Abn logo
Jul 7 2020 @ 00:35AM

ప్రజాస్వామ్యం మనకు అచ్చిరాదా?

పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల ఐశ్వర్యం, మూడో ప్రపంచ దేశాల పేదరికం ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు వంటివి. ప్రజాస్వామిక పాలన మౌలికంగా అసమర్థమైనది. ఏ విదేశీ ప్రజలనూ దోపిడీ చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతులతోనే సుపరిపాలన, ఆర్థికాభివృద్ధిని సుసాధ్యం చేసుకోవడమే ఇప్పుడు మనముందున్న ఒక పెద్ద సవాల్.


చైనాఆర్థిక శక్తికి కారణమేమిటి? నియంతృత్వ పాలనా పద్ధతులేనా? ప్రజాస్వామ్య విధానాలను నిర్లక్ష్యం చేయడం తగదని బీజింగ్ ప్రభువులను పాశ్చాత్య దేశాలు పదే పదే హెచ్చరిస్తుంటాయి. నిరంకుశాధికారాల చెలాయింపు అంతిమంగా ఎనలేని హాని చేస్తుందని కూడా ఆసియా అగ్రరాజ్యానికి ఆ సంపన్న దేశాలు సుదీర్ఘోపన్యాసాలు వెలువరిస్తుంటాయి. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యానికి, అవి ఇతర దేశాలలో చేస్తున్న దోపిడీకి మధ్య అవినాభావ సంబంధముందనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవల్సివున్నది. 


పాశ్చాత్య ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా స్వామిక వ్యవస్థ ప్రాచీన గ్రీసులో విలసిల్లింది. గ్రీకు నగర రాజ్యాలు తరచు ఇరుగు పొరుగు నగర రాజ్యాలపై దండయాత్రలు చేసి వాటి సిరిసంపదలను దోచుకోవడం పరిపాటిగా ఉండేది. ఈ దోపీడీలతో లభ్యమైన సంపద ఆధారంగానే గ్రీకునగర రాజ్యాలలో ప్రజాస్వామ్యం పనిచేసింది. సుదీర్ఘ ‘ప్రజాస్వామిక’ చర్చలలో సంపన్నులకేగానీ, సామాన్యులకు స్థానముండేది కాదు. గ్రీసుకు పొరుగున ఉన్న రాజ్యాలు ఉక్కు ఆయుధాలను సమకూర్చుకోవడంతో తమ ఇష్టానుసారం యుద్ధాలకు ఉపక్రమించడం గ్రీకు నగరరాజ్యాలకు అసాధ్యమైపోయింది. తత్ఫలితంగా ప్రాచీన గ్రీసులో ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోయింది. రోమన్ సామ్రాజ్యం కూడా తన సరిహద్దులకు వెలుపలి రాజ్యాలను నిత్యం దోపిడీ చేస్తుండేది. రోమన్ సైన్యాలు తీసుకొచ్చిన సిరిసంపదలే రోమ్ ఐశ్వర్యానికి ఆలవాలంగా ఉండేవి. ఆక్రమించుకోవడానికి, దోపిడీ చేయడానికి కొత్త రాజ్యాలేవీ అందుబాటులో లేకపోయినప్పుడు రోమన్ ప్రజాస్వామ్యం అనివార్యంగా పతనమయింది. అమెరికాలో ప్రజాస్వామ్యం 19వ శతాబ్ది వరకూ, పశ్చిమ రాష్ట్రాలలో కొత్తగా కనుగొన్న బంగారు గనులు, చమురు నిక్షేపాలపై ఆధారపడి విలసిల్లింది. అమెరికా మూల వాసులను దాదాపుగా తుదముట్టించడం, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్ల జాతి ప్రజలను అమానుషంగా దోపిడీ చేయడం కూడా ఆనాటి అమెరికన్ ప్రజాస్వామ్యానికి ప్రధాన కారణాలుగా చెప్పితీరాలి. ఇరవయో శతాబ్దంలో పేద దేశాల సహజ వనరులను స్వాయత్తం చేసుకోవడానికి అమెరికా చాలా యుద్ధాలు చేసింది. ఇతర దేశాలలో ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్న నాయకులను హతమార్చి, (చిలీలో అలెండె హత్య ఇందుకొక ఉదాహరణ), తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకున్నది. 


ఇరవయో శతాబ్ది తుదినాళ్ళలో ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా పేటెంట్ల పరిరక్షణ విధానాలు అమలులోకి రావడంతో అప్పట్లో సాంకేతికతల అభివృద్ధిలో అగ్రగాములుగా ఉన్న అమెరికన్ బహుళజాతి కంపెనీలు ఇతోధికంగా లబ్ధి పొందాయి. తద్వారా అమెరికా ఆర్థికంగా మరింతగా బలోపేతమయింది. పశ్చిమాసియాలో నిత్యం యుద్ధాలు చేసుకొంటున్న దేశాలకు ఆయుధాలు విక్రయించడం, చౌకగా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా కూడా ఆ కంపెనీలు అపార లాభాలు ఆర్జించాయి. పేటెంట్ హక్కులే వాటి వ్యాపార విజయాలకు ఆలంబన అయ్యాయి. 


ఏ దేశాలకయితే బాహ్య ఆదాయ ఆధారాలు అంటే విదేశాల నుంచి ఆదాయాలను సమకూర్చుకునే వెసులు బాటు ఉన్నదో ఆ దేశాలలోనే ప్రజాస్వామ్యం సఫలమయినట్టుగా కన్పిస్తున్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల ఐశ్వర్యం, మూడో ప్రపంచ దేశాల పేదరికం అనేవి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు వంటివి. వాస్తవమిదయినప్పుడు అభివృద్ధిచెందుతున్న దేశాలలో ప్రజాస్వామిక పాలనా విధానాలు ఆర్థికాభివృద్ధి సాధనకు దోహదం చేసేందుకు ఆస్కారం లేదు. పేటెంట్లు, న్యాయవిరుద్ధ వాణిజ్యంతో దేశ సంపద అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోతున్నప్పుడు, ప్రజలు ప్రజాస్వామ్య పాలనకు ‘విధేయంగా’ ఉండడం అసాధ్యం. ఇలా అంటున్నానంటే నియంతృత్వ పాలనను ఆమోదించడం ఎంత మాత్రం కాదు. అంతిమ సత్యమేమిటి? ప్రజాస్వామ్య విధానాలు గానీ నియంతృత్వ పద్ధతులు గానీ సుపరిపాలన నందించలేవు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) ‘మానవాభివృద్ధి నివేదిక -2010’ ఇలా పేర్కొంది: ‘ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తొలిరోజుల్లో కంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన పురోగతిపై ఆశాభావం ఎందుకు తగ్గిపోయింది? ఉల్లాసకర పరిస్థితులు ఎందుకు క్షీణించాయి? చాలా దేశాలలో ప్రజాస్వామ్యం సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచలేదు. తూర్పు యూరోపియన్ దేశాలు, విచ్ఛిన్న సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాలలో ప్రజల ఆదాయాలలో అసమానతలు పెరిగిపోయాయి. దారిద్ర్యం మరింతగా పెచ్చరిల్లింది. మున్నెన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్న సబ్- సహారన్ ఆఫ్రికా దేశాలలో పేదరికం ఇతోధికమయింది. లాటిన్ అమెరికాలో కొత్తగా ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు తమకు ముందు అధికారంలోఉన్న నియంతల కంటే సమర్థ పాలన నందించలేకపోతున్నాయి. పేదరికం, అసమానతల నిర్మూలనలో ఘోరంగా విఫలమవుతున్నాయి’. 


మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజాస్వామ్యాన్ని పారిశ్రామిక దేశాలు ఎందుకు అంత గట్టిగా ప్రోత్సహిస్తున్నాయి? ప్రజాస్వామిక దేశాల నాయకులను సులువుగా కొనివేసేందుకు అవకాశం ఉండడమే కాదూ? ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రజాస్వామిక నేతలకు భారీ నిధులు అవసరం. ఈ సొమ్మును సొంత దేశంలో సొంత ప్రజల నుంచి సమకూర్చుకోవడం కంటే విదేశాల నుంచి ముడుపుల రీత్యా అందే అవినీతి డబ్బును స్వీకరించడమే వారికి అన్నివిధాల శ్రేయస్కరం. ఇలా వర్థమాన దేశాల ప్రజాస్వామిక నేతలను సంపన్న పాశ్చాత్య దేశాలు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాయి. ప్రజాస్వామ్య విధానాలను త్యజించి నియంతృత్వ పాలనా పద్ధతులను అనుసరించడమే మేలని నేనేమీ వాదించబోవడం లేదు. అయితే ప్రజాస్వామ్యంతో సుపరిపాలన స్వతస్సిద్ధంగా సమకూరదనే సత్యాన్ని మనం గుర్తించితీరాలి. నియంతృత్వ వ్యవస్థల్లో కంటే ప్రజాస్వామిక సమాజాలలో సుపరిపాలన చాలా కష్టసాధ్యమైన విషయం. ప్రజాస్వామ్యం మన సమస్యలను పరిష్కరించగలదని గుడ్డిగా విశ్వసించడం తగదు. నియంతృత్వ పాలన వల్ల చైనా ఇప్పుడు లబ్ధి పొందుతున్నా అంతిమంగా తన వైభవాన్ని కోల్పోగలదని భావించడమూ సబబు కాదు. ప్రజాస్వామ్య పాలన మౌలికంగా అసమర్థమైనది. అయితే ఇతర దేశాల నుంచి అందే భారీ ఆర్థిక వనరులతో ఈ అప్రయోజకత్వాన్ని మనం కప్పిపుచ్చుకోవచ్చు. ఏ విదేశీ ప్రజలనూ దోపిడీ చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతులతోనే సుపరిపాలన, ఆర్థికాభివృద్ధిని సుసాధ్యం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు మనముందున్న ఒక పెద్ద సవాల్.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...