‘మూడెకరాలు’ అందని ద్రాక్షేనా?

ABN , First Publish Date - 2021-10-18T05:48:16+05:30 IST

‘దళితులకు మూడెకరాల భూమి ఉండాలన్నాం.. తప్ప ఇస్తామనలేదు’ అని ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తేల్చి చెప్పడంతో దళితులు తమ ఆత్మగౌరవాన్ని పెంచుతుందనుకున్న పింత భూమిపై ఆశలు వదులుకుంటున్నారు.

‘మూడెకరాలు’ అందని ద్రాక్షేనా?

- దళితుల్లో నిరాశ, నిస్పృహలు

- ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల కుటుంబాలు

- పథకంపై ఆశలు వదులుకుంటున్న వైనం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

‘దళితులకు మూడెకరాల భూమి ఉండాలన్నాం.. తప్ప ఇస్తామనలేదు’ అని ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తేల్చి చెప్పడంతో దళితులు తమ ఆత్మగౌరవాన్ని పెంచుతుందనుకున్న పింత భూమిపై ఆశలు వదులుకుంటున్నారు. భూమి కొనుగోలు పథకం లేదు.. నియోజకవర్గానికి ఏటా వంద కుటుంబాలకే దళితబంధు ఇస్తామనడంతో తమకు ఆ లబ్ధి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితుల్లో నిరుపేద దళితులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల సాగుకు యోగ్యమైన భూ వసతి కల్పిస్తాం, సాగుకు కావాల్సిన నీరు, కరెంట్‌, విత్తనాలు, మొదటి ఏడాదికి కావాల్సిన పెట్టుబడి, తదితర సదుపాయాలను అందిస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో భూమిలేని నిరుపేద దళిత కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత వ్యవసాయ భూమి తమలో ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని వారు ఆశించారు. గడిచిన ఏడేళ్లలో ఈ పథకం నత్తకు నడక నేర్పుతూ అంతంత మాత్రంగానే అమలు జరగడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో దళితులకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. 

ఫ పెరిగిన భూమి ధరలు

ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు ఏడు లక్షల ధరకు భూములు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో భూమి కొనుగోలు పథకం ఉండీ లేని చందంగా మారింది. ఒక్కో దళిత కుటుంబానికి ఏడు లక్షల రూపాయల చొప్పున మూడెకరాల భూమి కొనుగోలుకు 21 లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చించేందుకు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కడా భూమి లభ్యం కావడం లేదు. దీంతో దళితులు 21 లక్షల రూపాయలకు ఎకరం, ఎకరంన్నర భూమి వచ్చినా కొనుగోలు చేసి ఇవ్వాలని కోరుతున్న సమయంలో అసలు మూడెకరాల భూమి తాము ఎవరికి ఇస్తామనలేదని, మూడు ఎకరాల భూమి ఉండాలని మాత్రమే అన్నామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో పేర్కొనడంతో ఇప్పుడు ఈ పథకం ఉన్నట్లా లేనట్లా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ ఉమ్మడి జిల్లాలో 337 మందికే లబ్ధి

2014-15లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని అమలులో పెట్టింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 33.39 లక్షల జనాభా ఉండగా 6.04 లక్షల జనాభా దళితులదే. 18 శాతం జనాభా ఉన్న దళిత కుటుంబాల సంఖ్య లక్షా 50 వేలకుపైగా ఉంటుంది. మూడెకరాల భూమి పథకం అమలు చేసిన ఏడేళ్లలో కేవలం 337 కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. ఈ కుటుంబాలకు 843 ఎకరాల భూమిని 38 కోట్ల 29 లక్షల 64 వేల రూపాయలతో కొనుగోలు చేసి అందించారు. అర శాతం కుటుంబాలకు కూడా ఈ పథకం ప్రయోజనం అందలేదు. కరీంనగర్‌ జిల్లాలో 57 దళిత కుటుంబాలకు 152.08 ఎకరాల భూమిని 8 కోట్ల 40 లక్షల 17 వేల రూపాయలు వెచ్చించి సమకూర్చారు. పెద్దపల్లి జిల్లాలో 75 కుటుంబాలకు 178.15 ఎకరాల భూమిని 4 కోట్ల 32 లక్షల 96 వేల రూపాయలతో, జగిత్యాల జిల్లాలో 40 కుటుంబాలకు 77.28 ఎకరాల భూమి 3 కోట్ల 88 లక్షల 61 వేల రూపాయలతో కొనుగోలు చేసి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 165 కుటుంబాలకు 436.02 ఎకరాల భూమిని 21 కోట్ల 67 లక్షల 32 వేల రూపాయలు వెచ్చించి సమకూర్చారు. ఈ 337 దళిత కుటుంబాలకు భూమి సమకూర్చడమే కాకుండా మొదటి సంవత్సరం పంట సాగు కోసం ఆర్థిక సహాయం, భూమి చదును చేసుకోవడానికి అవసరమైన డబ్బును అందించడమే కాకుండా బోరు బావులు కూడా వేయించి విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. 

ఫ పథకంపై సందేహాలెన్నో..?

ప్రతి గ్రామం నుంచి భూమిలేని నిరుపేద దళితులు తమకు ఈ పథకం కింద భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్‌లో దరఖాస్తులు చేసుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూమి విక్రయించడానికి  ముందుకు రాలేదు. ఈ పథకం అమలు చేయడానికి ఒక్కో కుటుంబానికి 21 లక్షల రూపాయలు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆ మొత్తంతో ఎంత భూమి వస్తే అంత భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని దళితులు కోరుతున్నారు. ఇప్పుడు భూమి కొనుగోలు పథకం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ఫ హుజూరాబాద్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో వంద మందికే ‘దళితబంధు’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి శాశ్వత ఉపాధిని కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో 23 వేలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు గుర్తించి 15 వేల కుటుంబాలకు చెందిన యజమానుల ఖాతాల్లో 9 లక్షల 90 వేల రూపాయల చొప్పున జమ చేశారు. త్వరలోనే అన్ని కుటుంబాలకు ఆ సహాయం అందుతుందని చెబుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టులో సంపూర్ణ స్థాయిలో పథకాన్ని అమలు చేసి ఇక్కడి అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 119 నియోజకవర్గాల్లో హుజూరాబాద్‌ను మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సంవత్సరం వంద కుటుంబాలకు దళిత బంధు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఏటా 11,800 దళిత కుటుంబాలకు దళితబంధు సహాయం అందనున్నది. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు మాత్రమే సహాయం అందనున్నందున తమకు ఆ సహాయం అందడానికి ఎన్నేళ్లు పడుతుందో అని దళితులు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు పథకం అమలు చేస్తూనే భూమి కొనుగోలు పథకాన్ని కొనసాగించాలని, 21 లక్షలకు ఎంత భూమి వస్తే అంత భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని దళితులు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-18T05:48:16+05:30 IST