Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోటీ అనివార్యమేనా?

 రూ.10కోట్ల ఖర్చు తప్పదంటూ అధికార పార్టీలో ప్రచారం 

 ఉమ్మడి అభ్యర్థి యోచనలో స్వతంత్రులు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, మూడు తిరస్కరణకు గురికాగా ఎనిమిదిమంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈనెల 26న ఉపసంహరణ గడువు ముగియనుంది. స్వతంత్రులను పోటీనుంచి తప్పించేందుకు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. స్వతంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్‌ నేతలు, సానుభూతిపరులు ఉండటం, ఎక్కువ మంది పోటీలో ఉండటం, కొందరు స్వతంత్రుల వెనుక కాంగ్రెస్‌ పెద్దలు ఉండటంతో పోలింగ్‌ అనివార్యమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. పోటీ తప్పదు, ఒక్కో ఓటరుకు లక్షల చొప్పన ఇచ్చి క్యాంపులు నిర్వహించినా రూ.10కోట్ల ఖర్చు తప్పదన్న చర్చ అధికార పార్టీలోనూ నెలకొంది.

నల్లగొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ ఎంసీ కోటిరెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని మంత్రి జగదీష్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈమేరకు సొంత పార్టీ నుంచి ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు అందరినీ ఎన్నిక ప్రక్రియలో భాగస్వాములను చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో తమ అంచనా మేరకే ఎన్నిక ఏకగ్రీవమవుతుందని, అంతా నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, శంకర్‌ నాయక్‌లు బరిలో ఉంటారని ప్రచారం కాగా, ఆ అవకాశాలను అధికార పార్టీ నేతలు వివిధ మార్గాల్లో సమాచారం రాబట్టుకొని కాంగ్రెస్‌ పోటీలో ఉండదని ధ్రువీకరించుకున్నారు. అయితే అనూహ్యంగా 10మంది స్వతంత్రులు తెరపైకి రావడంతో అధికార పార్టీ నేతలకు పని తప్పలేదు. కొందరు స్ర్కూట్నీలో, మిగిలిన వారిని బేరసారాలతో దారికి తెచ్చుకోవచ్చని, ఆమేరకు పని ప్రారంభించారు. ఆచర్యలు ఇప్పటి వరకు ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. ఈనెల 26న ఉపసంహరణ చివరితేదీ కాగా నేడు, రేపు రాయబేరాల వేగాన్ని పెంచేపనిలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రుల నామినేషన్ల ఉపసంహరణకు ఓ కాంగ్రెస్‌ నేతను అధికార పార్టీ నేతలు వినియోగించారన్న ప్రచారం బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో కలవరం లేపింది. ఏది ఏమైనా పోటీ తప్పదని అధికార పార్టీ శిబిరం భావిస్తోంది. డిసెంబరు మొదటి వారంలోపే అధికార పార్టీ ఎన్నికల క్యాంపు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నిఽధులు, విఽధులులేక ప్రధానంగా ఎంపీటీసీలు ఇతర ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఒక్కొక్కరికి లక్ష చొప్పున ముట్టజెప్పక తప్పదు, ఎన్నికల శిబిరం నిర్వహణ ఇతరత్రా ఖర్చులు మొత్తంగా రూ.10 కోట్లు కనీసంగా ఖర్చు ఖాయమన్న చర్చ అధికార పార్టీలో మొదలైంది.


ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని తీర్మానం

మొత్తం 10 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా ఏడుగురు మిగిలారు. ఏడుగురు బరి లో నిలిచేకంటే అంతా కలిసి ఉమ్మ డి అభ్యర్థిగా ఒకరిని ఖరారు చేసుకుంటే మేలని వారంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఈనెల 24న నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్‌రోడ్‌లో ఉన్న ఓ కాంగ్రెస్‌ నాయకుడి కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే పోటీలో నిలిచేందుకు వీరిలో ముగ్గురు ఆసక్తి చూపగా నల్లగొండ జడ్పీటీసీ లక్ష్మయ్య వైపు అత్యధికులు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఎవరు బరిలో ఉండాలనేది ఈనెల 26న ఓ నిర్ణయం చేద్దామని చివరకు తేల్చినట్లు తెలిసింది. స్వతంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్‌ నేతలే ఉన్నారు. కడుదుల నగేష్‌ వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య వెనుక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారన్న ప్రచా రం విస్తృతంగా సాగుతుండగా తాము జడ్పీటీసీల హక్కుల సాధనకు బరిలో నిలిచామని తమ వెనుక ఎవరూ లేరని వారు స్పష్టంచేస్తున్నారు. 


కరోనా నిబంధనలను అనుసరించి కౌంటింగ్‌ ఏర్పాట్లు 

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు కరోనా నిబంధనలను అనుసరించి కౌంటింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గ ఏర్పాట్ల పై ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అహ్మద్‌ నదీమ్‌ బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు కలెక్టర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతంపలికారు. అనంతరం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి పీజే పాటిల్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వి.చంద్రశేఖర్‌లతో సమావేశమై ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ, పోలింగ్‌, కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు సందర్శించి కౌంటింగ్‌ కేంద్రాల రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాం గ్‌రూం ఏర్పాట్లపై చర్చించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు.  


ముగిసిన నామినేషన్ల పరిశీలన 

నల్లగొండ టౌన్‌: నల్లగొండ టౌన్‌, నవంబరు 24: స్థానిక సంస్థల నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం ముగిసింది. మొత్తం 11 నామినేషన్లకు ఎనిమిది ఆమోదం పొంది మూడు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి పీజే పాటిల్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ స్థానానికి మొత్తం 11మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించగా మిగిలిన మూడు నామినేషన్లు వివిధ కారణాలవల్ల తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. ఆమోదించిన నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి కాసం వెంకటేశ్వర్లు, రాంసింగ్‌ కొర్ర,బెజ్జం సైదులు, తండు సైదులు, ఆర్పుల శ్రీశైలం, డాక్టర్‌ కె.నగేష్‌, వంగూరి లక్ష్మయ్య నామినేషన్లను ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన బడుగుల రవీందర్‌, దాచపల్లి నాగేశ్వర్‌రావు, పాదూరి గోవర్థనిల నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అహ్మద్‌ నదీమ్‌ బుధవారం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఆయనకు కలెక్టర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతంపలికారు. అనంతరం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి పీజే పాటిల్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వి.చంద్రశేఖర్‌లతో సమావేశమై ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ, పోలింగ్‌, కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్‌ అధికారి చంద్రశేఖర్‌, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జడ్పీ సీఈవోలు వీరబ్రహ్మచారి, సురేష్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement