కోటి జనాభా ఉన్న గ్రేటర్‌లో కరోనా వ్యాప్తి తగ్గిందా..!?

ABN , First Publish Date - 2021-05-16T16:30:07+05:30 IST

కోటి జనాభా ఉన్న గ్రేటర్‌లో కరోనా వ్యాప్తి తగ్గిందా..? ..

కోటి జనాభా ఉన్న గ్రేటర్‌లో కరోనా వ్యాప్తి తగ్గిందా..!?

  • టెస్ట్‌లు తగ్గాయి.. పాజిటివ్‌ కేసులు కాదు..!
  • గ్రేటర్‌లో కొనసాగుతున్న వైరస్‌ వ్యాప్తి
  • పరీక్షల స్థాయిలో తగ్గని పాజిటివ్‌లు
  • వైరస్‌ నిర్ధారణ శాతంలో హెచ్చు, తగ్గులు
  • మరింత అప్రమత్తంగా ఉండాలంటోన్న నిపుణులు
  • గత నెలలో 22 నుంచి 23 శాతం
  • కొన్నాళ్లుగా 15-17 శాతం
  • 50 శాతం తగ్గిన టెస్ట్‌లు
  • ఆ స్థాయిలో తగ్గని పాజిటివ్‌లు

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో కొవిడ్‌ టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులు, యూపీహెచ్‌సీల్లో చేస్తోన్న పరీక్షలు 50 శాతం మేర తగ్గాయి. పాజిటివ్‌ కేసుల్లో మాత్రం ఆ స్థాయి తగ్గుదల కనిపించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 22-23 శాతం ఉండగా.. ఇప్పుడు 15-17 శాతంగా నమోదవుతోంది. వాస్తవంగా టెస్ట్‌ల సంఖ్య 50 శాతం తగ్గితే వైరస్‌ సోకుతున్న వారి సంఖ్యలోనూ అదే స్థాయి తగ్గుదల ఉండాలి. కానీ నగరంలో ఆ పరిస్థితి లేదు. పాజిటివ్‌ కేసుల్లో స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదవుతోంది. అంటే 11-12 శాతం పాజిటివ్‌ కేసులు నమోదు కావాల్సి ఉండగా.. 15 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.

 

కోటి జనాభా ఉన్న గ్రేటర్‌లో కరోనా వ్యాప్తి తగ్గిందా..? గతంలో 1,200- 1,500 కేసులు నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 700-800 లోపు ఎలా నమోదవుతోంది..? అంటే టెస్ట్‌లు తగ్గించడమే అన్నది సమాధానం. చేస్తోన్న పరీక్షలు.. పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే వైరస్‌ వ్యాప్తిలో చెప్పుకోదగ్గ స్థాయి మార్పు లేదు. రోజు రోజుకూ వందలు, వేల మంది నగరంలో వైరస్‌ బారిన పడుతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మెజార్టీ కోలుకుంటున్నారు. చాలా ఇళ్లలో ఒకరికి వైరస్‌ సోకితే కుటుంబ సభ్యులందరికీ వ్యాపిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రజలు భావిస్తున్నారని, కానీ వ్యాప్తిలో తగ్గుదల కనిపించడం లేదని, మరింత అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.


అంచనాలకు అందకుండా...

గ్రేటర్‌లో 126 యూపీహెచ్‌సీలు, 12 వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్‌ యాంటీజెన్‌ ర్యాపిడ్‌, ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. గతంలో నిత్యం 12 వేలు-14 వేల వరకు పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడా సంఖ్య 8-9 వేల లోపుగా ఉంది. అధికారిక లెక్కల్లో 20-25 శాతం వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నట్టు గత నెలలో చూపారు. వాస్తవంగా ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులే అంతర్గత సంభాషణల్లో అంగీకరించేవారు. గత వారం, పది రోజులుగా ఉన్న పళంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. పాజిటివ్‌ శాతంలోనూ స్వల్ప తగ్గుదల నమోదవుతోంది. వాస్తవంగా ఇప్పుడు కూడా కేసుల సంఖ్య భారీగానే ఉందని, అధికారికంగా చూపుతోన్నవి 50 శాతంలోపే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో వారం నుంచి క్రమేణా తగ్గుతూ వస్తోంది. మే 10న కేసులు 14 శాతంలోపు ఉండగా.. 12వ తేదీన తిరిగి 17 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. గత మూడు వారాల్లోనే వైరస్‌ వ్యాప్తిలో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. ఇది ప్రమాదకర సంకేతమని నిపుణులు చెబుతున్నారు.


ఫీవర్‌ సర్వే... 

గ్రేటర్‌లో పది రోజులగా ఇంటింటి ఫీవర్‌ సర్వే ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 5 లక్షలకుపైగా ఇళ్లలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసినట్టు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో జ్వరం, ఇతరత్రా కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమైన వైద్య సలహాలిస్తున్నారు. ఐదు రోజులకు సరిపడా కరోనా మెడిసిన్‌ కిట్‌ అందజేస్తున్నారు. సాధారణ జ్వరమైనా అవే మందులు వాడాలని, ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఒకవేళ వైరస్‌ ఒంట్లో ఉన్నా.. తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు.


ఏవైనా ఇబ్బందులు ఉంటే కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌, సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో వారిలో చాలా మంది టెస్ట్‌ల కోసం బయటకు రావడం లేదు. పాజిటివ్‌ కేసుల్లో చాలా మంది ఇళ్లలోనే వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నారు. జ్వరం ఉన్న వారిలో 25- 30 శాతం వరకు కొవిడ్‌ లక్షణాలు ఉంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. టెస్ట్‌ల ఫలితాల్లో నిర్ధారణ అవుతున్న పాజిటివ్‌ కేసులకు అది అదనం. ఈ నేపథ్యంలో నగరంలో వైరస్‌ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదని, పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాస్పత్రి వైద్యుడొకరు సూచించారు.

Updated Date - 2021-05-16T16:30:07+05:30 IST