డీసీఎంఎస్‌ సంగతేంటి?

ABN , First Publish Date - 2021-10-27T05:09:00+05:30 IST

రైతు సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్నదాతలకు అండగా నిలుస్తున్న డీసీఎంఎస్‌ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీని అభివృద్ధి చేయకుండా వాటి మనుగడకు ముప్పు తెస్తోంది. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) ఏర్పాటుతో వీటికి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.

డీసీఎంఎస్‌ సంగతేంటి?
అరసవల్లిలోని డీసీఎంఎస్‌ కార్యాలయం

- ఆర్‌బీకేల ఏర్పాటుతో గడ్డు పరిస్థితి

- మూసుకుపోయిన ఆదాయ మార్గాలు

- ఉద్యోగుల జీతాలకూ డబ్బులు కష్టమే

- దిక్కుతోచని స్థితిలో పాలక మండలి

(ఇచ్ఛాపురం రూరల్‌)

రైతు సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్నదాతలకు అండగా నిలుస్తున్న డీసీఎంఎస్‌ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీని అభివృద్ధి చేయకుండా వాటి మనుగడకు ముప్పు తెస్తోంది. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) ఏర్పాటుతో వీటికి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. డీసీఎంఎస్‌లు నిర్ణీత ధరకే నాణ్యమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో రైతులకు అందించేవి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవి.  దీనివల్ల కమీషన్‌ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆదాయంతో డీసీఎంఎస్‌లు ఆర్థిక పరిపుష్టిని సాధించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకేల ఏర్పాటు పేరిట డీసీఎంఎస్‌ సేవలకు చెక్‌ పెట్టింది. దీంతో ఆదాయం లేక డీసీఎంఎస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాలకవర్గ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆదాయమార్గాల కోసం అన్వేషిస్తున్నారు. డీసీఎంఎస్‌కు జిల్లాలో పొందూరు, అరసవల్లి, శ్రీకాకుళం కత్తెరవీధి, ఆమదాలవలస, పాలకొండ, వీరఘట్టం, చాపర, మెళియాపుట్టి, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, రణస్థలం తదితర ప్రాంతాల్లో సుమారు 16 ఎకరాల విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో గొడౌన్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి వాటి ద్వారా ఆదాయ మార్గాలు పెంచుకోవాలని పాలకమండలి సభ్యులు తీర్మానించారు. 


ఆందోళనలో ఉద్యోగులు : 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా విస్తృత సేవలు అందేవి. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో తమ భవిష్యత్‌ ఏమిటో అర్థం కావడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ ఊపిరి సలపకుండా బాధ్యతలు నిర్వర్తించిన డీసీఎంఎస్‌ కేంద్రాల ఉద్యోగులు ప్రస్తుతం పనిలేక ఖాళీగా కూర్చుంటున్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లను ఆర్బీకేల వద్దనే నిర్వహించాలని వీరికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే పరిస్థితి ఏర్పడితే డీసీఎంఎస్‌ కేంద్రాలు మూత పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా అన్ని ప్రయోజనాలు అందిస్తామని చెబుతున్నా.. ఆచరణకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్‌ కేంద్రాల సేవలను కూడా కొనసాగించాలని కోరుతున్నారు. 


ఆదాయం తగ్గింది  

 ఆర్‌బీకేల ఏర్పాటు తర్వాత గతం కంటే ఆదాయం తగ్గిన మాట వాస్తవమే. డీసీఎంఎస్‌కు జిల్లాలో విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటిల్లో గొడౌన్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

- పి.లక్ష్మణరావు, బిజినెస్‌ మేనేజర్‌ (ఎఫ్‌ఎసీ), డీసీఎంఎస్‌, శ్రీకాకుళం

Updated Date - 2021-10-27T05:09:00+05:30 IST