ఇంటిపై హక్కు సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2021-10-25T05:28:47+05:30 IST

నలభై ఏళ్ల క్రితం రుణాలు తీసుకుని ఇళ్లను కట్టుకున్న వారికి ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌’ ద్వారా శాశ్వత హక్కు కల్పించాల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంటిపై హక్కు సాధ్యమేనా..?

  1. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌పై అనుమానాలు
  2. ప్రైవేటు, గ్రామ ఉమ్మడి భూమిలో నివాసాలు
  3. వాటిపై హక్కులు కల్పిస్తామంటే నమ్మని జనం
  4. సర్వేకి వెళ్లే సిబ్బంది, వలంటీర్లలోనూ సందేహాలు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): నలభై ఏళ్ల క్రితం రుణాలు తీసుకుని ఇళ్లను కట్టుకున్న వారికి ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌’ ద్వారా శాశ్వత హక్కు కల్పించాల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్వే వచ్చే నెలలోపూ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తోంది. నామమాత్రపు ధర చెల్లిస్తే శాశ్వత హక్కు కల్పిస్తామని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే శాశ్వత భూ హక్కు విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో గృహ యజమానులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అఽధికారులు కూడా సర్వేపై సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లుకు కేవలం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి పంపించారు. 1980వ దశకం నుంచి రుణాలు తీసుకున్నవారు, రుణాలు పొందని వారి జాబితాను వలంటీర్లకు అందజేసి, సర్వే చేయాలని పంపించారు. నామమాత్రపు ధరలకే ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని వలంటీర్లు చెబుతున్నా ఆచరణలో సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 


జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల ఇళ్లు 


శాశ్వత హక్కు కల్పించదలిచన ఇళ్లు జిల్లా వ్యాప్తంగా 4,45,845 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1980 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇలా రుణాల ద్వారా ఇళ్లు కట్టుకున్న వారిని 2005 సంవత్సరానికి ముందు, తర్వాత అంటూ రెండు రకాలుగా విభజించారు. 2005కు ముందు 1,30,477 ఇళ్లు ఉన్నట్లు, 2005 తర్వాత 2,49,818 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 3,75,292 ఇళ్లను కస్టర్ల వారీగా మ్యాపింగ్‌ చేశారు. మిగిలినవి మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. అసలు లబ్ధిదారులు, కొన్నవారు, రుణాలు తీసుకున్నవారు, నివాసం ఉంటున్నవారు అంటూ ఒక్కొక్కరిని ఒక్కో కేటగిరీ కింద పరిగణిస్తూ ఏ,బీ,సీ,డీ వర్గాలుగా విభజించారు. కేటగిరీ వారిగా రూరల్‌, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో ఉండే ఇళ్లకు వివిధ రకాల ధరలను నిర్ణయించారు. విభాగాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌కు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, దరఖాస్తు చేసుకున్నా గృహ రుణాలను పొందని వారికీ ప్రయోజనం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. అయితే ఇక్కడే గందరగోళానికి తావిస్తోంది. ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. వీరికి ఏ విధంగా ప్రయోజనాలు కల్పిస్తారనేది అందరి సందేహం.


గందరగోళం


హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరై, ఇళ్లు కట్టుకున్న వారితో పాటు రుణాలు రాకపోయినా బయట అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాలను క్రమబద్ధీకరిస్తే ప్రయోజనం ఉంటుంది. మరి ప్రైవేటు భూముల్లో, గ్రామ ఉమ్మడి భూముల్లో నిర్మించుకున్న నివాసాలను ఎలా క్రమబద్ధీకరిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఆక్రమించిన, చేతుల మారిన ప్రభుత్వ స్థలాలు క్రమబద్ధీకరణ జరిగాయి. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాలో ప్రైవేటు స్థలాలు, గ్రామ ఉమ్మడి భూముల్లో కట్టుకున్న ఇళ్లు కూడా ఉన్నాయి. క్రమబద్ధీకరణ అంటే ఆ ఇంటిపై శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలను మంజూరు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకైతే ‘డీ’ పట్టాలు ఇస్తారు. మరి ప్రైవేటు స్థలాలకు ఏ విధంగా ఇస్తారు? ఏ లెక్కన రిజిస్ట్రేషన్‌ చేస్తారు? అనేది ప్రశ్న. నామమాత్రపు ధరలు అంటున్నారు. మార్కెట్‌ ధరలు పెరిగితే వాటిని కూడా తగ్గిస్తారా? అనేది మరో ప్రశ్న. ప్రైవేటు, గ్రామ ఉమ్మడి భూముల్లో నిర్మించుకున్న నివాసాల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నందున వీటిని తక్కువ ధరకు క్రమబద్ధీకరించడం ఎలా సాధ్యం?  అనే సందేహం వ్యక్తమవుతోంది. మరికొన్ని చోట్ల వారసత్వంగా వచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నా, రిజిస్ట్రేషన్‌ జరగలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు వీటిని కూడా నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ప్రైవేటు స్థలాల మార్కెట్‌ విలువ ఈ 40 ఏళ్లలో ఎన్నో రెట్లు పెరిగింది. రిజిస్ట్రేషన్‌ విలువ కూడా బాగా పెరిగింది. పెరిగిన రిజిస్ట్రేషన్‌ కంటే తక్కువ ధరకే రిజిస్ట్రేషన్‌ చేయగలరా? అన్న విషయంపై స్పష్టత లేదు.


సవ్యంగా సాగేనా..? 


ఎపుడో తీసుకున్న లోన్లకు ఒకేసారి నామమాత్రపు ధర చెల్లిస్తే రుణ విముక్తులను చేస్తామని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం బాకా ఊదుతున్నాయి. అయితే డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత అంతా సక్రమంగానే ఉంటుందా? లేక తిరకాసు ఏమైనా ఉంటుందా? అన్న అనుమానం చాలామందిని వేధిస్తోంది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ కింద ప్రైవేటు స్థలాలైనా, ప్రభుత్వ స్థలాలైనా.. ఇప్పటికే నిర్దేశించిన రిజిస్ట్రేషన్‌ ధరలను ఎలా తగ్గించగలరనే సందేహం వ్యక్తమౌతోంది. సాధారణంగా భూముల రిజిస్ట్రేషన్‌ ధరలను జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో మదింపు చేసి నిర్ణయిస్తారు. ఆ ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరపాల్సి ఉంటుంది. ఇది చట్టబద్ధమైన అంశం. ఈ రకంగా చూసినా చట్టాన్ని సవరించి తక్కువ ధరలకు రిజిస్ట్రేన్లు చేయగలరా? ఒకవేళ చేసినా ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Updated Date - 2021-10-25T05:28:47+05:30 IST