కరోనా కళ్లు తెరిపించేనా?

ABN , First Publish Date - 2020-04-19T05:54:49+05:30 IST

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మన దేశంలో అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభించడానికి కారణం ఏమిటి? ఈ విషయమై ప్రభుత్వాలు, మత పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా? నిజానికి మర్కజ్‌ సమావేశం జరిగే నాటికి మన దేశంలో వివిధ రాష్ట్రాలలో కరోనా తీవ్రత పెద్దగా లేదు...

కరోనా కళ్లు తెరిపించేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కరికి మూడు వంతున దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేదలు కానివారికి ఉచిత మాస్కులు ఎందుకు? ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలతో వందల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? నిజాం పాలనలో కరువు కాటకాలు వ్యాపించినప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించడానికై హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను తవ్వించారు. ఇప్పుడంటే హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చాం గానీ, ఒకప్పుడు అది స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. దార్శనికత అంటే అది. 1930 దశకంలో ఐరోపా దేశాలు, పశ్చిమ దేశాలు చేసినట్టుగా ఇప్పుడు మన దేశంలో ప్రస్తుత పరిస్థితిని ఒక అవకాశంగా మలచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయిచేయి కలిపి ఉపాధి కల్పనతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు పూనుకుంటే మంచిది.


మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ ముస్లింలను ఓటుబ్యాంకుగా చూడటం వల్లనే ఈ పరిస్థితి అని చెప్పవచ్చు. కరోనా సోకినవారిని రోగి అని కాకుండా ముస్లిమా, హిందువా అని చూడటం ఏమిటి? అంతిమంగా ప్రస్తుత పరిణామాలు ముస్లింలపై మిగతా వర్గాలవారు ఆగ్రహంగా ఉండటానికి కారణమయ్యాయి. కరోనా వ్యాప్తిని మత కోణంలో చూడకూడదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ప్రభుత్వాలు కూడా మత కోణంలో కాకుండా దాన్ని ఒక మహమ్మారిగానే చూసి ఉండాల్సింది. ముస్లిం మతపెద్దలతోపాటు మజ్లిస్‌ పార్టీ అధినేత కూడా బాధ్యత తీసుకుని ఉంటే ఈ వైరస్‌ విస్తరణ కొంతవరకు తగ్గేదేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 


‌ప్రపంచానికే కాలసర్ప దోషం పట్టిందని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర తాజాగా సెలవిచ్చారు. సైన్సుతో జయించాల్సిన చోట మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఏమిటి? శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్టుగా ఇదే స్వామి వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి హోమం చేస్తున్నానని ప్రారంభంలో ప్రకటించి, కరోనా వ్యాప్తి చెందడంతో ఆశ్రమాన్ని మూసివేశారు. ప్రాణభీతికి ఎవరూ మినహాయింపు కాదు. మే 5వ తేదీ తర్వాత వైరస్‌ తగ్గుముఖం పడుతుందని చెబుతున్న స్వరూపానంద మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే!


‘‘శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వం తీసుకుంటున్న మహత్తర చర్యల వల్ల ఉత్తరాంధ్రలో వైరస్‌ వ్యాప్తి చెందడం లేదు’’ అని అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారంనాడు ప్రకటించారు. మరి ఆ  మహత్తర చర్యలను గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుతారు? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రికార్డు కాని విషయం వాస్తవమే! అయితే అందుకు ప్రభుత్వ చర్యలు కారణం కాదు. ఆ రెండు జిల్లాలలో ముస్లింలు అతి తక్కువగా ఉంటారు. మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారని ప్రభుత్వమే చెప్పింది. వెనుకబాటుతనం కూడా ఈ రెండు జిల్లాలను వైరస్‌ బారిన పడకుండా కొంతవరకు కాపాడిందని చెప్పవచ్చు.


యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మన దేశంలో అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభించడానికి కారణం ఏమిటి? ఈ విషయమై ప్రభుత్వాలు, మత పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా? నిజానికి మర్కజ్‌ సమావేశం జరిగే నాటికి మన దేశంలో వివిధ రాష్ట్రాలలో కరోనా తీవ్రత పెద్దగా లేదు. కరోనా మహమ్మారి వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతున్నప్పుడే అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం వంటి చర్యల వల్ల మనం కొంత ఊపిరి పీల్చుకోగలిగాం. సరిగ్గా ఈ దశలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారు స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చారు. దీంతో ఈ మహమ్మారి ఒక్కసారిగా జూలు విదిల్చింది. మర్కజ్‌ సమావేశానికి ఇండోనేషియా, ఇరాన్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు హాజరవ్వడంతో మనవాళ్లకు కరోనా వ్యాపించింది. వీళ్లు స్వరాష్ట్రానికి చేరుకుని ఈ వైరస్‌ని వ్యాప్తి చేశారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కేంద్ర నిఘా వర్గాల వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో చొరవ చూపించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మర్కజ్‌ సమావేశానికి ఎవరెవరు వచ్చారో అన్న విషయం పసిగట్టలేకపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చిన్నపాటి నిరసనలు, ధర్నాలు చేసినప్పుడు అందులో ఎవరెవరు పాల్గొంటున్నారన్నది ఆరా తీసే నిఘా వర్గాలు.. ఢిల్లీ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? అన్న విషయాన్ని విస్మరించడం ఏమిటి? తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన ఇండోనేషియా వారికి కరోనా సోకిన విషయం బయటపడేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మర్కజ్‌ సమావేశం గురించి పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు మన కొంప ముంచింది. మర్కజ్‌ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా సోకుతున్న విషయం తెలిసిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అలసత్వం ప్రదర్శించాయనే చెప్పాలి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కూడా కొంతవరకు బాధ్యతారహితంగా వ్యవహరించారు.


కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్‌ సోకితే మిగతా కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందే అవకాశముందని ప్రభుత్వాలకు తెలియనిది కాదు. అయినా మర్కజ్‌ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. అదే సమయంలో సదరు సమావేశాన్ని నిర్వహించిన తబ్లీగీ జమాత్‌ సంస్థ కూడా ఆ సమావేశానికి హాజరైన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి అందించడంలో బాధ్యత లేకుండా వ్యవహరించింది. పేద ముస్లింల జీవన విధానం తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రారంభంలో అలక్ష్యం ప్రదర్శించాయి. పేదరికం కారణంగా ముస్లింలలో ఎక్కువ మంది ఒకే గదిలో నివసిస్తుంటారు. అందరూ పక్కపక్కనే చాప పర్చుకుని పడుకోవడం వల్ల ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు జరుగుతున్నది అదే! సాధారణంగా మతపరమైన సమావేశాలకు దిగువ, మధ్య తరగతివారే అధికంగా హాజరవుతుంటారు. ఏ మతంలోనైనా ఈ ఆర్థికస్థితికి  చెందినవాళ్లు ఇరుకు ఇళ్లల్లోనే జీవిస్తుంటారు. ఈ వాస్తవాన్ని గుర్తించి మర్కజ్‌కు వెళ్లివచ్చినవారి కుటుంబాలను ఐసొలేషన్‌కు తరలించడంలో ప్రభుత్వాలు కొంతవరకు విఫలమయ్యాయి. ఫలితంగా వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో పసిగట్టలేని స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి 16 మంది వరకు వైరస్‌ వ్యాప్తి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో అది అమలు కాలేదు. ఫలితమే ప్రస్తుత దుస్థితి! మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ ముస్లింలను ఓటుబ్యాంకుగా చూడటం వల్లనే ఈ పరిస్థితి అని చెప్పవచ్చు. కరోనా సోకినవారిని రోగి అని కాకుండా ముస్లిమా, హిందువా అని చూడటం ఏమిటి? అంతిమంగా ప్రస్తుత పరిణామాలు ముస్లింలపై మిగతా వర్గాలవారు ఆగ్రహంగా ఉండటానికి కారణమయ్యాయి. కరోనా వ్యాప్తిని మత కోణంలో చూడకూడదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ప్రభుత్వాలు కూడా మత కోణంలో కాకుండా దాన్ని ఒక మహమ్మారిగానే చూసి ఉండాల్సింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో అత్యధికులు ఈ వైరస్‌ బారినపడటానికి ప్రభుత్వంతోపాటు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొంటున్న మజ్లిస్‌ పార్టీ కూడా కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ముస్లిం మతపెద్దలతోపాటు మజ్లిస్‌ పార్టీ అధినేత కూడా బాధ్యత తీసుకుని ఉంటే ఈ వైరస్‌ విస్తరణ కొంతవరకు తగ్గేదేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కారణం ఏమైనా మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు స్వేచ్ఛగా తిరిగిన ప్రాంతాల్లోనే ఇప్పుడు తెలంగాణలో ఈ మహమ్మారి కమ్ముకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. గుంటూరు పట్టణంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. ఆయనకు కరోనా సోకింది. అయినా కొన్ని రోజులు స్వేచ్ఛగా తిరిగారు. ఈ విషయం ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’పై నిందలు వేయడానికి ఉత్సాహం చూపించారే గానీ విరుగుడు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు గుంటూరు పట్టణాన్ని కరోనా కమ్మేసింది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు– హిందువులు మరింత కలివిడిగా తిరుగుతారు. ఈ కారణంగా నెల్లూరు, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో వైరస్‌ ఎంతమందికి సోకిందో గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సేకరించిన నమూనాలను కూడా పూర్తిగా పరీక్షించకుండానే ఇంతమందికి నెగిటివ్‌, అంతమందికి నెగిటివ్‌ అని ప్రభుత్వాధికారులు ప్రకటిస్తున్నారని వైద్యులే చెబుతున్నారు. ‘‘శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వం తీసుకుంటున్న మహత్తర చర్యల వల్ల ఉత్తరాంధ్రలో వైరస్‌ వ్యాప్తి చెందడం లేదు’’ అని అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారంనాడు ప్రకటించారు. మరి ఆ మహత్తర చర్యలను గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుతారు? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రికార్డు కాని విషయం వాస్తవమే! అయితే అందుకు ప్రభుత్వ చర్యలు కారణం కాదు. ఆ రెండు జిల్లాలలో ముస్లింలు అతి తక్కువగా ఉంటారు. మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారని ప్రభుత్వమే చెప్పింది. వెనుకబాటుతనం కూడా ఈ రెండు జిల్లాలను వైరస్‌ బారిన పడకుండా కొంతవరకు కాపాడిందని చెప్పవచ్చు. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు కూడా ఈ రెండు జిల్లాలలో పెద్దగా లేరని అంటున్నారు.


పోతే, విశాఖ నగరంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం లేదనీ, ఆ కారణంగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య బయటకు రావడంలేదనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు భేషజాలకు పోవాల్సిన సమయం కాదు ఇది. మతాలతో సంబంధం లేకుండా వైరస్‌ను వైరస్‌గానే చూడాలి. కరోనా కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో ముస్లింలు, హిందువులకు మధ్య అపోహలు, అపార్థాలు చోటుచేసుకున్నాయి. ముస్లింల కారణంగానే దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయాన్ని హిందువులలో వ్యాపింపజేశారు. ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా లాభిస్తుంది. కరోనా నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సానుకూల ధృక్పథంతోనే ఉన్నారు. ఈ కారణంగానే ఈనెల 5వ తేదీన ఇళ్లల్లో లైట్లు ఆర్పివేసి, బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ప్రజలు స్పందించారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో మాత్రం ఈ పిలుపును పెద్దగా పట్టించుకోలేదు. నరేంద్ర మోదీ దేశానికే ప్రధాని అన్న విషయాన్ని విస్మరించకూడదు. అయినా ఇలాంటి ధోరణుల వల్ల ప్రజల మధ్య అంతరం మరింత పెరిగి, అంతిమంగా భారతీయ జనతా పార్టీకే ప్రయోజనం చేకూరుతుంది. కరోనా వైరస్‌ను అంటించుకుని చనిపోవాలని ముస్లింలు మాత్రం ఎందుకు కోరుకుంటారు? ఈ విషయంలో సోషల్‌ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ఇలాంటి పెడధోరణులను అరికట్టడానికి ప్రభుత్వాలతోపాటు ముస్లిం మత పెద్దలు, మజ్లిస్‌ వంటి పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఈ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ విధిగా లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే! ఇందులో కులాలు, మతాలకు తావు లేదు. ప్రభుత్వ నిర్ణయంతో దేవాలయాలన్నింటినీ మూసివేశారు. మసీదుల విషయంలో కూడా సంబంధితులు అవే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మసీదులను మూసివేసినా ప్రారంభంలో కొన్నిచోట్ల సామూహిక నమాజును అనుమతించారు.


ఇలాంటి సందర్భాలలో అలా చేయడం ఖురాన్‌ బోధనలకు కూడా విరుద్ధం.కరోనా మహమ్మారి కంటే దేవుడు గొప్పవాడు అని ప్రకటించి చర్చిలో సామూహిక ప్రార్థనలు చేయించిన ఒక ఫాదర్‌ అదే కరోనా బారినపడి మరణించిన వార్త మీడియాలో వచ్చింది. వైరస్‌ మహమ్మారి విజృంభించినప్పుడు ఏ దేవుడు కూడా ఏమీ చేయలేడు. హిందూ దేవుళ్లు గానీ, అల్లా గానీ, యేసుక్రీస్తు గానీ ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడలేరు కదా! స్వయంకృతాపరాధానికి దేవుళ్లను నిందించి ప్రయోజనం లేదు. ప్రపంచానికే కాలసర్ప దోషం పట్టిందని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర తాజాగా సెలవిచ్చారు. సైన్సుతో జయించాల్సిన చోట మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఏమిటి? శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్టుగా ఇదే స్వామి వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి హోమం చేస్తున్నానని ప్రారంభంలో ప్రకటించి, కరోనా వ్యాప్తి చెందడంతో ఆశ్రమాన్ని మూసివేశారు. ప్రాణభీతికి ఎవరూ మినహాయింపు కాదు. మే 5వ తేదీ తర్వాత వైరస్‌ తగ్గుముఖం పడుతుందని చెబుతున్న స్వరూపానంద మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే!


కింకర్తవ్యం?

ఇక,  కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఆర్థికవేత్తలు రకరకాల అభిప్రాయాలు, అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ వాస్తవంలో ఏమి జరుగుతుందన్నదీ ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అని కొందరు విశ్లేషిస్తున్నారు. వైరస్‌ నివారణకు వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యల వల్ల ఉత్పత్తి కుంటుపడి, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయి.. అంతులేని నిరుద్యోగం వైపు పరిస్థితులు వెళుతున్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద ‘కరోనా ముందు– కరోనా తర్వాత’ అనే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. 1930లో ప్రపంచాన్ని పీడించిన మహా ఆర్థిక మాంద్యం కంటే ఇప్పటి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే 1930లో మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసినవారు ఇప్పుడు మన మధ్య లేరు. అప్పటికి మన దేశానికి స్వాతంత్య్రం కూడా రాలేదు. దేశమంతా ఒక్కటిగా లేదు. వివిధ సంస్థానాలు, రాజ్యాలు ఉండేవి.


ప్రపంచీకరణ అంటే తెలియదు కనుక ప్రపంచంతో సంబంధం లేకుండా అప్పుడు మన బతుకేదో మనం బతికి ఉంటాం! ఐరోపా దేశాలతోపాటు ఇతర పశ్చిమ దేశాలు మహా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికై భారీ ఎత్తున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను చేపట్టాయి. దీనివల్ల నగదు చెలామణిలోకి రావడమే కాకుండా ప్రజలకు ఉపాధి లభించింది. ఆయా దేశాలలో ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద రహదారులు, నిర్మాణాలు అప్పుడు చేపట్టినవేనని చెబుతారు. జాతీయ రహదారులతో ప్రతి మారుమూల ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించారు. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్టే కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గకపోయినా, నవంబరులో మళ్లీ విజృంభించినా యావత్‌ ప్రపంచం కుదేలవుతుంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఐరోపా దేశాలతోపాటు పశ్చిమ దేశాలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి ఏ వ్యూహం అనుసరిస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి తమతమ దేశాలలో నిరుద్యోగం ప్రబలకుండా ప్రైవేట్‌ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వాలే రెండు నెలల జీతాలు చెల్లించాలని నిర్ణయించాయి. కంపెనీలను ఆర్థికంగా ఆదుకోవడానికై ఆరు సంవత్సరాల తర్వాత చెల్లించే విధంగా 0.5 శాతం వడ్డీకే విరివిగా రుణాలు అందజేస్తామని ప్రకటించాయి. కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటే ఇంకేమి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తాయో తెలియదు. ఈ స్థాయిలో మన దేశం చేయగలదా అన్నదే ప్రశ్న! కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీల వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేలా ఉంది. లాక్‌డౌన్‌ మొదలై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ వలస కార్మికుల సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాం.


ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలు చూసుకోరన్న గ్యారంటీ లేదు. మన దేశంలో ప్రధాన పార్టీలు రూపొందించే విధానాలన్నీ ఓటుబ్యాంకు దృష్టితోనే అమలవుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్నే తీసుకుందాం. ఈ పథకం కింద ఇప్పటివరకు లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా చెప్పుకోదగ్గ నిర్మాణం ఒక్కటి కూడా జరగలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులకు ఉపశమనం కలిగించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఏ కారణం చేతనో పాలకులు పట్టించుకోవడం లేదు. పేదలకు ప్రస్తుత పరిస్థితులలో బియ్యం, నగదు పంపిణీ చేయడం వాంఛనీయమే అయినప్పటికీ మున్ముందు ఉపాధి కల్పనతోపాటు ఉత్పాదకత పెంచే దిశగా చర్యలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కరికి మూడు వంతున దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేదలు కానివారికి ఉచిత మాస్కులు ఎందుకు? ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలతో వందల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? నిజాం పాలనలో కరువు కాటకాలు వ్యాపించినప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించడానికై హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను తవ్వించారు.


ఇప్పుడంటే హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చాం గానీ, ఒకప్పుడు అది స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. దార్శనికత అంటే అది. 1930 దశకంలో ఐరోపా దేశాలు, పశ్చిమ దేశాలు చేసినట్టుగా ఇప్పుడు మన దేశంలో ప్రస్తుత పరిస్థితిని ఒక అవకాశంగా మలచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయిచేయి కలిపి ఉపాధి కల్పనతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు పూనుకుంటే మంచిది. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తమ జాతీయ స్థూల ఉత్పత్తి.. జీడీపీలో 9 ట్రిలియన్‌ డాలర్లు అంటే దాదాపు ఏడు వందల లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. ఇంత భారీ మొత్తాన్ని కోల్పోతున్న దేశాలు ఈ ఉత్పాతం నుంచి బయటపడటానికి ఏమి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. కరోనా వైరస్‌ వంటి మహమ్మారులు మున్ముందు కూడా ప్రపంచాన్ని పట్టి పీడించవచ్చు. అదే జరిగితే ఇప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం పడకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులు దృష్టిపెట్టడం అవసరం. కరోనా వ్యాప్తికి చైనా కారణం అని తిట్టుకుంటే సరిపోదు. భవిష్యత్తులో చైనా స్థానంలో ఇంకెవరో ఉండవచ్చు. జీవ, రసాయన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న, చేసిన దేశాలు ఇప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. మానవాళి వినాశనానికి మనమే ఆయుధాలను అభివృద్ధి చేయడం మానవత్వం కాజాలదు!

ఆర్కే



యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-04-19T05:54:49+05:30 IST