‘గ్రేటర్‌’ ఎన్నికలే కొంప ముంచాయా!?

ABN , First Publish Date - 2021-05-10T06:53:45+05:30 IST

ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా..

‘గ్రేటర్‌’ ఎన్నికలే  కొంప ముంచాయా!?

ఏప్రిల్‌ నుంచి తీవ్రంగా పెరిగిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య

ప్రచారంలో పాల్గొన్న వందలాదిమందికి కొవిడ్‌

కమిషనర్‌ సహా 8 మంది కార్పొరేటర్లకు పాజిటివ్‌ 

ఆరు రోజుల్లో 1879 కేసుల నమోదు

నగరం నుంచి పల్లెబాట పట్టిన రోగం


వరంగల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక తర్వాత  ఆ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగాయి. ఫిబ్రవరి 16న నాగార్జున సాగర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. మార్చి 17న ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు నాగార్జున సాగర్‌లో మకాం వేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, నాటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, నేటి ఎమ్మెల్యే నోముల భగత్‌కు సైతం కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే మునిసిపల్‌ ఎన్నికల నగారా మో గింది. ఏప్రిల్‌ 16 ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా మే 3న ఎన్నికల ఫలి తాలు వెలువడ్డాయి. పది రోజుల పాటు గ్రేటర్‌ వరంగల్‌లోని డివిజన్లల్లో వందల సంఖ్యల్లో కార్యకర్తలు ప్రచార హోరు కొనసాగించారు. దీంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. గ్రేటర్‌ వరంగల్‌  మునిసిపల్‌ కమిషనర్‌  పమేల సత్పతి సహా 8 మంది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఇతర సిబ్బంది సైతం కరోనా బారిన పడ్డారు. కరోనాతో బాధపడుతున్న కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కా ర్యక్రమానికి కూడా హాజరు కాలేక పోయారు. కార్పొరేటర్ల గెలుపు కోసం తిరి గిన వందలాది మంది కార్యకర్తలు ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. వీరి ద్వారా కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు.


ఇదీ లెక్క.. 

అధికారిక లెక్కల ప్రకారం గత మార్చి నెలలో నిర్వహించిన కరోనా టెస్ట్‌ల్లో ఒక్క రోజు గరిష్ఠంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు మించలేదు. మరణాలు నమోదు కాలేదు. మార్చి 1వ తేదీన 61 ఆర్టీపీసీఆర్‌,  2398 రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తే 8 మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మార్చి నెల అంతా రెండు రకాల టెస్ట్‌లు కలిపి  ఒక్క రోజులో 2000 చొప్పున నిర్వహి స్తే సగటున 10 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 


గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల సందడి కొనసాగిన ఏప్రిల్‌ నెలలో మాత్రం ప దుల సంఖ్య నుంచి వందల సంఖ్యకు పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. ఏప్రి ల్‌ 26న 3893 టెస్ట్‌లు నిర్వహిస్తే 358 మందికి పాజిటివ్‌ వచ్చింది. 27న 4700 మందికి పరీక్షలు చేస్తే 633 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 మంది మృతి చెందారు. ఇదే స్థాయిలో మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది.


ఇక మే నెల 1వ తేదీన 2430 టెస్ట్‌లు నిర్వహిస్తే 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతులు 8 మంది ఉన్నారు. 7న  1654 టెస్ట్‌లు నిర్వహిస్తే 307 మందికి పాజిటివ్‌ వచ్చింది. 15 మంది మృతి చెందారు. 8న 2456 టెస్ట్‌ లు నిర్వహిస్తే 345 మంది పాజిటివ్‌, 12 మంది మృతి చెందారు. 9న 3004 మందికి టెస్ట్‌లు చేస్తే 378 మందికి పాజిటివ్‌ రాగా, 14 మంది చని పోయా రు.  ఈ తీవ్రతకు ఎన్నికల ప్రచారమే కారణమన్న అభిప్రాయాలు న్నాయి. 


ఇక మృతుల సంఖ్య పెరుగుతుండడం జిల్లా యంత్రాంగంలోనూ  ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కలు ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా చెబుతున్నవే. అనధికారికంగా వీటికి రెట్టింపు మరణాలు ఉండే అవకాశం ఉందని వైద్య వర్గాలే అంటున్నాయి. మరణాల వివరాలను  ప్రైవేట్‌  ఆస్పత్రులు కొన్ని  ప్రభుత్వ అధికారులకు అందించడం లేదన్న సమాచారం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో వివరాలు తెలియకుండా పోతున్నాయి. 


ఎన్నో కారణాలు..

మొదటి వేవ్‌ కరోనా నియంత్రణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరోనా విపత్తు ఏర్పడి ఏడాది దాటడంతో ప్రభుత్వం, ప్రజలూ నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. తీవ్రత తగ్గుముఖం పట్టిందని భావించి ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్ళు కొనసాగించారు. ప్రజలు గుమిగూడే అవకాశాలున్న ప్రాంతాల్లోనూ  ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే యధేచ్ఛగా సంచరించారు. దీనికి తోడు సెకండ్‌ వేవ్‌ కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరణాలు సైతం గణనీయంగా పెరుగుతు న్నా యి. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ ఏరియాలు, ఐసోలే షన్‌ సెంటర్‌లు ఎక్కడా కానరావడం లేదు. ఇది కూడా కరోనా కేసుల నియంత్రణ కాకపోవడానికి  కారణంగా నిలుస్తోంది. 


పల్లెబాట పట్టిన వైరస్‌ 

కరోనా కల్లోలం పల్లెలకు పాకింది. కరోనా వైరస్‌ ప్రతీ పల్లెను పలకరిస్తోంది. మేజర్‌ గ్రామ పంచాయతీలు, మండలకేంద్రాల్లో విపరీతంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వల్ల పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వారు తిరిగి పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు కరోనా అంటే గతంలో ఉన్న భయం తేలి పోవడంతో కూడా నియంత్రణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో గ్రామాల ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ గ్రామ కట్టడి ఏర్పాటు చేసుకునే వారు. ఇపుడు అలాంటి పరిస్థితులు లేక పోవడంతో కరోనా తీవ్రత పెరుగుతోంది. పల్లెలు నడుం కట్టి స్వీయ నియంత్రణ దిశగా అడుగులు వేయడం ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-05-10T06:53:45+05:30 IST