆత్మవిశ్వాసం ఆ పార్టీ నాయకుల్లో తొణికిసలాడేది. ఎంపీగా ఉండి మరణించిన బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి ఈ సీటు ఇవ్వకపోయినా, ఊరూపేరూ తెలియని కొత్త వ్యక్తిని అభ్యర్ధిగా ప్రకటించినా విజయవిశ్వాసమే కారణం. గెలుపు ఒక లెక్కకాదని కనీసం 3లక్షలకు తగ్గకుండా మెజారిటీ సాధిస్తామని తొలుత ప్రకటించి ఆ తర్వాత ఆ సంఖ్యను 5 లక్షలకు వారే పెంచి ప్రచారంలోకి తెచ్చారు. జగన్‌ ప్రచార అవసరం లేకుండానే ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇవ్వాలనే ఉత్సాహం జిల్లా నాయకుల్లో నిన్నా మొన్నటిదాకా కనిపించింది. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో వ్యూహరచన సాగింది. అయితే ఎన్నికల వేళ దగ్గరయ్యే కొద్దీ ధీమా సన్నగిల్లుతోందని తెలుస్తోంది. ప్రజల్లో పేరుకుపోతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, రేషనుతో బడుగువర్గాలు పడుతున్న అవస్థలు..ఇవన్నీ ప్రచార సమయంలో ఏదో రూపంలో నాయకుల దృష్టికి వస్తున్నాయి. ఇదే సమయంలో అందరికన్నా ముందే అభ్యర్ధిని ప్రకటించి, ప్రణాళికాబద్ధంగా ప్రచార కార్యక్రమంలో హడావుడి చేస్తున్న టీడీపీ,  నారా లోకేశ్‌ పంచ్‌ డైలాగులకు ప్రజలనుంచి వస్తున్న స్పందన, పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ వైసీపీపై  చేసిన ఘాటు విమర్శలు, బీజీపీలో ఉరకలేస్తున్న ఉత్సాహం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే ప్రచారానికి వస్తుండడం.. కాంగ్రెస్‌ అభ్యర్ధి చింతామోహన్‌ ఎస్సీ వర్గాలే లక్ష్యంగా చేస్తున్న ప్రచారం వంటి పరిణామాలు వైసీపీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సడలడానికి కారణం అయ్యాయని తెలుస్తోంది. చంద్రబాబు శ్రీకాళహస్తి, పొదలకూరు సభలకు భారీఎత్తున ప్రజలు హాజరవడం, ఆయన ప్రసంగానికి వారి నుంచి లభించిన స్పందనా వైసీపీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయని అంటున్నారు. అలాగే జిల్లా నాయకుల మీద గెలుపు బాధ్యత పెట్టి ఊరుకోకుండా పార్టీ అధినేత జరిపించిన రహస్య సర్వేల్లోనూ పరిస్థితి అంత ఆశాజనకంగా లేనట్టు తేలిందంటున్నారు. నిఘావర్గాల నివేదికలు కూడా హెచ్చరికగా ఉండడంతో జగన్‌ ఇక రంగంలోకి దిగక తప్పదని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.  గెలుపు తమదే అని ఇప్పటికీ నమ్ముతున్న వైసీపీ జిల్లా నాయకులు, ప్రకటించిన మెజారిటీకి ఎక్కడ గండి పడుతుందో అని భయపడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యర్థులకు గతంలోకన్నా ఓట్లు పెరిగితే అది రాష్ట్రం మొత్తం వైసీపీ బలం తగ్గిందనే సంకేతం ఇస్తుందనే అభిప్రాయంతోనే జగన్‌ పర్యటనకు పూనుకున్నారని అంటున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన, లోకేశ్‌ రోడ్‌షోలు, ప్రతి మండలంలో మొహరించిన తెలుగుదేశం రాష్ట్రస్థాయి నాయకుల ప్రచారాలు ప్రజల్లో వైసీపీపై భ్రమలు తొలగిస్తోందని అంచనా వేస్తున్నారు.  ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పరిస్థితి ఇంకెంత మారిపోతుందో అనే భయం కూడా వైసీపీలో మొదలైందంటున్నారు. అందుకే జగన్‌ ప్రచార సభను భారీ ఎత్తున నిర్వహించి హడావుడి చేయాలనే ఆలోచనతో వైసీపీ జిల్లా నాయకులు ఉన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయచ్చనే ఆలోచనతోనే ఆ నియోజకవర్గ పరిధిలో, తిరుపతి సమీపంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-04-10T05:39:14+05:30 IST