వార్తలకు గూగుల్‌, ఫేస్‌బుక్‌ డబ్బులు చెల్లిస్తాయా?

ABN , First Publish Date - 2020-05-23T11:27:21+05:30 IST

ఈడిజిటల్ యుగంలో అన్నపానీయాలు లేకపోయినా బ్రతకగలరేమోగాని గూగుల్, ఫేస్ బుక్ లేకుండా మాత్రం క్షణం గడవడం లేదు – ముఖ్యంగా యువతరానికి! ఈ ప్రక్రియలో మనం వాటిపై ఎంతగా సమయాన్ని వెచ్చిస్తే డిజిటల్ మీడియాకు ఆర్థికంగా

వార్తలకు గూగుల్‌, ఫేస్‌బుక్‌ డబ్బులు చెల్లిస్తాయా?

ఈడిజిటల్ యుగంలో అన్నపానీయాలు లేకపోయినా బ్రతకగలరేమోగాని గూగుల్, ఫేస్ బుక్ లేకుండా మాత్రం క్షణం గడవడం లేదు – ముఖ్యంగా యువతరానికి! ఈ ప్రక్రియలో మనం వాటిపై ఎంతగా సమయాన్ని వెచ్చిస్తే డిజిటల్ మీడియాకు ఆర్థికంగా అంత లాభం. మనకు పోయేది వెనక్కి రాని కాలం, వాటికి వచ్చేది డబ్బు! డిజిటల్ ఎడ్వర్టైజింగ్ రంగం క్రిందటి సంవత్సరం సుమారు 300 బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తే అందులో గూగుల్ ఆదాయం సుమారు 136 బిలియన్ డాలర్లు, ఫేస్ బుక్ ఆదాయం సుమారు 70 బిలియన్ డాలర్లు అని ఒక అంచనా. ఆ మిగిలిందే మిగిలిన కంపెనీలు పంచుకున్నాయి. ఈ లెక్కలు ఎందుకంటే వీటి ఆధారంగానే ఆస్ట్రేలియా ఇప్పుడు ఒక చరణాకోల అందుకుంది. ఆర్థికంగా ఊబిలో కూరుకుపోయిన ఆస్ట్రేలియా పత్రికా రంగాన్ని గట్టెక్కించడానికి గూగుల్, ఫేస్ బుక్ ముందుకు రావాలని హుకుం జారీ చేసింది. దీని నేపథ్యం ఏమంటే ప్రతిరోజూ వార్తా పత్రికలలో వచ్చే వార్తలను కూడా ఒక సరకుగా మార్చేసి వాటిని పాఠకులకు ఉచితంగా అందిస్తూనే గూగుల్, ఫేస్ బుక్ బిజినెస్ చేస్తున్నాయి. ఈ బిజినెస్ లో వీరి పెట్టుబడి రూపాయి కూడా లేదు. అంతర్జాలాన్ని విస్తృతంగా వినియోగించేవారికి అడుగడుగునా వాణిజ్య ప్రకటనలు దర్శనం ఇస్తుంటాయి. వీటిని పాఠకులు క్లిక్ చేస్తే గూగుల్‌కి డబ్బులు వస్తాయి. పాఠకులు అందరూ వాటిని క్లిక్ చేయకపోవచ్చు, క్లిక్ చేసేది కొందరే కావచ్చు. ఆ కొందరి వల్లే రోజుకి గూగుల్ సంపాదించేది సుమారు 100 మిలియన్ డాలర్లు, ఫేస్ బుక్ సంపాదించేది సుమారు 30 మిలియన్ డాలర్లు అని ఒక లెక్క తేలింది! లెక్కలు చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రచురణకర్తలు ఖిన్నులవుతున్నారు. అందుకు కారణం డిజిటల్ మీడియా ప్రాశస్త్యం పెరుగుతున్నకొద్దీ ఆర్థికంగా సంప్రదాయ ప్రచురణ రంగం బలహీనపడిపోతోంది.


అంతర్జాలం వచ్చిన తొలిరోజుల్లో పాఠకులు తమకు కావలసిన ఏ సమాచారాన్నయినా గూగుల్‌లో వెదుక్కునేవారు. పాఠకుల అన్వేషణే పెట్టుబడిగా గూగుల్ తమ సెర్చ్ ఇంజన్ ను ఈ రెండు దశాబ్దాలలో మరెవ్వరూ అందుకోలేనంత పకడ్బందీగా బలోపేతం చేసింది. ఇప్పుడు గూగుల్‌లో కరోనా వైరస్ అనే మాటను మనం అన్వేషిస్తే ఈ అంశంపై అర సెకండులో సుమారు 250 కోట్ల అంతర్జాల పుటలు బయటకువస్తాయి. కావలసిన పుటలను విజ్ఞతతో ఎంపిక చేసుకుని చదువుకోవడమే పాఠకులు చేయవలసింది. ఇంత శక్తి సామర్థ్యాలు మరే సెర్చ్ ఇంజన్‌కూ లేవు. ఆ తర్వాత కాలంలో గూగుల్ దినపత్రికలలో వచ్చే వార్తలను వెదికే సౌకర్యాన్ని కల్పించింది. అప్పటికీ వార్తాపత్రికల ప్రచురణకర్తలు గూగుల్‌ను డబ్బును సృష్టించే సాంకేతిక వేదికగా చూడలేదు. గూగుల్‌లో తమకంటూ ఒక స్థానం లభించడమే గొప్పగా భావించిన రోజులవి. ఎవరు ఎంత ముఖ్యమైన వార్తను ఎంత తొందరగా అంతర్జాలంలో ప్రచురిస్తే దానికి గూగుల్‌లో అంత ప్రాధాన్యం లభించేది. ఫలితంగా వార్తల పరంగా పత్రికల మధ్య విషయ సంబంధమైన పోటీ పెరిగింది. కాబట్టి గూగుల్‌లో ఎంత పై స్థానాన్ని సంపాదించగలిగితే అంత జనాదరణ అనే అభిప్రాయానికే ప్రచురణ రంగం పరిమితమైపోయింది గాని ఇందులో బిజినెస్ ఉందని గ్రహించలేదు. ఆ అవగాహన వచ్చేసరికి సామాజిక మాధ్యమాలు తమకు తామే ప్రచురణ రంగానికి మహారాజులైపోయాయి. తాము చెప్పేందే వేదం అన్నట్టు టెక్ జయింట్, సోషల్ మీడియాల శక్తి పెరిగిపోయింది.


ఇప్పుడు గూగుల్ ఏమంటున్నదంటే తాము విక్రయించేది వాణిజ్య ప్రకటనలనేగాని పాఠకులు అన్వేషించే అంశాన్ని కాదని! ఇది నిజమే గాని పాఠకుని అన్వేషణ ఒక అంశం తర్వాత మరో అంశానికి ఒక గొలుసులా పోతున్నప్పుడు పాఠకుడు వెచ్చించే సమయం అనివార్యంగా వార్తల మధ్య, వాణిజ్య ప్రకటనల మధ్య అటు ఇటు ఊగిసలాడుతుంది. అదే గూగుల్‌కి డబ్బు తెచ్చిపెడుతుంది. అలాగే ఫేస్ బుక్ కూడా. మొబైల్ ఫోన్ పై వినియోగదారులు ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. వాటిని పాఠకులు తెరిచి చూస్తేనే సోషల్ మీడియా వేదికలకు డబ్బులు వస్తాయి. మరి ఈ నేపథ్యంలో వార్తా పత్రికలకు నిజంగానే వీరు డబ్బులు చెల్లించడం లేదా అంటే చెల్లిస్తున్నాయి గాని ఆ మొత్తం చాలా చాలా తక్కువ. ఆ తక్కువ మొత్తాన్ని వీరే నిర్ణయిస్తారు గాని ప్రచురణకర్తలు కారు. ఎందుకంటే గూగుల్ ఎంత ఇస్తే అంత తీసుకోవలసిందే. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది కదా – భిక్షాటనకు వచ్చినవారు నాకు ఇది కావాలి, అది కావాలి అని ఎంచుకోవడానికి అనర్హులు అని, ఎవరు ఏది ఎంత పెడితే అదే స్వీకరించి ఆకలి తీర్చుకోవాలి, ఇదే తంతు ఇక్కడ కూడా వర్తిస్తుంది! కింకర్తవ్యం?


ఈ కథ ఇప్పుడు మొదలైంది కాదు. ఇంతకుముందు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కూడా గూగుల్‌ను ఇలాగే ప్రచురణకర్తలు నష్టాలలో ఉన్నారు కాబట్టి కాస్త మెరుగైన పద్ధతిలో డబ్బులు చెల్లించమని కోరాయి. స్పెయిన్ అయితే దాదాపు ఆరేళ్ల క్రితమే ఆర్థిక సమస్యలను వివరిస్తూ వార్తలను గూగుల్ సంగ్రహంగా వాడుకుంటున్నందున తమ ప్రచురణకర్తలకు డబ్బు చెల్లించాలని కోరితే గూగుల్ స్పెయిన్‌లో ఏకంగా తమ వార్తా విభాగాన్నే మూసేసింది. గూగుల్ వాడుకునే వార్తలకు ప్రచురణకర్తలు రాయల్టీ కోరవచ్చునంటూ యూరోపియన్ యూనియన్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారమే డబ్బు చెల్లించాలని గూగుల్‌ను ఫ్రాన్స్ అభ్యర్థించింది. వార్తలు ప్రచురించి అంతర్జాలంలో జనాదరణ పెంచుతున్న తమను మళ్లీ అదనంగా డబ్బు అడుగుతారా అని గూగుల్ సంగ్రహంగా వార్తలు ఇచ్చే పద్ధతికే ఫ్రాన్స్‌లో స్వస్తి చెప్పింది. ఈ రెండు దేశాల అనుభవాలు ఇలా ఉంటే జర్మనీ అనుభవం మరో రకంగా ఉంది.


ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఏదైనా ఒక పుస్తకాన్ని రాసి ప్రచురిస్తే వాటి ప్రచురణ కర్త నుంచి లేదా రచయిత నుంచి అనుమతి లేకుండా అందులోని విషయాన్ని ఎవరూ వాణిజ్య ప్రయోజనాలకోసం ఉపయోగించుకోరాదు. అలా ఉపయోగించుకుంటే అది కాపీ రైట్ చట్టం ప్రకారం గ్రంథ చౌర్యం క్రిందికి వస్తుంది. జర్మనీలో కూడా ఇటువంటి చట్టం ఉంది. దాని ఆధారంగా సుమారు 200 మంది ప్రచురణ కర్తలు క్రిందటి సంవత్సరం గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ కోర్టుకు ఈడ్చారు. తమ వార్తలను తమకు చెప్పకుండానే సంగ్రహ రూపంలో వినియోగించుకుంటూ డబ్బు సంపాదిస్తున్నందున 120 కోట్ల డాలర్లను తమకు నష్టపరిహారంగా గూగుల్ చెల్లించాలన్నది వీరి వాదన. అయితే కోర్టులో ప్రచురణ కర్తల వాదన వీగిపోయింది. ఎందుకంటే అటువంటి చట్టం ఒకటి ఉన్నట్టు జర్మనీ యూరోపియన్ యూనియన్ కమిషన్ కు చెప్పలేదట! ఆయా దేశాలు చేసిన తప్పులు మనం చేయవద్దని ఆస్ట్రేలియా ఇప్పుడు చాలా జాగ్రత్తగా గూగుల్, ఫేస్ బుక్‌ల ముక్కు పిండే పనిలో పడింది. ప్రభుత్వమే ఈ పనికి పూనుకోవడానికి కారణం ఆస్ట్రేలియా ప్రచురణ రంగం సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. ఈ ఊబిలో నుంచి బయటపడడం కష్టమని భావించి రుపర్ట్ ముర్డోక్‌కు చెందిన న్యూస్ కార్ప్ ఏకంగా 60 పత్రికల ముద్రణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.


(అమెరికాలోనూ ఈ పరిస్థితి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పాత్రికేయులు వేల సంఖ్యలో ఉపాధికోల్పోయే పరిస్థితి త్వరలో రాబోతోంది అని అంతర్జాతీయ సర్వేలు హెచ్చరిస్తున్నాయి.) వాణిజ్య ప్రకటనల డబ్బు మొత్తాన్ని గూగుల్, ఫేస్ బుక్ కొల్లగొట్టుకుపోతున్నాయంటూ స్థానిక ప్రచురణ సంస్థలు రెండేళ్ల క్రితమే మొరపెట్టుకోవడంతో ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా కాంపిటిషన్ అండ్ కన్జూమర్ కమిషన్ (ఎ.సి.సి.సి.) అన్ని వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన ఆదాయాల గణాంక వివరాలను సేకరించి విశ్లేషించింది. ఆ వివరాలు చూస్తే కమిషన్‌కు దిగ్భ్రమతో కళ్లు అంటుకున్నాయి. 2001–-2016 మధ్య కాలంలో ఆస్ట్రేలియా పత్రికా రంగం వాణిజ్య ప్రకటనల ఆదాయం 235 కోట్ల డాలర్ల నుంచి 143 మిలియన్ డాలర్లకు పడిపోయినట్టు తేలింది. విషయం ఇంత స్పష్టంగా తేలిపోవడంతో గూగుల్, ఫేస్ బుక్ తమ లాభాలను పంచవలసిందేనంటూ ఈ కమిషన్ క్రిందటి సంవత్సరం ఆదేశించింది. ఇందుకు 11 నెలల గడువు కూడా ఇచ్చింది. ఆస్ట్రేలియాలో వాణిజ్య ప్రకటనలపై ఎడ్వర్టైజర్లు చెల్లించే ప్రతి 100 డాలర్లలో 47 డాలర్లు గూగుల్‌కి, 24 డాలర్లు ఫేస్ బుక్‌కి పోతే మిగిలిన 29 డాలర్లను మిగిలిన వారంతా పంచుకుంటున్నారని కూడా లెక్కలు వెల్లడికావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా మరింతగా తన అస్త్రాలకు పదును పెడుతోంది. జర్మనీ ప్రచురణ కర్తలు చేసిన తప్పును తాను చేయకూడదని ఆస్ట్రేలియా పోటీ అనే మాటను తీసుకువస్తోంది.


ఒకే వార్తను రకరకాల డిజిటల్ మీడియాలు తమ వేదికలపై ప్రచురించి వాటి మధ్యే పోటీ పెట్టి ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తుండడం వల్ల వార్త మూల ప్రచురణ కర్తలకు కూడా ఆయా లాభాలలో భాగస్వామ్యం ఉండాలన్నది బహుశ భవిష్యత్తులో ఆస్ట్రేలియా వాదన కావచ్చు. అమెరికా కూడా త్వరలోనే ఇటువంటి చట్టాన్ని ఒకటి తీసుకురావాలని భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బహుశ ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రచురణకర్తలకు కొన్ని మార్గదర్శక సూత్రాలు లభించవచ్చు. మరి ఈ సంక్షోభ సమయాన భారత్ సంగతేమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈమధ్యే ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ (ఐ.ఎన్.ఎస్) భారత సమాచార శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ భారత వార్తా ప్రచురణ రంగం ఇప్పటికే 4000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని, కరోనా వైరస్ వల్ల జరగబోయే నష్టం రాబోయే ఆరేడు నెలల కాలంలో 15 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభు త్వం ఆదుకోవాలని సొసైటీ కోరింది. న్యూస్ పేపర్స్ సొసైటీ అంతటితో ఆగకుండా గూగుల్, ఫేస్ బుక్‌ల నుంచి మరింత గౌరవప్రదమైన రాయల్టీ ఇప్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరవలసిన తరుణం ఆసన్నమైంది. మరి గూగుల్, ఫేస్ బుక్ ఒక మెట్టు దిగి వస్తాయా? లేక యూరప్‌లో లాగానే ఇండియాలో కూడా మొండి వైఖరిని అవలంబిస్తాయా?


జగన్, సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2020-05-23T11:27:21+05:30 IST