హైదరాబాద్ ‘రియల్ ఎస్టేట్’... కుప్పకూలనుందా ?

ABN , First Publish Date - 2020-08-07T01:59:51+05:30 IST

ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా కుప్పకూలే సంకేతాలు కనిపిస్తున్నాయా ? ఈ ప్రశ్నకు... ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. రెండేళ్ల క్రితం రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో చదరపు అడుగు(ఎస్‌ఎఫ్‌టీ)కు రూ. 3 వేల వరకు పలికిన ధరను... రియల్టర్లు, ప్రముఖ బిల్డర్లు ఈ ఏడాది జనవరి నాటికి రెండింతలకు పైగా పెంచివేశారు.

హైదరాబాద్ ‘రియల్ ఎస్టేట్’... కుప్పకూలనుందా ?

హైదరాబాద్ : ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా కుప్పకూలే సంకేతాలు కనిపిస్తున్నాయా ? ఈ ప్రశ్నకు... ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది.  రెండేళ్ల క్రితం రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో చదరపు అడుగు(ఎస్‌ఎఫ్‌టీ)కు రూ. 3 వేల వరకు పలికిన ధరను... రియల్టర్లు, ప్రముఖ బిల్డర్లు ఈ ఏడాది జనవరి నాటికి రెండింతలకు పైగా పెంచివేశారు. 


మణికొండ సమీపంలోని పుప్పాలగూడ, అలకాపూర్‌ టౌన్‌షిప్‌ ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటిలో అయితే రూ. 5,200, కొండాపూర్‌ ప్రాంతంలో రూ. 6,200, గచ్చిబౌలి ప్రాంతంలో రూ. ఏడు వేలు, మియాపూర్‌లో అయితే రూ. 5,200... ఇలా మొత్తంగా ఒక 2 బీహెచ్‌కేకు కనీసంగా రూ. 75 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఉదాహరణకు నార్సింగిలో 1448 ఎస్‌ఎఫ్‌టీ వైశాల్యమున్న 2 బీహెచ్‌కే ధర... తక్కువలో తక్కువ ఎస్‌ఎఫ్‌టీకి రూ. 4,600 ఉందనుకుందాం. అంటే... ఫ్లాట్‌ విలువ రూ. 70,10,800 అవుతుంది. దీనికి అదనంగా ఐదు శాతం మేర జీఎస్టీ(రూ. 3.50,540)ని చెల్లించాలి.


అలాగే మ్యుటేషన్‌ ఫీ రూ. 35,054 చెల్లించాలి. వీటితోపాటు ఆరు శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు... అంటే.. రూ. 4,20,648 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు... రూ. 10 వేల మేరకు డాక్యుమెంటరీ ఛార్జీలు, రూ. 35 వేల  మేరకు ఏడాది మెయింటేనెన్స్‌ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందన్న విసయం తెలిసిందే. అంటే... మొత్తంగా రూ. 78,61,794 చెల్లించాలి.


2 బీహెచ్‌కేకు ఇంత ధర చెల్లించాల్సి రావడంతో మధ్య తరగతి ప్రజలు ఇక అపార్ట్‌మెంట్‌ ఆశలు వదులుకుంటూ వస్తున్నారు. అయితే... సరిగ్గా ఇదే సమయంలో కరోనా మహమ్మారి వెంటపడడంతో బిల్డర్లు ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు.


ఢిల్లీలో జరిగిందిదీ... షీలాదీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రోలు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిణామాల నేపధ్యంలో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీ శివార్లలోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా రేట్లు ఇష్టారాజ్యంగా పెరిగిపోయాయి. బిల్డర్లు అపార్ట్‌మెంట్లను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసిన పరిస్థితి. ఇక... డబ్బు తీసుకుని కూడా... సమయానికి డెలివరీ ఇవ్వని సందర్భాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇక పెద్ద ప్రాజెక్టులు,  సెలబ్రిటీలతో ప్రచారం చేయించిన ప్రాజెక్టులు కూడా పెద్ద సంఖ్యలోనే జనం నెత్తిన టోపీ పెట్టాయి.


డబ్బులు కట్టినవాళ్లంతా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో... రూ. 70 లక్షల వరకు పలికిన అపార్ట్‌మెంట్‌ ధరలు ఇప్పుడు రూ. 35-40 లక్షలకు దిగాయి. కొత్త ప్రాజెక్టులు కూడా చవక ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొనేవారు లేక స్కీమ్‌లతో ఆకట్టుకునేందుకు బిల్డర్లు యత్నిస్తున్నారు. ఇక ‘పెరుగుట విరుగుట కొరకే’ చందాన... హైదరాబాద్‌ లో రెండేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రేట్లు మళ్లీ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.


అప్పుడు డబుల్‌ బెడ్‌ రూమ్‌ రూ. 40 లక్షల్లోపు ఉంటే ఇప్పుడు రూ. 80 లక్షల నుంచి రూ. 1 కోటి చెల్లించాల్సి వస్తోంది. స్టాండ్‌ అలోన్‌ అపార్ట్‌మెంట్‌కు కూడా రూ. 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ధరల ప్రభావంతో అపార్ట్‌మెంట్ల వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సమయంలో కోవిడ్‌ మహమ్మారి కూడా పంజా విసిరింది. మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చిన్న చిన్న ప్రాజెక్టులు... అంటే ఐదారు వందల గజాల్లో అపార్ట్‌మెంట్‌లు కట్టేవారు కూడా తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కనీసం ఏడాది ఆలస్యమవుతుందని చెబుతున్నారు.


భారీ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులు పూర్తి చేయలేక చేతులెత్తేసే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదముందన్న అభిప్రాయాలూ వినవస్తున్నాయి. కార్మికుల లభ్యత తగ్గడం, ఆర్థిక వనరుల లేమి, ఉద్యోగ భద్రత క్షీణించిపోవడం వంటి పలు అంశాలు కొనుగోలుదారులపై ప్రభావం చూపిస్తున్నాయి.


మొత్తంమీద ‘ఇల్లు కొనడంకంటే అద్దెకుండడమే మేలు’ పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో బిల్డర్లు మళ్లీ ఆకాశం నుంచి నేల మీదికి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో... ఢిల్లీ తదితర నగరాల్లో జరిగినట్లుగా... రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలిన పరిస్థితి రాకముందే బిల్డర్లు మేలుకుని, అత్యాశకు పోకుండా సహేతుకమైన ధరలతోనే అపార్ట్‌మెంట్లనందిస్తే... కొనుగోలుదారులకు, బిల్డర్లకు, రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. 

Updated Date - 2020-08-07T01:59:51+05:30 IST